సెలెక్ట్ కమిటీ అంటే ఏంటి ? ఈ కమిటీ ఏం చేస్తుంది ?

రాజధాని వికేంద్రీకరణ , సీఆర్డీఏ రద్దు బిల్లులకు శాసనమండలిలో బ్రేకులు పడ్డాయి. మరోవైపు రాజధాని నుంచి కార్యాలయాలను తరలించవద్దంటూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చి, తదుపరి విచారణను ఫిబ్రవరి 26వ తేదీకి వాయిదా వేసింది. మండలిలో ఈ రెండు బిల్లులను మండలి ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు తెలిపారు. దీంతో అందరి దృష్టి సెలెక్ట్ కమిటీపై పడింది. అసలు సెలెక్ట్ కమిటీ అంటే ఏమిటి ? ఈ కమిటీకి బిల్లులను పంపితే..ఏం చేస్తుంది ? రాజధానిని తరలిస్తుందా ? అమరావతే రాజధాని అంటుందా ? ఇలా పలు సందేహాలు మొదలయ్యాయి అందరికీ..

సెలెక్ట్ కమిటీ అంటే…

ఈ కమిటీలో ఉండే 15 మంది సభ్యుల్ని సభ నిర్ణయిస్తుంది. కమిటీ అధ్యక్షుడిని మండలి చైర్మన్ నియమిస్తారు. అలాగే ఈ కమిటీలో బిల్లు ప్రతిపాదిత సభ్యుడు కూడా ఉంటారు. అంటే ప్రస్తుతం ఈ బిల్లును ప్రతిపాదించిన మంత్రి బుగ్గన కూడా ఈ కమిటీలో ఒక సభ్యుడిగా ఉంటారు.
మండలిలో ఉన్న పార్టీల బలా బలాలను బట్టి సెలెక్ట్ కమిటీలో ప్రాతినిధ్యం ఉండే విధంగా సభ్యుల ఎంపిక జరుగుతుంది. శాసన మండలిలో ప్రస్తుతం టీడీపీకే మెజార్టీ సభ్యులున్నారు కాబట్టి ఆ పార్టీకి చెందిన సభ్యులే సెలెక్ట్ కమిటీలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ కమిటీ ప్రస్తుతం అధికారపక్షం ప్రవేశపెట్టిన బిల్లుల వల్ల ప్రభావితమయ్యే అంశాలపై చర్చించనుంది.

రాజధాని బిల్లుల ప్రకారం అమరావతి రైతులతో పాటు విశాఖ, కర్నూల్ జిల్లాలకు చెందిన వారి వాదనలను కూడా సెలెక్ట్ కమిటీ వినే అవకాశం ఉంది. అంటే మొత్తం 13 జిల్లాలకు చెందిన వారి అభిప్రాయాలను తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. బిల్లు స్వరూపాన్ని మార్చడానికి, దాన్ని తిరస్కరించడానికి సెలక్ట్ కమిటీకి అధికారం లేకపోయినా సూచనలు చేయడానికి మాత్రం సెలెక్ట్ కమిటీకి ఆస్కారం ఉంది. అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత బిల్లులో ఏమైనా మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంటే గనుక కమిటీ వాటిని ప్రతిపాదిస్తుంది. అన్నీ పూర్తయ్యాక కమిటీ సభ్యులు సవరణ బిల్లుకు నోటీసులు ఇవ్వొచ్చు. బిల్లుల్లో అన్ని సవరణలు పూర్తయ్యాక మళ్లీ అసెంబ్లీకి వస్తుంది. అక్కడ అసెంబ్లీ సభ్యులు మళ్లీ ఈ బిల్లులపై చర్చించి, మండలి ఏర్పాటు చేసిన సెలెక్ట్ కమిటీ ప్రతిపాదించిన సూచనలు, సలహాల్లో సవరణలు ప్రతిపాదించే అవకాశం లేకపోలేదు.

అసెంబ్లీలో బిల్లుపై చర్చ తర్వాత…మండలికి చేరుతుంది. మండలి మళ్లీ బిల్లును ఆమోదించకపోతే..రెండోసారి శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. ఇదంతా జరగాలంటే కనీసం 1-3 నెలల సమయం పడుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల పై సెలెక్ట్ కమిటీ అభిప్రాయాలు సేకరించి మార్పులు, చేర్పులు చేసి ఇవ్వడానికి ఇచ్చిన గడువు మూడు నెలలే అయినప్పటికీ…మరో నెలరోజుల గడువు కోరేందుకు కమిటీ సిద్ధమవుతుందని తెలుస్తోంది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.