ఎస్పీ దెబ్బకు విస్తుపోయిన పోలీసులు

By రాణి  Published on  28 Dec 2019 1:59 PM GMT
ఎస్పీ దెబ్బకు విస్తుపోయిన పోలీసులు

అతనొక ఎస్పీ. ఒక ట్రైనీ ఐపీఎస్ ను సామాన్యుడిలా ఒంగోలు పోలీస్ స్టేషన్ కు పంపి ఫిర్యాదు ఇవ్వమన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో స్టేషన్ రైటర్ సస్పెండ్ అవ్వగా..సీఐ, ఎస్సైతో సహా నలుగురికి చార్జి మెమోలు అందాయి. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తమ పోలీసుల పనితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు ట్రైనీ ఐపీఎస్ జగధీష్ ను సామాన్యుడిలా స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు ఇవ్వమన్నారు. స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు ఇద్దామంటే ఒక్కరూ పట్టించుకోలేదు. పైగా ఆ ఫిర్యాదు తీసుకునేందుకు ముప్పతిప్పలు పెట్టి నీళ్లు తాగించడమే కాక బండబూతులు తిట్టారట. అతనెవరో పోలీసులకు తెలియదు. తెలిసుంటే జాగ్రత్తపడేవారేమో. తనదీఊరు కాదని, తనపై ఎవరో దాడి చేసి మొబైల్ ఫోన్ లాక్కెళ్లిపోయారని ఓ ఫిర్యాదు రాసి రిసెప్షన్ లో ఇచ్చారు. కానిస్టేబుళ్లెవరూ పట్టించుకోలేదు, సీఐ వచ్చాక రమ్మంటూ పంపించేశారు. మళ్లీ సాయంత్రం వెళ్లాడు, ఐనా సమాధానం లేదు. పలుసార్లు బతిమిలాడిన తర్వాత రైటర్ వద్దకు పంపారు. రైటర్ ని ఎఫ్ ఐఆర్ కాపీ కావాలని అడగగా సీఐ వచ్చాక రమ్మన్నారు. తాను అర్జెంట్ గా గన్నవరం వెళ్లాలని, కనీసం ఫిర్యాదు చేసిన రసీదయినా ఇవ్వాలని కోరారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు, చివరకు ఎస్సై వద్దకు పంపారు. ఆయన కూడా సమాధానం చెప్పలేదు. తనకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాల్సిందేనంటూ గట్టిగా అడిగితే ఆయన పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.

ట్రైనీ ఐపీఎస్ జగధీష్ స్టేషన్ లో జరిగిందంతా పూస గుచ్చినట్లు సిద్ధార్థకు వివరించారు. వెంటనే ఎస్పీ స్టేషన్ రైటర్ ను సస్పెండ్ చేసి, సీఐ, ఎస్సై సహా నలుగురికి ఛార్జి మెమోలు జారీ చేశారు. మామూలుగా ఇలాంటి సీన్లు మనం సినిమాలో చూస్తుంటాం. కానీ ఇక్కడ రియల్ హీరో పోలీస్ అని నిరూపించారు ఎస్పీ సిద్ధార్థ కౌశల్.

ఎస్పీ పంపించిన వ్యక్తి అని తెలియక పోలీసులు అలా బిహేవ్ చేశారు అనుకుందాం. నిజానికి అక్కడ ఎస్పీ లేకుండా, ట్రైనీ ఐపీఎస్ ప్లేస్ లో మరెవరైనా ఉండి ఉంటే పోలీసులు రెస్పాన్స్ అయ్యే తీరు ఇది కాదు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికే పోలీసులు. పోలీస్ స్టేషన్లు ఉన్నాయని చెప్తుంటారు గానీ...సమస్య వచ్చినపుడు వెళ్లి ఫిర్యాదు చేస్తే పట్టించుకునే నాథుడు ఒక్కడూ ఉండట్లేదు. సమస్య చిన్నదైనా, పెద్దదైనా మూట ముడితేనే దర్యాప్తు జరుగుతుందంటున్నారు కొందరు. ఏదేమైనా ఇకపై పోలీసులు జర జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ఒంగోలులో జరిగినట్లే రేపు మరేదైనా స్టేషన్ లో జరగవచ్చు.

Next Story
Share it