ఆ ఛాందస దేశంలో సిగరెట్టే జెండా కర్ర, పొగే జెండా

By సుభాష్  Published on  17 Feb 2020 11:58 AM GMT
ఆ ఛాందస దేశంలో సిగరెట్టే జెండా కర్ర, పొగే జెండా

అతి ఛాందస సౌదీ అరేబియాలో మార్పు ఇప్పుడు రింగురింగులుగా వదిలిన పొగలా వచ్చేస్తోంది. ఇన్నాళ్లూ కట్టడులూ, కచ్చడాల మధ్య బందీ బతుకులు బతికిన సౌదీ మహిళలు ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారు... కాదు కాదు ... వదులుతున్నారు. అవును.... సౌదీ మహిళలకు తాజా సంస్కరణల్లో భాగంగా కాసింత స్వేచ్ఛ లభించింది. దాన్ని వారు పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో, పార్కుల్లో, హోటళ్లలో పైపులు , సిగరెట్లు కాలుస్తున్నారు. స్వేచ్ఛగా పొగ వదుల్తున్నారు.

ఇప్పుడు సౌదీ మహిళలకు బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ట తాగడం ఒక స్వేచ్ఛా ప్రకటన.... ఒక హక్కుల మానిఫెస్టో.... ఒక ఎత్తిన జెండా....!!ఇరవయ్యవ శతాబ్దపు తొలి భాగంలో పాశ్చాత్య మహిళలు చేసిన తిరుగుబాటు సిగరెట్ల రూపంలోనే కనిపించింది. సౌదీ మహిళలు 21 వ శతాబ్దంలో అదే చేస్తున్నారు.

సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ తీసుకొచ్చిన సంస్కరణల వల్ల ఆర్ధిక, సామాజిక రంగంలో విప్లవాలు మొదలయ్యాయి. బుర్ఖాలు, బందీఖానాలు, ఆదిమయుగపు కిరాతక శిక్షల నుంచి సౌదీ ఇప్పుడు ప్రగతి వైపు పరుగులు తీస్తోంది. ఆధునికత వైపు ఉరకలు వేస్తోంది. ఇప్పుడు మహిళలు స్వయంగా వాహనాలు నడుపుతున్నారు. ఫంక్షన్లకు, ఈవెంట్లకు ఒంటరిగానే వెళ్లగలుగుతున్నారు. మగతోడు లేకుండానే ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నారు. మహిళలకు ఇప్పుడు పోలీసులు చూస్తారనో లేక మోరల్ పోలీసింగ్ ముఠాలు చూస్తాయోనన్న భయం లేదు. ఇంట్లో వాళ్లు చూడకపోతే చాలు అనుకుంటున్నారు. కానీ సమాజపు ఛాందసవాదాన్ని ఛాలెంజ్ చేయాలంటే వాళ్లకి సిగరెట్ల కన్నా చక్కని ఆయుధం కనిపించలేదు. “ఇది నా హక్కు... నా స్వేచ్ఛ. నా వ్యక్తిగత స్వేచ్ఛను ఎవరూ హరించలేరు” అంటున్నారు ఆధునిక అరేబియన్ యువతులు.

తమాషా ఏమిటంటే ఇన్నిన్ని నిబంధనలు, కట్టడులు ఉన్నా సౌదీ అమ్మాయిల్లో 65 శాతం మంది స్కూళ్లలో ఉన్న టైమ్ లోనూ పొగతాగడం అలవాటు చేసుకుంటున్నారు. పైగా దొంగచాలుగా తాగుతున్నారు. ఒకప్పుడు గోళ్లకు పాలిష్ వేసుకుంటేనే భూగోళం బద్దలైనంత హడావిడి జిరిగేది. ఇప్పుడు అది మామూలైపోయింది. మొత్తానికి మత ఛాందసవాద కంచుకోటలో మహిలలు తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. సిగరెట్ పీక జెండా కర్ర అయితే సిగరెట్ పొగే జెండా.

Next Story