తెలుగు తెర పై చెర‌గ‌ని సంతకం 'ఎస్వీఆర్'

By Newsmeter.Network  Published on  6 Oct 2019 10:22 AM GMT
తెలుగు తెర పై చెర‌గ‌ని సంతకం ఎస్వీఆర్

న‌ట‌న‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నం.. తెలుగు తెర పై చెర‌గ‌ని సంతం "ఎస్వీఆర్". ఎస్వీ ఆర్ అస‌లు పేరు సామ‌ర్ల వెంక‌ట రంగారావు. కృష్ణా జిల్లా నూజివీడులో కోటేశ్వరనాయుడు, లక్ష్మీ నరసాయమ్మ దంపతులకు 1918 జులై 3న జన్మించారు. తండ్రి ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ కావడం వల్ల అనేక ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చేది. ఆయ‌న ఏలూరు, విశాఖ‌ప‌ట్నంలో చ‌దువుకున్నారు. ఆయ‌న‌కు చిన్న‌ప్ప‌టి నుంచి న‌ట‌న అంటే మ‌క్కువ ఎక్కువ‌. అందుక‌నే ఓ వైపు చ‌దువుకుంటున్నా... ఎక్క‌డైనా నాట‌కాలు వేస్తున్నారు అంటే చాలు ఎంత దూర‌మైనా స‌రే.. వెళ్లేవారు.

తన పదిహేనో ఏట ముఖానికి రంగేసుకున్నారు. విశాఖలో ఇంటర్, కాకినాడలో బీఎస్సీ పూర్తి చేశారు. ఆ తరువాత ఫైర్ ఆఫీసర్‌గా బందరు, విజయనగరం తదితర ప్రాంతాల్లో పని చేశారు. అయితే... ఫైర్ ఆఫీస‌ర్ గా ఉద్యోగం చేశారు కానీ... మ‌న‌సంతా న‌ట‌న పై ఉండ‌డంతో ఉద్యోగానికి రాజీనామ చేశారు. సినిమాలో న‌టించాల‌నే సంక‌ల్పంతో చెన్నై చేరుకున్నారు.

ఎన్నో క‌ష్ట‌లు ప‌డిన త‌ర్వాత వ‌రూధిని అనే సినిమాలో తొలి అవ‌కాశం వ‌చ్చింది. అయితే... ఈ సినిమా సక్సెస్ కాకపోవ‌డంతో ఆత‌ర్వాత ఒక్క అవ‌కాశం కూడా రాలేదు. ఈలోపు మేనమామ కుమార్తె లీలావతితో ఆయనకు వివాహమైంది. అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో ఇక లాభం లేద‌నుకుని... మ‌ళ్లీ ఉద్యోగంలో చేరారు. ఆ త‌ర్వాత అనుకోకుండా సినిమాల్లో మ‌ళ్లీ అవ‌కాశం రావ‌డంతో న‌ట‌ను మ‌ళ్లీ ప్రారంభించారు.

మనదేశం, తిరుగుబాటు చిత్రాల్లో చిన్నా చితక వేషాలు వేసినా... విజయా సంస్థ తొలి చిత్రం షావుకారు సినిమాలో సున్నపు రంగడు పాత్ర ఆయన సినీ జీవితాన్ని మలుపుతిప్పింది. వెంటనే పాతాళ భైరవి సినిమాలో మహా మాంత్రికుడి పాత్ర వెతుక్కుంటూ వచ్చింది. అదే ఎస్వీఆర్ ని ఒక గాంభీర్యం, ఒక నిండుదనం, ఒక విలక్షణ పోషణ, ఒక అసమాన నటనా కౌశలం ఉన్న నటుడిగా పరిచయం చేసింది.

రావణుడు, హిరణ్య కశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలనే కాక పెళ్లి చేసి చూడు, బంగారు పాప‌, బాల‌నాగ‌మ్మ‌, గృహ‌ల‌క్ష్మి, బాల భార‌తం, తాతా మ‌న‌వ‌డు.. ఇలా వైవిధ్య‌మైన చిత్రాల్లో విభిన్న పాత్ర‌లు పోషించి త‌న అద్భుత న‌ట‌నా చాతుర్యంతో ప్రేక్ష‌క హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేశారు. న‌ర్తనశాలలో ఆయన నటనకు గాను భారత రాష్ట్రపతి పురస్కారమే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారం కూడా అందుకున్నారు. విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ త‌దిత‌ర బిరుదులు పొందారు. ఎలాంటి పాత్ర అయినా స‌రే... అవ‌లీల‌గా పోషించి.. ఆ పాత్ర‌ల‌కే వన్నె తెచ్చారు.

కళ్లతో మాట్లాడుతూ.. కనుబొమలతో మనల్ని కదలించే మహానటుడు ఎస్వీఆర్. అప్పట్లో అంతర్జాతీయ స్థాయిలో అవార్డునందుకున్న తొలి నటుడు కూడా ఆయనే. నిర్మాతగా నాదీ అడజన్మే చిత్రాన్ని, దర్శక నిర్మాతగా చదరంగం, బాంధవ్యాలు అనే చిత్రాలను రూపొందించారు. దర్శకుడిగా అవి ఆయనకు కీర్తి ప్రతిష్టలు తెచ్చాయి. ఇక వ్యక్తిగా చెప్పాలంటే... చమత్కారి, హాస్యప్రియుడు, భేషజాలు లేని నిరాడంబరుడు. సామాజిక సేవా సంస్థలకు తన వంతు సాయం అందించడంలో ఏనాడూ వెనుకంజ వేయలేదు.

భారత్ - చైనా, భారత్ - పాక్‌ యుద్ధాల సమయాల్లో ఆర్థిక సాయం అందించడమే కాక, నాటక ప్రదర్శనలతో దేశానికి రక్షణ నిధిని సమకూర్చారు. 2013 లో భారత సినీ పరిశ్రమ వందేళ్ళ పూర్తి చేసుకున్న‌ సందర్భంగా ఎస్వీఆర్ ఫొటోతో తపాళా బిళ్ళ విడుద‌ల చేశారు. ఆయ‌న‌ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఇష్టదైవం శివుడు. ప్రతిరోజూ శివ పూజ చేసిన తర్వాతే దినచర్య ప్రారంభించేవారు. 1974 జులై 18న రెండోసారి వచ్చిన గుండెపోటుతో ఈ నటసార్వభౌముడు మద్రాసులో తుది శ్వాస విడిచి అఖిలాంద్ర ప్రేక్షకులకు తీరని దుఃఖాన్ని కలిగించారు. భౌతికంగా ఆయన ఇప్పుడు లేక‌పోయినా.. ఇప్పటికీ, ఎప్ప‌టికీ ప్రేక్షకుల హృదయాలలో ఆ నట చక్రవర్తి స్థానం చెర‌గ‌నిది.

తాడేపల్లిలో మహానటుడు ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయనను ఓ సారి గుర్తు చేసుకుంటూ..

Next Story