తెలంగాణ కాంగ్రెస్ కు కలిసిరాని 2019

By Newsmeter.Network  Published on  27 Dec 2019 6:44 AM GMT
తెలంగాణ కాంగ్రెస్ కు కలిసిరాని 2019

ఏ ఏడు చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.... బహుశః తెలంగాణ కాంగ్రెస్ 2019 గురించి ఈ పాటే పాడుకోవాలేమో! ఘనత వహించి, దశాబ్దాలు పాలించి, ఆధిపత్యం చెలాయించిన పార్టీ తెలంగాణలో పూర్తిగా చతికిలపడిపోయింది. 2019 లో పార్టీ పై దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది.

2018 ఎన్నికల్లో ఘోరాతిఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీకి 2019 లో అటు సంస్థాగతంగా, ఇటు ఎన్నికల పరంగా చాలా నిరాశను ఎదుర్కోవాల్సి వచ్చింది. గెలిచిన గుప్పెడు మంది ఎమ్మెల్యేల్లోనూ మెజారిటీ ఎమ్మెల్యేలు ప్లేటు ఫిరాయించి తెరాసలో విలీనం అయిపోవడంతో కాంగ్రెస్ విపక్ష హోదా తో పాటు, పార్టీ స్థాయిని కూడా కోల్పోయింది. మరో వైపు శాసన మండలిలో ఉన్న వారంతా తెరాసలో విలీనమైపోయారు. ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేల్లో కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి “తుమ్మితే ఊడే ముక్కు” లా ఉన్నారు. ఆయన ఉన్నది కాంగ్రెస్ లో. పొగిడేది బిజెపిని. దీంతో ఆయన అస్మదీయుడా తస్మదీయుడా తెలియని పరిస్థితి నెలకొంది.

ఎన్నికల్లో గెలవకపోయినా గట్టి నేతలుగా పేరొందిన డీ కె అరుణ, సునీతా లక్ష్మారెడ్డి వంటి నాయకులు అయితే బిజెపికి లేకపోతే టీఆర్ ఎస్ గూటికి చేరిపోయారు. పార్టీ ఇప్పుడు పలు జిల్లాల్లో అత్యంత బలహీనంగా ఉంది. లోకసభ ఎన్నికల్లో ఎలాగోలా మూడు సీట్లు గెలిచినా, జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినా పార్టీ ఆ వేగాన్ని నిలుపుకోలేకపోయింది. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ ప్రదర్శన నిరాశా జనకంగా ఉంది. జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగితే పార్టీ ఒక్కటంటే ఒక్క జిల్లా పరిషద్ ను సైతం గెలుచుకోలేకపోయింది. ఇక అన్నిటికన్నా పెద్ద దెబ్బ హుజూర్ నగర్ ఉప ఎన్నిక. కాంగ్రెస్ ఎప్పుడూ ఓడని హుజూర్ నగర్ లో తెరాస భారీ మెజారిటీని సాధించడం, అదీ ఆర్టీసీ సమ్మె జరుగుతున్న సమయంలో గెలవడం పార్టీని నిరాశ లోతుల్లో కూరుకుపోయేలా చేసింది.

పార్టీ పెద్దగా ఉద్యమాలే చేయలేదు

ఇప్పుడు ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ అద్యక్షపదవికి రాజీనామా చేశారు. పీసీసీ పదవి కోసం పోటీదారులు చాలా మందే ఉన్నా పార్టీకి నేతలు కరువయ్యారు. వీహెచ్, పొన్నాల వంటి నేతలు పార్టీలో ఉన్నా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టున్నారు. అన్ని సమావేశాలకూ తగుదునమ్మా అని హాజరై ఏమీ చేయకుండానే నాయకులుగా చలామణీ అయ్యే ఈ తరహా నేతలు “తిండికి తిమ్మరాజులు,.,. పనికి పోతరాజులు. ఏడాది పొడవునా పార్టీ పెద్దగా ఉద్యమాలే చేయలేదు. నిరసన కార్యక్రమాలు చేపట్టలేదు. ప్రజా పోరాటాలు చేయలేదు. రేవంత్ రెడ్డి లాంటి వారు ఎంతో కొంత చేసినా, ఆయనకు ఇంట్లో ఈగలమోతలా అసమ్మతి సమస్య ఎదురవుతున్నది.

2020 లో మునిసి”పోల్స్” తరుముకొస్తున్నాయి. కేసీఆర్ పట్ల నానాటికీ పెరుగుతున్న వ్యతిరేకతను ఉపయోగించుకుని, ఆయన్ను, ఆయన పార్టీని ఎన్నికల్లో ఓడించే విషయంలో కాంగ్రెస్ కు వ్యూహం లేదు. అధికారం కావాలన్న దాహం లేదు. సో... 2019 లాగానే 2020 కూడా నిరాశాజనకంగానే ఉండబోతోందా? ఏమో... ముందైతే క్యాలెండర్ మారనీయండి... ఆ తరువాత తలరాత మారుతుందేమో చూద్దాం.

Next Story