దుమ్ము రేపుతున్న 'దర్బార్'లో 'దుమ్ము ధూళి' పాట - రచయిత అనంత శ్రీరామ్

By Newsmeter.Network  Published on  30 Nov 2019 12:27 PM GMT
దుమ్ము రేపుతున్న దర్బార్లో దుమ్ము ధూళి పాట - రచయిత అనంత శ్రీరామ్

సూపర్‌స్టార్ రజనీకాంత్‌.. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'దర్బార్'. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై భారీ నిర్మాణ వ్యయంతో, ఉన్నత సాంకేతిక విలువలతో ఎ. సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ తెలుగు నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

ఇటీవల తొలి పాట 'దుమ్ము ధూళి' ప్రేక్షకుల ముందుకొచ్చింది. రజనీకాంత్ ఇమేజ్ కి తగ్గట్టు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ స్వపరిచిన, పాటల రచయిత అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన 'దుమ్ము ధూళి' పాట... ఇంటర్‌నెట్‌లో దుమ్ము రేపుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ పాటకు ఇప్పటికి 8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సంగీతానికి, సాహిత్యానికి విశేష ప్రజాదరణ లభిస్తోంది. ఈ సందర్భంగా అనంత శ్రీరామ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

అనంత శ్రీరామ్ మాట్లాడుతూ..

తెలుగు ప్రేక్షకులందరికీ మనస్పూర్తిగా నమస్కరిస్తున్నాను. ఓ విధమైన సంతోషంలో, ఆనంద పారవశ్యంలో ఉన్న సమయమిది అన్నారు. కారణం ఏంటంటే... రజనీకాంత్ గారి దర్బార్ చిత్రానికి సంబంధించి మొట్టమొదటి పాట 'దుమ్ము... ధూళి'కి తెలుగులో రెండు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. తెలుగు, తమిళ భాషల్లో మొత్తం 8 మిలియన్ల మంది ఈ పాట విన్నారని తెలిపారు. రజనీకాంత్ గారి సినిమా అంటే మొదటి పాటకు ఒక ప్రత్యేకత ఉంటుందన్నారు.. ఆ మొదటి పాటను రాసే అదృష్టం ఇంతకుముందు 'పేట' చిత్రంలో నాకు వచ్చింది. అందులో 'మరణం మాస్ మరణం' పాటను రాశాను. అదే విధంగా... 'దర్బార్' చిత్రంలో 'దుమ్ము ధూళి' అన్న పాటను రాశాను అన్నారు.

ఎస్పీబీ గొంతు తోడవడంతో...

'పేట'లో పాటను ఎస్పీ బాలసుబ్రమణ్యంగారు, అనిరుధ్ రవిచంద్రన్ కలిసి పాడితే... 'దర్బార్'లో పాటను ఎస్పీ బాలుగారు ప్రత్యేకంగా పాడారన్నారు. ఈ పాటకు సాహిత్యం, సంగీతం బాగా కుదిరాయన్నారు. బాలుగారి గొంతు తోడవడంతో పాట ఇంత ప్రజాదరణ పొందిందని తెలిపారు. సాహిత్యం, సంగీతం బావుంటే... అభిమాన తార అయ్యుంటే... అనువాద చిత్రం అని చూడకుండా పాటను విజయవంతం చేస్తారని తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారని తెలిపారు.

నిర్మాతలు అందరినీ గౌరవిస్తారు..!

లైకా ప్రొడక్షన్స్ సంస్థ వరుసగా రజనీకాంత్ గారితో సినిమాలు చేస్తున్నారు. అలాగే, చిన్న సినిమాలను ప్రోత్సహిస్తున్నారు. చాలామంచి నిర్మాతలు. సాంకేతిక నిపుణులను, నటీనటులను గౌరవించే నిర్మాతలు. వాళ్ళకు తెలుగులో మంచి విజయాలు రావాలన్నారు. అలాగే 'దర్బార్' ద్వారా మరో సంచలనం వారి ఖాతాలో చేరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. ప్రముఖ తెలుగు నిర్మాత ఎన్వీ ప్రసాద్ గారు 'దర్బార్' చిత్రాన్ని తెలుగు ప్రజలకు అందిస్తున్నారు. వారికీ 'దర్బార్' ద్వారా మంచి విజయం రావాలని, ఈ సంక్రాంతి వారికి నిజమైన పండగ తీసుకురావాలని కోరుకుంటున్నానని అనంత శ్రీరామ్ అన్నారు.

Next Story