నాన్న కోలుకుంటున్నారు: ఎస్పీ చరణ్
By సుభాష్ Published on 27 Aug 2020 1:39 PM GMT
కరోనాతో చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో పోరాడుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తెలిపారు. గురువారం బాలుకు వైద్యులు ఫిజియోథెరఫీ చికిత్స చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆస్పత్రి వర్గాలు తెలిపిన దాని ప్రకారం నాన్న ఆరోగ్యం నిలకడగా ఉందని చరణ్ తెలిపారు. మెల్లమెల్లగా కోలుకుంటున్నారని, వైద్యుల చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. నాన్న ఆరోగ్యం మెరుగుపర్చడంలో ఆస్పత్రి వైద్యులు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఇక అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. నాన్న ఆరోగ్యం మునుపటి కంటే ప్రస్తుతం ఎంతో మెరుగు పడిందన్నారు. ఇక వారం రోజుల్లోనే ఆయనకు అమర్చిన ఎక్మో పరికరాన్ని తొలగించే అవకాశాలున్నాయన్నారు.
కాగా, బాలసుబ్రహ్మణ్యం వివిధ భాషల్లో పాడిన పాటలకు ఎంతో మంది అభిమానులున్నారు. ఆయన తెలుగుతో పాటు కన్నడ, హిందీ, మలయాళం ఇంకా ఎన్నో భాషల్లో పాటలు పాడి ఎన్నో జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఇక బాలు ఒక్కసారిగా అనారోగ్యం బారిన పడటంతో సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, ప్రజలు ఆందోళనకు గురయ్యారు.