బాక్సాఫీస్ లో దీపికా పాదుకోన్ పై అజయ్ దేవగణ్ గెలుపు

By Newsmeter.Network  Published on  14 Jan 2020 4:18 PM GMT
బాక్సాఫీస్ లో దీపికా పాదుకోన్ పై అజయ్ దేవగణ్ గెలుపు

ఇద్దరూ పోరాట యోధులే... తానాజీ మాలుసరే ఛత్రపతి శివాజీ కాలంలోని యోధుడు. ఆయన శివాజీకి అందకుండా ఉండిపోయిన సింహగఢ్ కోటను వశపరచుకునే ప్రయత్నంలో ప్రాణాలర్పిస్తాడు. ఆ వీరయోధుడి గాధే తానాజీ, ది అన్ సంగ్ వారియర్ సినిమా కథ.

ఇక ఛపాక్ యాసిడ్ దాడికి గురై అందవికారంగా మారినా దృఢ సంకల్పంతో అడ్డుగోడలను ఛేదించిన ఆత్మవిశాసపు మహిళ గాథ. మొదటి సినిమాలో అజయ్ దేవగణ్, కాజల్, సయీఫ్ అలీ ఖాన్ లు ప్రధాన పాత్రలు పోషిస్తే, ఛపాక్ పూర్తిగా దీపికా పాదుకోన్ చిత్రం. ఆమె నటనా వైదుష్యాన్ని నూటికినూరు పాళ్లు చూపిన చిత్రం.

ఈ రెండు సినిమాలూ ఒకే సారి సంక్రాంతి సీజన్ లో సందడి చేశాయి. అంతే కాదు. తానాజీ మాలుసరే హిందుత్వ వాద జాతీయవాదానికి ప్రతీకగా నిలిస్తే , ఛపాక్ నాయిక దీపికా పాదుకోన్ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని వామపక్ష విద్యార్థుల హాస్టల్ ఫీజును రూ. 10 నుంచి రూ. 300 కి పెంచడాన్ని నిరసిస్తూ చేస్తున్న ఉద్యమానికి మద్దతునిచ్చారు. అయితే దీపిక పీ ఆర్ టీమ్ ఇక్కడే పప్పులో కాలేశారు. ఆమె దేశవాసుల మూడ్ ని అంచనా వేయడంలో పొరబాటు చేశారు. జెఎన్ యూ వామపక్ష విద్యార్థుల ఉద్యమానికి మద్దతునివ్వడం తక్షణం ఆమె సినిమా మీద ప్రభావం చూపించినట్టు కనిపిస్తోంది. ట్విట్టర్ లో ఆమెను బాగా ట్రోల్ చేయడం జరిగింది. ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ప్రొడక్టులు కొన్నాళ్ల పాటు దీపిక ఉన్న వ్యాపార ప్రకటనలను తెరపై చూపించవద్దని కోరుతున్నాయి.

దేవగణ్ కి ఇది 100 వ చిత్రం. ఈ చిత్రం సోమవారం పరీక్షను పాసైందనే చెప్పాలి. తానాజీ సినిమా సోమవారం నాడు రూ. 13.75 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో సోమవారం నాటికి ఈ సినిమా తొలి నాలుగు రోజుల్లో రూ. 75.68 కోట్లు సంపాదించింది. మకర సంక్రాంతి సెలవుల వల్ల మహారాష్ట్ర, ముంబాయి, ఢిల్లీ, పంజాబ్ మార్కెట్ లో మంచి బిజినెస్ చేసింది. సినీ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ సినిమాను “అన్ స్టాపబుల్” గా అభివర్ణించారు. మామూలుగా వర్కింగ్ డేస్ లలో సినిమా టికెట్ల ధర కాస్త తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ మిగతా రోజుల కన్నా సోమవారం కలెక్షన్లు చాలా బాగున్నాయని ఆయన పేర్కొన్నారు. తొలి రోజున రూ. 15.10 కో్ట్లు, రెండో రోజు అంటే శనివారం రూ. 20.57 కోట్లు, సోమవారం 13.75 కోట్లు సాధించిందని ఆయన ట్వీట్ చేశారు.

ఇక ఛపాక్ టికెట్ సేల్స్ యాభై శాతం పడిపోయాయి. సోమవారం రూ. 2.35 కోట్లు మాత్రమే ఛపాక్ సంపాదించగలిగింది. దీని మొత్తం సేల్స్ రూ. 21.35 కోట్ల వరకు వచ్చి ఆగిపోయాయి. కొన్ని మల్టి ప్లెక్స్ లు, అర్బన్ సెంటర్లలో మాత్రమే సినిమా బాగా చేస్తోందని, రెండో, మూడో తరగతి పట్టణాలు, మాస్ సెంటర్లలో కౌంటర్ సేల్స్ పడిపోయాయని ఆయన ట్వీట్ చేశారు. తొలి రోజు 4.77 కోట్లు, రెండో రోజు 6.90 కోట్లు, మూడో రోజు 7.35 కోట్లు, నాలుగో రోజు అంటే సోమవారం జస్ట్ 2.35 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగలిగిందని ఆయన ట్వీట్ చేశారు.

ఛపాక్ కు ఐఎండీబీ రేటింగ్ కూడా చాలా తక్కువగా వచ్చింది. ఐఎండీబీ యూజర్ రేటింగ్ లో మొత్తం 6900 మంది వోటు వేయగా, అందులో 4000 మందికి పైగా సినిమాకు అతి తక్కువ రేటింగ్ ఇచ్చారు. దాని ఐఎండీబీ రేటింగ్ 4.4 కి పడిపోయింది. అదే తానాజీ చిత్రానికి 8.8 రేటింగ్ వచ్చింది. మొత్తం వోటేసిన 5800 మందిలో 4300 మంది టెన్ రేటింగ్ ఇచ్చారు.

Next Story
Share it