దారుణం.. గర్భం దాల్చిన ముగ్గురు విద్యార్థినులు..!
By Newsmeter.Network Published on 28 Dec 2019 12:01 PM GMTకొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల హాస్టల్‌లో దారుణం జరిగింది. ముగ్గురు విద్యార్థినులు గర్భం దాల్చారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కాగా, ముగ్గురు విద్యార్థినుల ఆరోగ్యం బాగలేకపోవడంతో హాస్టల్ అధికారులు రిమ్స్‌కు తీసుకెళ్లారు. వైద్య పరీక్షల్లో విద్యార్థినులు గర్భం దాల్చినట్టు తేలింది. ఈ విషయం బయటకు పొక్కకుండా హాస్టల్ అధికారులు దాచిపెట్టారు. ఇప్పుడు బయటకు పొక్కడంతో ఘటనపై ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు విచారణ చేస్తున్నారు.
అయితే, కొమరం జిల్లాలో గత కొన్ని రోజులుగా అరాచక శక్తులు పూర్తిగా పెరిగాయని చెప్పుకోవచ్చు. ఓ అమ్మాయి మిస్సైన ఘటన మరువక ముందే సమత ఉదంతం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా, ట్రైబల్ వెల్ఫేర్‌కు సంబంధించి
కొమరంభీం జిల్లాలో డిగ్రీ చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు గర్భం దాల్చడం కలకలం రేపుతోంది.
ఆలస్యంగా వెలుగు చూసిందని చెప్పుకుంటున్న ఈ సంఘటన గత నెల 21న చోటు చేసుకుంది. ప్రధానంగా అనారోగ్యానికి గురైన ఆ ముగ్గురు విద్యార్థినులను ఆ రోజు చికిత్స నిమిత్తం హైదరాబాద్ రిమ్స్‌కు తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించిన గర్భం దాల్చినట్టు నిర్ధారణ చేయడంతో వారిని ఆసీఫాబాద్‌లో ఉన్న హాస్పిటల్‌కు తరలించడం జరిగింది. ఈ సంఘటనపై కళాశాలలకు సంబంధించిన అధికారి ఆర్సీవో లక్ష్మయ్య విచారణ చేపడుతున్నారు.
గర్భం దాల్చిన ముగ్గురు విద్యార్థినులు గిరిజనులు కావడం గమనార్హం. అయితే, కల్లబొల్లి మాయ మాటలు చెప్పి విద్యార్థినులను లైంగికంగా లొంగదీసుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. కళాశాల సిబ్బందితోపాటు స్థానికంగా ఉంటున్న కొంతమందిపై అధికారులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగానే విచారణ జరుగుతోంది. ఇప్పటి వరకు జరిగిన విచారణ వివరాలను వెల్లడించేందుకు అధికారులు విముఖత చూపారు. పూర్తి వివరాలను ఈ రోజు సాయంత్రంలోపు వెల్లడించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఈ వ్యవహారంలో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది.
ఎందుకంటే విద్యార్థినులు పేదరికం కారణంగా తల్లిదండ్రులను వదిలేసి హాస్టళ్లలో ఉంటారు చదువుకుంటుంటారు. వారిని చాలా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ప్రభుత్వం అధికారులకు ఇస్తుంది. దాంతోపాటు యుక్త వయసుకు వచ్చిన అమ్మాయిలను చాలా కేర్‌గా చూడాల్సి ఉంటుంది. మహిళా సిబ్బంది ప్రధానంగా అక్కడ ఉండాల్సి ఉంటుంది. కానీ, అలాంటి చర్యలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదు. ఏదేమైనా సంఘటనకు సంబంధించి అసలు కారకులెవరో తెలియాలంటే ఈ రోజు సాయంత్రం వరకు ఆగాల్సిందే.