హిందూ మహాసముద్ర మట్టం పెరుగుతోంది..

By Newsmeter.Network  Published on  25 Dec 2019 2:38 PM GMT
హిందూ మహాసముద్ర మట్టం పెరుగుతోంది..

హిందుమహా సముద్ర మధ్య భాగంలో గత రెండు వందల సంవత్సరాలలో నీటి మట్టం ఒక మీటర్ మేరకు పెరిగిందని తాజా అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. నేచర్ జియో సైన్స్ అన్న పరిశోధక పత్రిక లో ఇటీవల ప్రచురితమైన పరిశోధనా వ్యాసంలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. సముద్రంలో ఏర్పడే కోరల్స్, వాటి తాలూకు శిలాజాలను అధ్యయనం చేస్తే సముద్రం మట్టంలో వచ్చిన మార్పులను గుర్తించవచ్చు.

ఈ కోరల్ శిలాజాలు సముద్ర గర్భంలో ఏ మట్టంలో దొరుకుతాయన్న దానిని బట్టి దాని వయసును గుర్తించవచ్చు. అదే విధంగా వందల ఏళ్ల క్రితం సముద్ర మట్టం ఎంత మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనిని పరిశీలించి చూస్తే సముద్ర మట్టాలు పెరుగుతున్నాయన్నది అర్థమౌతుందని ప్రధాన పరిశోధకుడు, కెనడాలోని ఫ్రేజర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పాల్ కెంచ్ తెలియచేశారు. గత రెండు వేల ఏళ్లుగా సముద్ర మట్టంలో పెద్దగా మార్పు రాలేదు. కానీ పారిశ్రామికీకరణ వేగం పెరిగిన తరువాత నుంచి సముద్ర మట్టాల ఎత్తు పెరుగుతోందని ఈ అధ్యయనం తెలియచేస్తోంది.

ఈ అధ్యయనాల వల్ల సముద్ర మట్టాలు పెరిగితే కోరల్స్ ఏ విదంగా స్పందిస్తాయన్నది అర్థం చేసుకోవచ్చు. సముద్రంలోని వివిధ ద్వీపాల పరిస్థితి ఏమవుతుందో కూడా అర్థం చేసుకోవచ్చు. 2017 నుంచి జరుగుతున్న ఈ అధ్యయనం ద్వారా సముద్ర ద్వీపాల్లో, సముద్ర తీరాల్లో నివసిస్తునన సముదాయాల స్థితిగతుల గురించి, రానున్న పర్యావరణపరమైన ప్రమాదాల గురించి అర్థం చేసుకోవచ్చు. పర్యావరణ మార్పులు ఈ విధంగానే కొనసాగితే సముద్ర మట్టం మరింత పెరిగే ప్రమాదం ఉందని, ఫలితంగా అక్కడ నివసించే సముదాయాలకు ప్రమాదాలు పెరుగుతాయని అధ్యయనం చెబుతోంది.

Next Story