శోభన్ బాబుగా ఆయనే..!

By సుభాష్  Published on  17 Feb 2020 10:34 AM GMT
శోభన్ బాబుగా ఆయనే..!

కంగనా రనౌత్.. ఏ సినిమా చేసినా అందులో వైవిధ్యత దాగి ఉంటుంది. అందుకు ఉదాహరణలు ఆమె గతంలో చేసిన సినిమాలే..! అద్భుతమైన క్యారెక్టర్లు చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న కంగనా.. ప్రస్తుతం తమిళుల దైవం.. అమ్మగా కొలిచే 'జయలలిత' పాత్రను పోషిస్తోంది. ఇటీవలి కాలంలో బయోపిక్ లు బ్లాక్ బస్టర్లు అవుతున్న తరుణంలో జయలలిత జీవితచరిత్ర అయిన 'తలైవి' పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎ.ఎల్. విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. టీజర్ ఈ మధ్యనే విడుదలవ్వగా.. యంగ్ జయలలితగా కంగనా రనౌత్ పూర్తీ న్యాయం చేసిందనే అంటున్నారు.. కానీ రాజకీయాల్లోకి వచ్చాక జయలలిత క్యారెక్టర్ ను చూపించడానికి చేసిన ప్రయత్నం మాత్రం పూర్తిగా బెడిసికొట్టింది. ఏదో ప్లాస్టిక్ బొమ్మలా మేకప్ వేశారంటూ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఇప్పటికే జయలలిత జీవిత చరిత్రపై వెబ్ సిరీస్ కూడా వచ్చేసింది.. నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో మరో సినిమా కూడా రూపుదిద్దుకుంటోంది.. వీటన్నిటినీ మించి 'తలైవి' ని రూపుదిద్దాల్సిన బాధ్యత ఎ.ఎల్. విజయ్ అండ్ కో మీద ఉంది. అందుకే స్టార్ క్యాస్ట్ ను సినిమాలో తీసుకుంటున్నారు.

ఈ సినిమాలో శోభన్ బాబు పాత్రకు బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తాను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. జయలలిత జీవితంలో శోభన్ బాబుది ప్రత్యేకమైన అనుబంధం అని చాలా మంది చెబుతారు. కొందరు నాయకులు జయలలితపై అప్పట్లో విమర్శలు చేసినప్పుడు ఆయన పేరును కూడా ప్రస్తావించారు. వీరి అనుబంధం గురించి 'తలైవి' లో చూపించనుండడం సాహసమనే చెప్పాలి. కొంచెం తేడా కొట్టినా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నటభూషణ శోభన్ బాబు లా హావభావాలు పలికించడం.. ఆయన స్టైల్ ఆఫ్ డైలాగ్ డెలివరీ జిషు సేన్ గుప్తా అందుకుంటాడో లేదో చూడాలి. ఇప్పటికే జిషు శోభన్ బాబు సినిమాలు చూడడం మొదలుపెట్టారట.. లుక్స్ పరంగా కొన్ని మార్పుల కోసం ప్రయత్నిస్తూ ఉంది చిత్ర బృందం. 'అశ్వద్ధామ' సినిమాలో జిషు సేన్ గుప్తా ప్రతినాయకుడిగా కనిపించి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఎంజీ రామచంద్రన్ పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నారు. దక్షిణాది భాషల్లోనే కాకుండా హిందీలో కూడా 'తలైవి' విడుదలకానుంది.

Next Story
Share it