తెలిసీ తెలియని వయసులో ప్రేమించింది..తర్వాత..!?

By రాణి  Published on  16 Dec 2019 7:28 AM GMT
తెలిసీ తెలియని వయసులో ప్రేమించింది..తర్వాత..!?

ఏలూరు : ఆ యువతి తెలిసీ తెలియని వయసులో ప్రేమించింది. అతనే తన సర్వస్వం అని నమ్మింది. ఇంతలోనే జరిగిన దారుణానికి ఆ బాలిక బలైంది. చెడిపోతే చచ్చిపో అంటూ ప్రియుడు చెప్పిన మాటలు విని తనువు చాలించింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని టి.నర్సాపురంలో వెలుగుచూసిన సంఘటన ఇది.

టి.నర్సాపురంకు చెందిన యువతి 9వ తరగతి చదువుతోంది. ఈ నెల 7వ తేదీన ఆ యువతి ఇంటికి సమీపంలో ఉన్న డాబాపై పడిపూజ జరుగుతుంటే..చూసేందుకు తన తోటి స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లింది. ఇది గమనించిన రాజు అనే వ్యక్తి యువతిని పక్కకు పిలిచి మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమె నోరు మూసేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించడంతో..తన బాధను ఎవరితో మొరపెట్టుకోవాలో అర్థంకాక ప్రియుడు సుబ్రహ్మణ్యానికి అసలు విషయం చెప్పింది.

''ప్రేమ మనసుకు సంబంధించింది. శరీరానికి సంబంధించింది కాదు. నీ మనసు మలినం కాలేదు'' అని తీపి కబుర్లు చెప్పిన సుబ్రహ్మణ్యం మెల్లగా ఆమెతో మాట్లాడటం తగ్గించాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని ప్రశ్నించిన యువతి అతను చెప్పిన సమాధానం విని ఖంగుతింది. నువ్వు చెడిపోయావు కాబట్టి చచ్చిపో అంటూ ఆ యువతికి మొహం చూపించకుండా తప్పించుకున్నాడు. సుబ్రహ్మణ్యం చేష్టలకు మనస్తాపం చెందిన యువతి 9వ తేదీన స్కూల్ కు వెళ్తూ పొలంలో చల్లే పురుగుల మందు సేవించింది. స్కూల్ కు వెళ్లాక అక్కడే వాంతులు చేసుకుని కళ్లు తిరిగి పడిపోవడంతో సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయినా లాభం లేదు. అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు ధృవీకరించారు. జరిగిన ఘటనపై యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటికొచ్చింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు రాజు, సుబ్రహ్మణ్యంపై కేసు నమోదు చేశారు.

Next Story
Share it