ఏపీ అసెంబ్లీలో 'మీడియం' రగడ

By రాణి  Published on  12 Dec 2019 11:00 AM GMT
ఏపీ అసెంబ్లీలో మీడియం రగడ

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయడంపై అసెంబ్లీలో గురువారం వాడి-వేడి చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టేందుకు తాము వ్యతిరేకం కాదన్నారు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. గురువారం అసెంబ్లీలో జరిగిన ఇంగ్లీష్ మీడియం పై చర్చలో ఆయన మాట్లాడారు. టీడీపీ హయాంలో ఉండగానే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టే అంశంపై చర్చించామని ఆయన గుర్తుచేశారు. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న జగన్ ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించి, ఇప్పుడు తామే ఆ భాషను కనుగొన్నట్లు వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తామెప్పుడూ అవకాశవాద రాజకీయాలు చేయలేదని, వైసీపీనే రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టేటపుడు తగిన సన్నద్ధత అవసరమని, అది ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు చంద్రబాబు. అలాగే ఇంగ్లీష్ మీడియాన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టే ముందు ఆయా పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులకు తగిన శిక్షణ ఇవ్వడం, పుస్తకాల్లో మార్పులు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. ఏ మీడియం చదవాలో ఎంపిక చేసుకునే విషయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకే వదిలేయాలన్నారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరిగా ఉండాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ...టీడీపీ హయాంలో కేవలం 35 శాతం స్కూళ్లలో మాత్రమే ఇంగ్లీష్ మీడియాన్ని అమలు చేశారన్నారు. మిగిలిన 66 శాతం పాఠశాలలను ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ఏడాదికి కనీసం రూ. 50 వేలు కూడా ఖర్చు చేయలేదన్నారు. గత ప్రభుత్వంలో చేయలేని పనులన్నీ ఇప్పుడు చేస్తుంటే ప్రతిపక్ష నేతలు అడ్డుపడుతున్నారని జగన్ ఆరోపించారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే నేను ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించినట్లు నిరూపించాలని సీఎం జగన్ చంద్రబాబుకు సవాల్ చేశారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై గట్టిగా వాదించడంతో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారన్నారు. ఐదేళ్లలో గవర్నమెంట్ స్కూళ్లను నిర్వీర్యం చేసినందుకు గత పాలకులు సిగ్గుతో తలదించుకోవాలన్నారు జగన్. తెలుగు సబ్జెక్ట్ పై తప్పుడు ప్రచారం చేస్తూ పేదవారికి ఇంగ్లీష్ మీడియం అందకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం చెందారు. పేదవారికి కూడా ఇంగ్లీష్ మీడియం చదువు అందించాలన్నదే తమ ప్రభుత్వ తాపత్రయమని జగన్ వెల్లడించారు. రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తో ముందుకు వెళ్తామని గర్వంగా చెబుతున్నామన్నారు.

Next Story