ఆడాళ్లూ..వీళ్లే మోస్ట్ డిజైరబుల్ మగాళ్లు
By రాణి Published on 1 Feb 2020 7:38 AM GMTవాళ్లను చూస్తే అమ్మాయిలు ఇలాంటి పార్ట్ నర్ కావాలనుకుంటారు. గుండె వేగంగా కొట్టకుంటుంది. మోకాళ్లు ఒక్కసారిగా బలహీనమైపోతాయి. అలాంటి మోస్ట్ డిజైరబుల్ బుల్లితెర పురుషపుంగవులు వాళ్లు. టైమ్స్ ఆఫ్ ఇండియా వెలువరించిన తాజా మోస్ట్ డిజైరబుల్ లిస్టును చూస్తే కండల వీరులు ఉన్నారు. కత్తిలాంటి కుర్రాళ్లూ ఉన్నారు. అడక్కుండానే చొక్కా విప్పి కండలు చూపించేవాళ్లు ఉన్నారు. స్లీవ్ లెస్ బనియన్లలో జబ్బల పుష్టి చూపించే వీరులూ ఉన్నారు. కానీ టాప్ పొజిషన్ మాత్రం బోల్డంత సెన్సాఫ్ హ్యూమరున్న సరదాపురుషుడు ప్రదీప్ మాచిరాజుదే.
ఈ ఏడాది బుల్లితెర మోస్ట్ డిజైరబుల్ మగమహారాజులు ఇదిగో వీళ్లే...
1. బుల్లితెర యాంకర్ మారాజు మా మాచిరాజు ప్రదీప్ 2017 లో ఒక సారి టాప్ పొజిషన్లో ఉన్నాడు. అలాంటిది రెండో సారి ఎలక్టవుతాడని ఎవరనుకుంటారు. కానీ యాంకర్ గా జోకులు క్రాక్ చేస్తూ, సెలబ్రిటీలను ఆట పట్టిస్తూ, తన మీద తానే జోకులు వేసుకుంటూ ప్రదీప్ తెలుగు ప్రేక్షకుల గుండెల్ని దోచుకున్నాడు. పక్కింటి కుర్రాడిలా ఉండే ప్రదీప్ డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడినా ఎవరూ పట్టించుకోవడం లేదు. వోట్లు కోట్లు కోట్లు గా ఆయన పక్షానే గుమ్మరించేస్తున్నారు.
2. అలీ రెజా - పసుపు కుంకుమలో అర్జున్ గా బుల్లితెరను ఆక్రమించేసిన అలీ రెజా బిగ్ బాస్ త్రీ తో సుపరిచితుడైపోయాడు. కండలు తిరిగిన సిక్స్ ప్యాక్ శరీరం, గుడ్ లుక్స్ ఆయన్ను రన్నరప్ చేశాయి.
3. చందన్ కుమార్ - మరో కండల వీరుడు. ఎదురు రొమ్ము, సిక్స్ పాక్స్, బండరాయి లాంటి బైసెప్స్, పర్ ఫెక్ట్ పెక్టొరల్స్ తో కన్నడ వ్యూయర్స్ సపోర్టు కొల్లగొట్టిన చందన్ ఇప్పుడు సావిత్రమ్మ గారి అబ్బాయిగా అలరిస్తున్నాడు. నిత్యం జిమ్ లో రాటు దేలే ఈ పోటుగాడికి బోల్డంత మంది ఫీమేల్ ఫ్యాన్స్ ఉన్నారు.
4. శివకుమార్ మరిహల్ - తెలుగు బుల్లితెరపై ఫ్రెష్ ఫేస్. మౌనరాగం సీరియల్ హీరో. కిల్లర్ లుక్స్, కిల్లర్ స్మైల్, కిల్లర్ యాక్టింగ్. మొత్తం మీద మనోడు కిల్లర్.
ప్రదీప్ టాప్ 1 ప్లేస్ దక్కించుకోగా...యాంకర్ రవి 8 వ స్థానానికే పరిమితమయ్యాడు. మిగతా వారంతా వివిధ ఛానెల్స్ లో ప్రసారమవుతున్న డైలీ సీరియల్స్ కథానాయకులే.
5. గోకుల్ - గోకుల్ ముందు తమిళ టీవీని ఏలేశాడు. ఆ తరువాత తెలుగులో రాధమ్మ కూతురు, జ్యోతి వంటి సీరియల్స్ లో ఏలేస్తున్నాడు. లోతుగా చూసే కళ్లు, అస్త్రసన్యాసం చేయించేంత అంతమైన కళ్లు, మొఖానికి అందమిచ్చే గడ్డం, మంచి బాడీల మాలిక్ మన గోకుల్. మొత్తం మీద మహిళా జన మానస చోరుడు.
6. అఖిల్ సార్థక్ - ఎవరే నువ్వు మోహిని సీరియల్ తో అందరికీ పరిచయమైన అఖిల్ గతంలో టైమ్స్ డిజైరబుల్ లిస్టులో మూడో స్థానంలో నిలిచాడు. మంచి కండల వీరుడు. కండల్ని చూపించేందుకు ఏ మాత్రం సిగ్గుపడడు. సీరియల్స్ లో రాణిస్తున్నాడు.
7. వీజే సన్నీ - కళ్యాణ వైభోగమే సీరియల్ ద్వారా మహిళా మనోభిరాముడైన సన్నీ ఇప్పుడు వెండితెర మీద తళుక్కమనేందుకు కూడా ప్రయత్నిస్తున్నాడు. సీరియల్ లో మంచి భర్తగా నటించిన ఈ కుర్రాడు తమ భర్తైతే బాగుండునని బోల్డంత మంది అమ్మాయిలు అనుకుంటున్నారట.
8. యాంకర్ రవి - పటాస్, ఢీ జూనియర్స్, ఫామిలీ సర్కస్, వన్ షో, కిర్రాక్ ఈ షోలన్నిట్లోనూ ఈ షోమాన్ ఉన్నాడు. అందుకే అవంత పాపులర్ అయ్యాయన్నది ప్రజాభిప్రాయం. మనోడి కామిక్ టైమింగ్, చిరునవ్వు, అమాయకుడిలా కనిపించగలిగే మాయకత్వం ఎంతో పాపులారిటీని తెచ్చి పెట్టాయి.
9. ఆకర్ష్ బైరమూడి - తెలుగులో అక్కా చెల్లెలు, కన్నడలో సీతా వల్లభ వంటి సీరియల్స్ ఆకర్ష్ పట్ల ఆకర్షణను పెంచాయి. మహిళా ఫ్యాన్లను తెచ్చి పెట్టాయి. పలకరించే కళ్లు, రమ్మని పిలిచే నవ్వు, భలే స్క్రీన్ ప్రెజెన్స్ మనోడిని చార్ట్ బస్టర్ గా చేసేశాయి.
10. రోహిత్ సాహ్నీ - నీలికలువలు సీరియల్ తో రంగ ప్రవేశం. అభిలాషతో అగ్ర స్థానం. టూకీగా ఇదీ మనోడి జర్నీ. చిరు గొడవలు సినిమాతో వెండితెరలోకి కూడా వచ్చేస్తున్నాడు. మాంఛి టోన్డ్ బాడీ ఉన్న ఫిట్నెస్ ఫ్రీక్ రోహిత్. మంచి సరదా పర్సనాలిటీ ఉన్న రోహిత్ పాపులారిటీ అంతకంతకీ పెరుగుతుంది.
వీరే కాదు. 11 వ స్థానంలో పరివార్ లీగ్ స్టార్ అర్బున్ యజత్, 12 వ స్థానంలో గోరింటాకు ఫేమ్ నిఖిల్ మాలియాక్కల్, 13 లో మధుమాసం హీరో సూరజ్ లోక్రే, 14 వ స్థానంలో వర్షం స్టార్ వాసుదేవ రావు, పదిహేనో స్థానంలో బిగ్ బాస్ స్టార్ రవికృష్ణ ఉన్నారు. వీరిలో కొందరు వచ్చే ఏడాది కూడా మోస్ట్ డిజైరబుల్ గానే ఉండారన్నది అంచనా.