అవును...ఆమె ఆత్మ‌క‌థ రాసింది

By Newsmeter.Network  Published on  2 Dec 2019 9:51 AM GMT
అవును...ఆమె ఆత్మ‌క‌థ రాసింది

సిస్టర్ ల్యూసీ కలుప్పురాయిల్ గుర్తుందా? నిర్భయలు, దిశల విషయంలో ఇంక చేయాల్సిందేమీ లేదు కాబట్టి భేషుగ్గా గుర్తుంచుకుంటాం. చట్టం తన పని తాను చేసుకుపోతుందని హాయిగా కాసిని కొవ్వొత్తులు వెలిగించి ఊరుకోవచ్చు. కానీ సిస్టర్ ల్యూసీ కలుప్పురాయిల్ కథ వేరు.

ఆమె వ్యవస్థపై పోరాడింది. ఫాదర్లు, సిస్టర్లు కలిసి దేవునికి అంకితం కావాల్సింది బదులు అక్రమ సంబంధాల రొంపిలో ఇరుక్కుంటే దానికి వ్యతిరేకంగా గళం విప్పింది. తనపై ఏళ్ల తరబడి జరిగిన రేప్ లపై గొంతెత్తింది. బిషప్ ఫ్రాంకో ముల్లకల్ పై పోరాటం చేసింది. దేవ సేవలో తరించాల్సిన వారు దేహ సేవను వరించడం పాపమని గొంతు విప్పింది. ఆమెను చర్చి వ్యవస్థ బహిష్కరించింది. ఇప్పుడు ఆమె తన అనుభవాలన్నిటినీ ఆత్మ కథగా “కర్తావింటే నామతిల్” (దేవుని పేరిట) అనే పుస్తక రూపంలో వెలువరించింది. అందులో తన కాన్వెంట్ జీవనంలో నాలుగు సార్లు ఎలా లైంగిక అత్యాచారాలను ఎదుర్కొన్నదీ వివరించింది. ఫాదర్ ఫ్రాంకో ముల్లకల్ వంటి బలవంతుడిని ఎదుర్కొన్న కారణంగా చర్చిలో ఆమె ఎలా ఒంటరయ్యింది, ఎలా బహిష్కరణకు గురైందీ వివరించింది.

ఒకానొక సందర్భంలో తనపై చర్చి ప్రాంగణంలోనే లైంగిక అత్యాచార యత్నం జరిగిన విషయాన్ని ఇంకో నన్ కు చెబితే ఆమె దిగ్భ్రాంతికి గురికావడానికి బదులు ఎంతో కుతూహలంతో వినడం గురించి చెప్పింది. సీనియర్ నన్ లు కొత్తగా చేరిన నన్ లను ఫాదర్లకు సమర్పించుకున్నారని, ధర్మాచార్యులు నగ్నంగా ఉన్న నన్ లను గంటల తరబడి చూస్తూ ఉండేవారని, వారితో కాలం గడిపేవారని ఆమె తన పుస్తకంలో వ్రాసింది. ఈ ఫాదర్లు నన్ లతో ఎలాంటి వికృత లైంగిక చేష్టలకు పాల్పడేవారో ఆమె తన ఆత్మకథలో రాసింది. లైంగిక అత్యాచారాలకు ఘనత వహించిన ప్రీస్ట్ రాబిన్ కొట్టియూర్ లో ఒక మైనర్ బాలికను గర్భవతి చేసిన సంఘటనను గుర్తు చేస్తూ, సదరు ప్రీస్ట్ ఇలాంటి ఘోరాలు ఎన్నో చేశాడని ఆమె వ్రాసింది. ఆయన పుణ్యమా అని ఒక సిస్టర్ గర్భవతి అయినప్పుడు చర్చి ఫాదర్ పక్షానే నిలిచింది తప్ప సిస్టర్ పక్షాన కాదు.

తాను దేవుడి పేరిట ఈ పుస్తకాన్ని రాశానని, అందుకే ఇందులో నిజం తప్ప మరేమీ లేదని ఆమె విలేఖరులకు చెప్పారు. తన వంటి ఎంతో మంది నన్ ల కథ లు ఇంకా వ్రాయాల్సి ఉంది. ఈ పుస్తకంలో 38 అధ్యాయాలు ఉన్నాయి. తనను చర్చి నుంచి వెలి వేస్తూ పై వారు రాసిన లేఖలను కూడా ఆమె ఇందులో పొందుపరిచారు.

Next Story