తల్లి గొంతు కోసిన తనయుడు
By Newsmeter.Network Published on 14 Jan 2020 5:12 PM IST
సమాజంలో మానవత్వం చచ్చిపోతోంది. నవమాసాలు మోసి పెంచిన కన్నతల్లిని దారుణంగా హతమార్చాడో కన్నకొడుకు. వృద్ధాప్య దశలో సంరక్షకుడు కావాల్సిన ఆ బిడ్డ నయ వంచకుడిగా మారి ఆ తల్లి చేసిన త్యాగాల ‘గొంతు కోశాడు’.ఈ దారుణ ఘటన తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం తోటపల్లిలో సోమవారం జరిగింది.
చింతూరు డీఎస్పీ ఖాదర్‌బాషా, ఎటపాక సీఐ హనీష్‌బాబు తెలిపిన వివరాల మేరకు.. తోటపల్లికి చెందిన బోపిరెడ్డి ముత్తమ్మ (70), ముక్కయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఒక కొడుకు, కూతురికి వివాహాలు అయ్యాయి. దీంతో భర్త ముక్కయ్య, చిన్న కుమారుడు నాగులుతో కలిసి ముత్తమ్మ ఉంటోంది. ముత్తమ్మ వయసు మీద పడటంతో తరచూ అనారోగ్యానికి గురవుతోంది. వైద్యానికి డబ్బు ఖర్చవుతోందని, ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నానని తరచూ తల్లితో నాగులు గొడవకు దిగేవాడు.
ఈ నేపథ్యంలో కొంతకాలంగా తల్లి పూర్తిగా మంచానికే పరిమితమైంది. దీంతో ఆమెకు సేవలు చేయలేక నాగులు తరచూ విసుక్కునేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం తండ్రి కట్టెలు తెచ్చేందుకు వెళ్లడంతో అదే అదనుగా భావించిన నాగులు కత్తితో తల్లి గొంతు కోసి హతమార్చాడు. అనంతరం తనకు ఏమీ తెలియనట్లు నటించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తల్లిని చంపిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ముత్తమ్మ మృతదేహాన్ని భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.