ఈ సూపర్ మామ్ ల గురించి తెలిసింది గోరంత.. తెలుసుకోవాల్సింది కొండంత

By రాణి  Published on  13 Feb 2020 12:34 PM GMT
ఈ సూపర్ మామ్ ల గురించి తెలిసింది గోరంత.. తెలుసుకోవాల్సింది కొండంత

తల్లి అయ్యాక.. ఎంచుకున్న రంగంలో కంబ్యాక్ ఇవ్వడం కష్టమేమీ కాదని అంటున్నారు మన అథ్లెట్లు. జనవరి, 17 న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా హోబర్ట్ లో జరిగిన టెన్నిస్ పోటీల్లో విజయం సాధించింది. తనలో టెన్నిస్ ఆడే సత్తా ఇంకా అలాగే ఉందని సానియా మీర్జా ప్రపంచానికి చాటింది. దాదాపు 15 నెలల గ్యాప్ తర్వాత సానియా టెన్నిస్ రాకెట్ ను పట్టుకుంది. పిల్లలు పుట్టాక మహిళలు తమ కెరీర్ ను త్యాగం చేయాల్సిన అవసరం లేదని సానియా వ్యాఖ్యానించింది.

గతంలో పిల్లలు పుట్టాక తల్లులు తాము ఎంచుకున్న రంగంలో ఎదగాలని ప్రయత్నించడం ఆపేసేవారని.. సమాజం దృష్టిలో తాము గొప్ప తల్లులు కామేమో అన్న అపోహ వారిలో ఉండేదని.. ఇప్పుడు అలాంటి కోణంలో చూసేవారిలో మార్పు వచ్చిందని.. ఇప్పటితరంలో చాలా మంది మహిళలు పిల్లలు పుట్టాక కూడా తాము ఎంచుకున్న రంగంలో విజయం సాధిస్తున్నారని ఆమె చెప్పారు. మార్పు అన్నది మరీ ఎక్కువగా రాకపోయినప్పటికీ.. కొంచెం అయినా మార్పు మొదలైందని ఆమె అన్నారు. చాలా మంది ప్రొఫెషనల్ క్రీడాకారిణులు ఓ వైపు ప్రాక్టీస్-మరో వైపు తల్లిగా కూడా తమ పని తాము చేసుకుంటూ దూసుకుపోతున్నారు.

అమూల్య వెంకటేష్, బెంగళూరు యునైటెడ్ ఎఫ్సీ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఓ వైపు ట్రైనింగ్ క్యాంపులకు వెళుతూ.. మరోవైపు తన రెండేళ్ల చిన్నారి నివేదని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది. తను కెరీర్ కొనసాగడానికి కారణం భర్త, అత్తగారు అని అమూల్య వెంకటేష్ చెప్పుకొచ్చారు. తాను ఇంట్లో ఉన్నప్పుడు పాపకు పాల విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదని.. తాను ఇంట్లో లేనప్పుడు అత్తగారు ఆవు పాలు తన బిడ్డకు పట్టిస్తూ ఉంటారని ఆమె అన్నారు. పాపకు తల్లి పాలు పట్టించాలన్న విషయం తనకు తెలుసునని.. కానీ కొన్ని సార్లు కుదరనప్పుడు ఇంతకన్నా వేరే దారి లేదని.. ఫుట్ బాల్- తన కూతురు రెండూ ఎంతో ఇష్టమైన విషయాలని ఆమె తెలిపింది. 2017 నేషనల్ ఛాంపియన్ షిప్ లో కర్ణాటకకు ఆడుతున్న సమయంలో అమూల్య గర్భవతి అట. ఓ నెల తర్వాతనే అమూల్యకు ఈ విషయం తెలిసింది.

Sangeetha Beraమూడు నెలల పిల్లాడిని వదిలి..

నేషనల్ రగ్బీ ప్లేయర్ సంగీతా బేరా తనకు నార్మల్ డెలివరీ చేయాలని డాక్టర్లతో ఎంతగానో వాదించింది. తనకు సిజేరియన్ చేయాలని వైద్యులు భావించారని.. అందుకు తాను ఒప్పుకోలేదని ఆమె అన్నారు. వీలైనంత త్వరగా తాను రగ్బీ తిరిగి ఆడాలంటే సిజేరియన్ ఆపరేషన్ జరగకూడదని తనకు తెలుసునని.. తన బిడ్డ బరువు 4 కేజీలు కాగా నార్మల్ డెలివరీ అసలు వీలుపడదని వైద్యులు తనతో అన్నట్లు సంగీత చెప్పుకొచ్చింది. కానీ తాను అందుకు ఒప్పుకోలేదని 36 సంవత్సరాల సంగీత ఎంతో గర్వంగా చెప్పుకొచ్చింది. 2015 లో ఎంతో నొప్పిని భరించి సంగీత తన కొడుకు రియాన్ కు జన్మనిచ్చింది. డెలివరీ జరిగిన మూడు నెలలకు సంగీత ట్రైనింగ్ కు వెళ్లిందంటే ఆమె పట్టుదల ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

దాదాపు రెండేళ్ల పాటూ తన బిడ్డకు తల్లి పాలు అందించానని ఆమె చెప్పింది. ఒకటిన్నర సంవత్సరం వరకూ ప్రాక్టీస్ కు వెళ్లే ముందు తాను పాలు అందించి వెళ్తుండేదాన్నని.. ఒక రోజు తాను ఎప్పటిలాగే పిల్లాడికి పాలు పట్టించి ప్రాక్టీస్ కు వెళ్లిపోయానని.. ఓ గిన్నెలో పట్టించి వెళ్లిన పాలు తాగిన తర్వాత తన బిడ్డ ఆకలితో ఎక్కువగా ఏడవడం మొదలుపెట్టాడని.. ఈ విషయం ఫోన్ చేసి తన తల్లిదండ్రులు చెప్పారని.. ప్రాక్టీస్ ముగిసిన వెంటనే ఏడ్చుకుంటూ వెళ్లి తన బిడ్డను చేతిలోకి తీసుకొని చనుబాలు అందించానని భావోద్వేగంతో చెప్పింది సంగీత.

2019 లో ఆసియా రగ్బీ ఉమెన్స్ చాంపియన్ గా భారత జట్టు అవతరించింది. ఆ జట్టులో సంగీత కూడా సభ్యురాలు. గర్భవతిగా ఉన్నప్పుడు పెరిగిన బరువును తగ్గించుకోవడం ఆడవాళ్ళకు పెద్ద సమస్య అని సంగీత చెబుతోంది. ఆమె కోల్ కతా పోలీసు డిపార్ట్ మెంట్ లో బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. తాను 90 కిలోల నుండి 60 కిలోల బరువు రావడానికి చాలా కష్టపడ్డానని ఆమె అన్నారు. సంగీత రోజుకు 5-6 గంటలు ప్రాక్టీస్ చేసేది. నాలుగు నుండి అయిదు గంటల పాటూ నిద్రపోయేది. తనకు ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా తన కొడుకు రియాన్ తో గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటానని చెప్పింది. తన భర్త, తల్లిదండ్రులు రియాన్ ను బాగా చూసుకుంటూ ఉంటారని.. తన కొడుకుతో వీలు దొరికినప్పుడల్లా వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉంటానని.. వాడు ఎప్పుడూ ఏడవడని.. తాను మెడల్ గెలిచి రావాలనే చెబుతుంటాడని సంగీత చెప్పుకొచ్చింది.

Neha Tanwar

నార్మల్ డెలివరీ చేయాలని పట్టుబట్టిన మహిళా క్రికెటర్

ఇక నేహా తన్వార్ ఒకప్పుడు భారత మహిళల జట్టులో మెయిన్ ప్లేయర్ గా ఉండేది. ఆమె గర్భవతి అయ్యాక కొద్దిరోజుల పాటూ క్రికెట్ కు దూరమయ్యింది. ఈ సమయంలో బరువు చాలా పెరిగిపోయింది. ఒకానొక సమయంలో తనను తాను అద్దంలో చూసుకున్నప్పుడు బరువు ఎక్కువగా పెరిపోయి ఉండడం చూసి బాధ వేసిందని.. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడింది తానేనా అని అనిపించేదని నేహా చెప్పుకొచ్చింది. ఇండియన్ రైల్వేస్ లో ఉద్యోగం చేస్తున్న నేహా తనను ఎవరూ గుర్తు పట్టకూడదని మధ్యాహ్నం సమయంలో గ్రౌండ్ లో ఎవరూ లేని సమయం చూసి అక్కడికి వెళ్లి వర్కౌట్లు, ప్రాక్టీస్ చేసేది. దాదాపు 25 కేజీల బరువును తగ్గింది నేహా..!

సిజేరియన్ డెలివెరీ అయిన సంవత్సరానికి ఆమె క్రికెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టింది. 2015-16 సీజన్ లో ఆమెకు అవకాశం దక్కింది. మొదటి రెండు మ్యాచ్ లలో సరైన ప్రదర్శన ఇవ్వలేకపోవడంతో ఆమెను జట్టు నుండి తప్పించారు. ఆమె కెరీర్ లో అలా ప్లేయింగ్ జట్టులో లేకపోవడం అదే మొదటిసారి. తన కొడుకుతో పూర్తీ సమయం కేటాయించలేకపోవడం పట్ల తనకు కూడా చాలా బాధగా ఉందని 33 సంవత్సరాల ఈ ఢిల్లీ క్రికెటర్ చెబుతోంది. తాను తిరిగి అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నానని.. క్రికెట్ నుండి రిటైర్ అయ్యాక.. తన కొడుకుతో పూర్తిగా సమయాన్ని కేటాయిస్తానని నేహా అంటోంది.

Gursharan Preeth Kaurకుమార్తే అసలు కారణం

36 సంవత్సరాల రెజ్లర్ గుర్షరన్ ప్రీత్ కౌర్ కెరీర్ కొనసాగించడానికి కారణం తన కుమార్తె నిమ్రత్ అని చెబుతోంది. గుర్షరన్ ప్రీత్ కు ఆడపిల్ల పుట్టిందని ఆమె భర్త వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దీంతో ఆమె మళ్ళీ రెజ్లింగ్ రింగు లోకి అడుగుపెట్టింది. రెండు సార్లు కామన్ వెల్త్ గేమ్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన గుర్షరన్.. పెళ్లి అయ్యాక రెజ్లింగ్ ను వదిలేసింది. ఆడ పిల్ల పుట్టిందని ఆమెను భర్త వదిలేయగా.. తన కుమార్తె కోసమే పతకాలు సాధించాలని భావించి ఏడేళ్ల తర్వాత 2018లో పోటీల్లో పాల్గొనింది. 97 కిలోల బరువు ఉన్న గుర్షరన్ 76 కిలోల బరువుకు చేరుకుంది. తాను ఇంకో 4 కేజీలు తగ్గి 72 కిలోల కేటగిరీలో పోటీ చేయాలని భావిస్తోంది. పంజాబ్ పోలీస్ లో సబ్ ఇన్స్పెక్టర్ అయిన కౌర్ 2019 నేపాల్ లో జరిగిన సౌత్ ఏషియన్ గేమ్స్ లో 76 కిలోల విభాగంలో స్వర్ణం నెగ్గింది. ప్రస్తుతం లక్నోలో ప్రాక్టీస్ చేస్తున్న కౌర్ ఢిల్లీలో ఫిబ్రవరిలో నిర్వహించనున్న ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ కోసం సమాయత్తమవుతోంది. తనకు రాణీ లక్ష్మీబాయి ఆదర్శమని.. ఆమె కూడా ఒంటరిగానే పోరాడిందని కౌర్ చెప్పుకొచ్చింది.

తమ చిన్నారుల కోసం సమయం కేటాయించలేకపోతున్నామని ఈ 'సూపర్ మామ్' లు బాధపడుతున్నప్పటికీ వీరందరూ ఎందరో మహిళలకు ఆదర్శం. ఎలాగైనా తాము ప్రేమించిన క్రీడలో రాణించాలని.. పోడియంపై గోల్డ్ మెడల్ సాధించాలని పోరాడుతున్నారు. శరీరం సహకరించకపోయినా, సమాజంలో పెద్ద గుర్తింపు రాకపోయినా, రాత్రుళ్ళు సరిగా నిద్రపోకపోయినా ఎన్నో అవాంతరాలను దాటుకుని తాము అనుకున్నది సాధించాలని వీరు భావిస్తున్నారు. వీరు పడుతున్న శ్రమకూ.. చేస్తున్న త్యాగాలకు.. హ్యాట్సాఫ్.

Next Story