మద్యం కోసం నాలాలోకి దూకిన వ్యక్తి.. బయటకు రప్పించేందుకు తంటాలు పడ్డ పోలీసులు

By Newsmeter.Network
Published on : 8 April 2020 1:17 PM IST

మద్యం కోసం నాలాలోకి దూకిన వ్యక్తి.. బయటకు రప్పించేందుకు తంటాలు పడ్డ పోలీసులు

కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. దీనిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను విధించింది. ఈనెల 14 వరకు లాక్‌డౌన్‌ కొనసాగనుంది. అటు తెలంగాణలోనూ లాక్‌డౌన్‌ పకడ్బందీగా సాగుతుంది. లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో మద్యం షాపులు మూతపడ్డాయి. అందరూ ఇండ్లకే పరిమితం కావాలని ప్రభుత్వాలు ఆదేశించడంతో బయటకు వచ్చిన వారిని తిరిగి పోలీసులు ఇండ్లకు పంపించేస్తున్నారు. దీంతో మద్యం ఎక్కడా దొరికే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో పలువురు మద్యం దొరక్క మృతిచెందగా, పలువురు మైడ్‌ పనిచేయక ఎర్రగడ్డ మెంటల్‌ ఆస్పత్రికి తరలించారు. తాజాగా ఓ మందు బాబు వీరంగం సృష్టించాడు. పోలీసులను ముప్పు తిప్పలు పెట్టించాడు. డ్రెయినేజీలోకి దూకి మందు బాటిల్‌ కోసం డిమాండ్‌ చేశాడు.

Also Read :కరోనా వ్యాప్తిని అడ్డుకొనేందుకు ప్రభుత్వం దృష్టి

హైదరాబాద్‌లోని రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం కోసం ఓ యువకుడు ఎక్కడ వెతికినా దొరక్క పోవడంతో తట్టుకోలేక చివరకు నాలాలోకి దూకాడు. మోకాళ్ల లోతు మురికి నీటిలో నిలబడి నాకు మద్యం సీసా కావాలంటూ, లేకపోతే నేను చనిపోతానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు యువకుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా మద్యం బాటిల్‌ కావాలని అనడంతో చిన్న బాటిల్‌ను తెప్పించి యువకుడికి ఇచ్చారు. దీంతో యువకుడు నాలాలోని మురికి నీటిలోనే ఉండి మద్యం తాగాడు. చివరకు ఒడ్డుకు చేరుకోవటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా అంతకు ముందు మందుబాబు పోలీసులను ముప్పతిప్పలుపెట్టాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈవీడియోను చూసిన నెటిజర్లు కరోనాతో దేశమంతా అతలాకుతలం అవుతుంటే.. నీ మందు గొడవేంటిరా బాబూ.. అంటూ ముక్కున వేలేసుకున్నారు

Next Story