కొత్త బంగారు లోకానికి బాటలు వేసిన మోడ్రన్ టెక్కీ

By రాణి  Published on  28 Dec 2019 7:16 AM GMT
కొత్త బంగారు లోకానికి బాటలు వేసిన మోడ్రన్ టెక్కీ

ముఖ్యాంశాలు

  • సైబర్ సెక్యూరిటీ రెవల్యూషన్ - చేతుల్లో అడ్వాన్స్ చిప్స్ ఇంప్లాంటేషన్
  • చేతుల్లో అడ్వాన్స్ చిప్స్ ని ఇంప్లాంట్ చేయించుకున్న టెక్కీ
  • మోడ్రన్ చేతి ఇంప్లాంట్స్ సాయంతో తేలికైపోయిన అన్నిపనులు
  • ఆఫీస్ సెక్యూరిటీ చెక్ నుంచి కారు డోర్ అన్ లాక్ వరకూ సేవలు
  • సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవని చెబుతున్న టెక్కీ వర్క్ మన్

ఉతహ్ : ఉత్సాహం హద్దులుదాటి ఉరకలు వేసిన ఓ మోడ్రన్ టెక్కీ ఇప్పుడు నేరుగా తన రెండు చేతుల్లో యాండ్రాయిడ్ స్మార్ట్ చిప్స్ ని ఇంప్లాంట్ చేయించుకున్నాడు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 29 సంవత్సరాల వర్క మన్ అనే పేరుగల ఈ సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు రీల్ లైఫ్ లో చూసే టోనీ స్టార్క్ అవతారాన్ని రియల్ లైఫ్ లో ఎత్తాడు.

అతని రెండు చేతుల్లోనూ ఇంటిలోనూ స్మార్ట్ ఉపకరణాలను, కారు లాకింగ్ సిస్టమ్ ను, ఇంకా ఇతరత్రా భద్రతా పరమైన అంశాలను నియంత్రించే ఆర్.ఎఫ్.ఐ.డి, ఎన్.ఎఫ్.సి చిప్స్ ని ఆపరేషన్ చేయించుకుని మరీ ఇంప్లాంట్ చేయించుకున్నాడు. ఈ రెండు చిప్స్ మాగ్నటిక్ వేవ్స్ సాయంతో పనిచేస్తాయి. తన పర్సనల్ కంప్యూటర్ సాయంతో ఏ విధమైన కొత్త ప్రోగ్రామ్స్ ని అయినా ఈ టెక్కీ వీరుడు తన చేతుల్లో ఉన్న అడ్వాన్స్డ్ చిప్స్ లోకి పంపించేసుకోవచ్చు. వీటివల్ల కలిగే లాభాలను పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేస్తూ చుట్టుపక్కల వారందర్నీ ఆశ్చర్య పరచడమే కాక, వాళ్లంతా ఇతన్నిచూసి కుళ్లుకునేంత దర్జాని, కంఫర్ట్ ని ఒలకబోస్తున్నాడీ టెక్కీ రారాజిప్పుడు.

తను కారు దగ్గరికి వెళ్లగానే ఆ టెస్లా తలుపులు ఆటోమేటిగ్గా అన్ లాక్ అయిపోతాయి. తను ఆఫీస్ కి వెళ్లగానే నేరుగా చేతుల్లో ఉన్న అడ్వాన్స్ చిప్స్ అక్కడి స్కానింగ్ సిస్టమ్స్ కి సంకేతాలు పంపించేస్తాయి. దానివల్ల వర్క్ మన్ ఒక్క సెకన్ కూడా అందరిలాగే సెక్యూరిటీ స్కాన్ కోసం ఆగాల్సిన అవసరం ఉండదు. నేరుగా తలుపులు తెరుచుకుంటాయి లోపలికి వెళ్లిపోవచ్చు. ఇక ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా అతని పనే ఇంప్లాంట్స్ ప్రోగ్రామ్స్ కి కోడ్ రాయడం. తన చేతిలో పనే కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా చక్కగా చకచకా కోడ్ రాసిపారేస్తాడు క్షణాల్లో. దాంతో దేనికి కావాలంటే దానికోసం తన చేతుల్లో ఇంప్లాంట్ అయి ఉన్న అడ్వాన్స్ మాగ్నటిక్ చిప్స్ ని విచ్చలవిడిగా వాడేసుకునే అవకాశమూ అతని చేతుల్లోనే ఉంది.

గృహోపకరణాలన్నింటినీ చాలా తేలికగా నియంత్రించొచ్చు

వర్క్ మన్ ఇంట్లోకి వెళ్లగానే ఆటోమేటిగ్గా లైట్స్ ఆన్ అయిపోతాయి. తను బైటికెళ్లగానే అలాగే ఆటోమేటిగ్గా లైట్లు స్విచాఫ్ అయిపోతాయి. చిటికెలో ఉన్నచోటినుంచే లేవకుండానే మైక్రోఓవన్ ఆన్ చేసేసుకోవచ్చు. వాషింగ్ మెషీన్, ప్రిడ్జ్, టీవీ, కంప్యూటర్, హోమ్ లాకింగ్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్, గ్యాస్ కనెక్షన్, ఆన్ లైన్ షాపింగ్ పోర్టల్, వాటర్ సిస్టమ్, సీసీ కెమెరా, టెలీఫోన్, ఇంటర్నెట్ ఇలా ఒకటేమిటి నెట్ తో అనుసంధానమై ఉండే అన్ని వ్యవస్థల్నీ ఉన్నచోటినుంచే పనిచేయించగల సత్తా ఇప్పుడు అతని చేతులకు ఉంది.

అడ్వాన్స్ మాగ్నటిక్ చిప్స్ ని ఇంప్లాంట్ చేయించుకేటప్పుడు ఆపరేషన్ సమయంలో ఖచ్చితంగా బాధ కలుగుతుందని, కొంత నొప్పిని పంటి చివరన బిగబట్టాల్సి వస్తుందనీ, అయితే వాటివల్ల జీవితాంతం ఒనగూరే సౌకర్యాల గురించి తలచుకుంటే ఆ నొప్పి కేవలం చీమకుట్టినట్టుకూడా అనిపించదనీ చెబుతున్నాడీ వర్క్ మన్ అనే టెక్కీ బుల్లోడు. తనో వాలెట్ కోడ్ ని కంపెనీకి పంపిస్తాడు. దాని సాయంతో వాళ్లు ప్రోగ్రామ్ ని అప్ డేట్ చెయ్యడానికి కేవలం ఐదు నిమిషాల సమయం మాత్రం పడుతుంది. అప్ డేట్ అయిన క్షణంనుంచీ సేవలు ప్రారంభం. ఐదు మిల్లీ మీటర్ల వ్యాసం ఉన్న ఈ అడ్వాన్స్ డ్ మాగ్నటిక్ చిప్స్ ని వర్క్ మన్ తన చేతుల్లోకి అంటే మణికట్టు ప్రాంతంలోకి సర్జరీ ద్వారా చొప్పించుకోవడమూ సులభమే. వాటివల్ల ఇప్పటివరకూ తనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, ఇన్ ఫెక్షన్స్ లేవని చెబుతున్నాడీ టెక్కీ.

మొదట్లో అసలీ కాన్సెప్ట్ ను గురించి విని డాక్టర్లు వర్క్ మన్ ని ఛీ పొమ్మన్నారట. బంగారం లాంటి జీవితాన్ని ఇంత చిన్న వయసులో ఎందుకు పాడు చేసుకుంటావు, ఏదైనా అయితే నీ ప్రాణాలకే ప్రమాదం ఎందుకొచ్చిన తంటాలు ఇవన్నీ అంటూ బాగా మందలించారటకూడా. పట్టిన పట్టు విడిచిపెట్టడం అలవాటు లేని వర్క్ మన్ తను అనుకున్నది సాధించడంకోసం ఓ టాటూ ఆర్టిస్ట్ నీ, ఓ వెటర్నటీ డాక్టర్నికూడా కలిశాడట ఆఖరికి. కానీ తన కజిన్ కూడా డాక్టర్ కావడంతో అతని కల సాకారమయ్యింది. తన కజిన్ సాయంతోనే వర్క్ మన్ చేతుల్లో ఈ ఇంప్లాంట్స్ పెట్టించేసుకున్నాడు. తను చేసిన పని ప్రపంచంలోకెల్లా అత్యాధునికమైన సైబర్ సెక్యూరిటీ రెవల్యూషన్ కి నాంది అని వర్క్ మన్ అంటున్నాడు. చరిత్రలో తన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని సంబరపడిపోతున్నాడు. ఇప్పుడితని దగ్గరున్న అడ్వాన్స్ టెక్నాలజీవల్ల పోన్ ఎక్కడున్నా ఇట్టే కనిపెట్టేయొచ్చు. కాబట్టి తన ఫోన్ ఎప్పటికీ తనను విడిచివెళ్లే ప్రమాదం బతికున్నన్నాళ్లూ ఈ టెక్కీకి లేదు.

Next Story