అమరావతే ప్రజా రాజధాని : చంద్రబాబు

By రాణి  Published on  27 Dec 2019 12:16 PM GMT
అమరావతే ప్రజా రాజధాని : చంద్రబాబు

ముఖ్యాంశాలు

  • రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటే సహించబోం
  • మీడియాకి చంద్రన్న వార్నింగ్
  • రాజధాని తరలింపులో వైసీపీ ఎత్తుగడలు ఫలించవు
  • ఈ ప్రభుత్వ వైఖరి పిచ్చికి పరాకాష్టలా ఉంది

వెలగపూడి : ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును, అభివృద్ధిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటనతో, రాజధాని తరలింపు పేరుతో అంధకారంలోకి నెట్టిందని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం రాజధాని తరలించేందుకు చేస్తున్న కుట్రపై ఐదుకోట్ల మంది ఆంధ్రులు ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజధానిపై వైసీపీ నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆగ్రహం చెందారు. కేబినెట్ భేటీ తర్వాత నిర్ణయం చెప్పకుండా ప్రజలను ప్రలోభపెడుతున్నారని, ఆలోచనలో తప్పు లేకపోతే ప్రకటన చేయడానికి భయమెందుకని ప్రశ్నించారు. అమరావతి నుంచి రాజధానిని తరలించాలన్న సీఎం జగన్, వైసీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల కుట్రలు ఫలించవని జోస్యం చెప్పారు.

అసెంబ్లీ, సెక్రటేరియట్, హై కోర్టులో కార్యకలాపాలు అమరావతిలో నిర్వహించేందుకు అధికార పార్టీకి వచ్చిన ఇబ్బందులేమిటని చంద్రబాబు ప్రశ్నించారు. ఉన్నరాజధానిని అభివృద్ధి చేసి సంపద సృష్టిస్తే..ఆదాయం అదే వస్తుందన్నారు. అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అబద్ధం చెప్తుందని దుయ్యబట్టారు. రాజధానిని మార్చే అధికారం జగన్ కు ఎవరిచ్చారు ? ప్రపంచంలో ఎక్కడైనా మూడు రాజధానులు ఉన్నాయా ? రాజధానిని మార్చవద్దని రైతులు చేస్తున్న నిరసనలను అడ్డుకునే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిది ? అని ప్రశ్నించారు. మూడు రాజధానుల నిర్ణయం ఒక పిచ్చి ఆలోచన అని విమర్శించారు.

రాజధాని కోసం భూములిచ్చినందుకు రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టి రైతులకు అగ్రిమెంట్లు ఇచ్చామని చంద్రబాబు మీడియా సమావేశంలో తెలిపారు. రాజధాని గురించి జగన్ కు అనుభవం ఎలాగూ లేదు..కనీసం చెప్తే అయినా వినకుండా ఆయన ఇష్టమొచ్చినట్లు రాజధానులను మారిస్తే నష్టపోయేది ప్రజలేనన్నారు. పోలవరాన్ని భ్రష్టుపట్టించింది కాక ఇప్పుడు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆదాయాన్నిచ్చే రాజధాని ప్రాజెక్టు అమరావతిని కూల్చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన చెందారు. రాజధానులపై ఏర్పాటుపై పర్యవేక్షణ చేసి నివేదిక ఇచ్చిన జీఎన్ రావు ఏ విషయంలో ఎక్స్ పర్ట్ అని ప్రశ్నించారు.

మీడియాకు బాబు వార్నింగ్..

విశాఖపై అంత ప్రేముంటే అక్కడ పరిశ్రమలు పెట్టుకుని సంపాదించుకోండి అంతే కానీ...విశాఖను రాజధానిని చేస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు. రాజధానిని తరలిస్తున్నామని ప్రకటించగానే..రైతులకు కడుపు మండి..తమ త్యాగం వృథా కాకూడదన్న ఒకే ఒక్క ఉద్దేశ్యంతో రోడ్లెక్కి నిరసనలు, ఆందోళనలు చేస్తుంటే..వారిని పెయిడ్ ఆర్టిస్టులు అనడం భావ్యం కాదన్నారు. అలా మాట్లాడటం మీడియాకు కూడా మంచిది కాదని, అలా మాట్లాడిన మీడియాని ప్రజలు మళ్లీ రానివ్వరన్న వాస్తవాన్ని సదరు టీవీ ఛానళ్లు గుర్తుంచుకోవాలన్నారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, అక్కడ బిజినెస్ లను పెంచుకోవాలంటే ఇలాంటి వేషాలు అక్కడే వేసుకోండి కానీ...ఆంధ్రా రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. రైతులతో, వారి మనోభావాలతో వాడుకోవద్దని సూచించారు.

రాజధానుల ప్రకటనపై జగన్ ప్రభుత్వ వైఖరిపై పిచ్చికి పరాకాష్టలా ఉందన్నారు చంద్రబాబు. విశాఖలో డేటా సెంటర్ ను ఎందుకు తీసేశారు. అక్కడ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణాన్ని ఎందుకు ఆపివేశారని బాబు ప్రశ్నించారు. విశాఖను రాజధాని చేయాలనుకున్నప్పుడు ఈ పనులన్నీ ఎందుకు చేశారని మీడియా ముఖంగా అడిగారు.

అభివృద్ధి జరిగితే నిధులొస్తాయ్..రాజధానులను మార్చితే కాదు..

ఇన్ సైడర్ ట్రేడింగ్ పై హై కోర్టు జడ్జితో విచారణ జరిపించి, విశాఖలో భూ అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ వేయాల్సిందిగా చంద్రబాబు డిమాండ్ చేశారు. విశాఖలో ఎవరు భూ అక్రమాలు చేశారో సీబీఐ విచారణలో తేలుతుందన్నారు. టీడీపీ హయాంలో రాష్ర్ట అభివృద్ధికి ఆదాయాన్ని చేకూర్చింది అమరావతేనని, ఆ ఆదాయాన్ని ప్రజల కోసం ఖర్చు చేశామన్నారు. తెలంగాణలో కూడా 66 శాతం ఆదాయం రాజధాని అయిన హైదరాబాద్ నుంచే వస్తుందని చంద్రబాబు తెలిపారు. ల్యాండ్ పూలింగ్ అనేది వినూత్నమైన ఆలోచన అని, రాజధాని కోసం 29 గ్రామాల రైతులు భూములివ్వగా వారిలో ఎక్కువగా సన్నకారు రైతులున్నారని పేర్కొన్నారు. భూములిచ్చిన రోజు కేవలం టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలే లేరని, వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా రైతులనుంచి భూములిప్పించడంలో భాగం ఉందన్నారు. అంతా తెలిసిన వారే నేడు రైతులకు ఎలా అన్యాయం చేస్తున్నారని బాబు నిలదీశారు. అభివృద్ధి జరిగితేనే సంక్షేమ పథకాలకు నిధులు వస్తాయి కానీ ఇలా మూడు రాజధానులంటూ కాలక్షేపం చేస్తూ పోతే రాష్ర్ట భవిష్యత్ అధోగతి పాలవుతుందన్నారు. అమరావతిని రాజధానిగా తీర్చి దిద్దేందుకు టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.9 వేల కోట్లకు పైగా ఖర్చుచేశామని, ఎప్పటికైనా అమరావతే ప్రజా రాజధాని అవుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story
Share it