ఇంగ్లాండ్‌లో ఓ ప్రాంతంలో చెత్త‌లో రూ.14 ల‌క్ష‌లు ల‌భ్య‌మ‌య్యాయి. బుర్న‌హ‌మ్‌ ఆన్‌-సీ ప్రాంతానికి చెందిన ఒక ఇంట్లో ఇంటిని శుభ్రం చేసే క్ర‌మంలో ఇంట్లో ఉన్న పాత పెట్టెలు, ప‌నికిరాని వ‌స్తువుల‌న్నీ చెత్త‌గా ఉన్నాయ‌ని భావించి, వాటిని రీసైక్లింగ్ సెంట‌ర్‌కు పంపించారు. కాగా, అక్క‌డి సిబ్బంది చెత్తను రీసైక్లింగ్ కు త‌ర‌లించే ముందు త‌నిఖీ చేస్తుండ‌గా చెత్త‌లో వారికి రూ. 15 పౌండ్లు (రూ.14 ల‌క్ష‌లు) క‌నిపించ‌డంతో ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు. దీంతో రీసైక్లింగ్ సిబ్బంది పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

వెంట‌నే వ‌చ్చిన పోలీసులు ఈ చెత్త ఎక్క‌డి నుంచి వ‌చ్చింది.. ఎవ‌రు తీసుకువ‌చ్చార‌నే విష‌యంపై సీసీ కెమెరాల‌ను ప‌రిశీలించారు. సీసీ టీవీ ఆధారంగా అట్ట‌పెట్టెల‌ను తీసుకువ‌చ్చిన వారి ఫోన్ నంబ‌ర్ క‌నుగొని వారిని ప్ర‌శ్నించగా, ఇంటిలో ఉన్న త‌మ బంధువు మృతి చెంద‌డంతో ఇంటిని శుభ్రం చేశామ‌ని, ఇంట్లో ప‌నికి రాకుండా ఉన్న అట్ట‌పెట్టెల‌ను రీసైక్లింగ్ నిమిత్తం పంపించామ‌ని, కానీ అందులో ఉన్న డ‌బ్బుల విష‌యం త‌మ‌కు తెలిద‌ని ఆ కుటుంబం పోలీసుల‌కు వివ‌రించింది. కాగా, న‌గ‌దు ఉన్న విష‌యాన్నిపోలీసుల‌కు తెలియ‌జేసి, నిజాయితీని చాటుకున్న సిబ్బందిని పోలీసులు అభినందించారు. చెత్త‌లో ఇంత పెద్ద మొత్తంలో బ‌య‌ట‌ప‌డ‌టంపై విచార‌ణ జ‌రిపిన పోలీసులు, అనంత‌రం ఆ మొత్తాన్ని ఆ కుటుంబానికి అంద‌జేశారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.