స్కూల్ టీచర్ కు లైంగిక వేధింపులు..భరించలేక..!

By రాణి  Published on  16 Dec 2019 1:30 PM GMT
స్కూల్ టీచర్ కు లైంగిక వేధింపులు..భరించలేక..!

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో జరిగిన దారుణ ఘటన వెలుగులోకొచ్చింది. స్కూల్ టీచర్ ను హెడ్ మాస్టర్, ఎంఈవో లైంగికంగా వేధిస్తుండటంతో భరించలేక కిరోసిన్ పోసుకొని ఆ టీచర్ ఆత్మహత్యాయత్నం చేసింది. నల్గొండ జిల్లాలోని దేవరకొండ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. స్థానికులు ఆమెను రక్షించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రాంబాయి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఎంఈవో మాతృ నాయక్, హెడ్ మాస్టర్ ముత్యాలు గత కొంత కాలంగా లైంగిక వేధింపులకు గురి చేయటం వలనే టీచర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని సిబ్బంది చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

దిశ ఘటన మరువకముందే ఇలాంటి ఘటనలు మరికొన్ని వెలుగులోకి వస్తున్నాయి. హెడ్ మాస్టర్ ముత్యాలు విధులకు హాజరు కాకుండా తనపై అదనపు భారం మోపుతున్నారని, ద్వంద్వార్థాలతో మాట్లాడుతున్నారని బాధితురాలు చెబుతోంది. ఎన్నో ఆశయాలతో, ఆశలతో ఉద్యోగంలో చేరానని, కొన్నిరోజుల నుండి వేధింపులు ఎక్కువ కావటంతో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసినట్లు బాధితురాలు చెబుతోంది. ఉన్నతాధికారులకు వేధింపుల గురించి ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదని, అందువల్లే ఆత్మహత్యాయత్నం చేసినట్లు బాధితురాలు చెబుతోంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది.

విద్యార్థుల తల్లిదండ్రులు సకాలంలో ఆమెను రక్షించి ప్రాణాపాయానికి గురి కాకుండా తప్పించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హెడ్ మాస్టర్, ఎంఈవో ఫోన్లు స్విఛాఫ్ అయినట్లు సమాచారం. జిల్లా విద్యాశాఖాధికారి ఈ ఘటనపై స్పందించి నిజంగా వేధింపులకు గురి చేసినట్లు తేలితే తగిన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. విచారణ నిమిత్తం హెడ్ మాస్టర్, ఎంఈవోను జిల్లా విద్యాశాఖాధికారి పిలిపించినట్లు సమాచారం. విచారణ తరువాత డీఈవో పోలీసులకు హెడ్ మాస్టర్, ఎంఈవోను అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది.

Next Story
Share it