ఉగాది పండుగ సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీమ్ టైటిల్ లోగో తో పాటు, మోషన్ పోస్టర్ ను విడుదల చేసి అభిమానుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఇప్పుడు మరో సర్ ప్రైజ్ వీడియోను విడుదల చేయనుంది చిత్ర బృందం. శుక్రవారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా భీమ్ ఫర్ రామరాజు పేరుతో సర్ ప్రైజ్ వీడియోను విడుదల చేయనున్నట్లు గురువారం రాత్రి ట్వీట్ చేసింది ఆర్ఆర్ఆర్ బృందం.

అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా గురువారం రాత్రి ట్విట్టర్ వేదికగా రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ..”బ్రదర్ నీ పుట్టిన రోజును ఘనంగా చేయాలనుకున్నా. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి ఇళ్లకే పరిమితమవ్వడం మంచిదని భావిస్తున్నా. కానీ నీకు డిజిటల్ మీడియా వేదికగా బర్త్ డే సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నా” అంటూ ట్వీట్ చేశారు.

ఎన్టీఆర్ ట్వీట్ కు స్పందించిన రామ్ చరణ్..”వావ్, అయితే నేను సరైన సమయానికే ట్విట్టర్ ఖాతా తెరిచాననమాట. నేను ట్విట్టర్ లోకి రాకపోయుంటే నువ్విచ్చే సర్ ప్రైజ్ ను మిస్సయ్యేవాడిని. నీ సర్ ప్రైజ్ ను ఇప్పుడే చూడాలనుంది” అంటూ ట్వీట్ చేశారు.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి డివివి దానయ్య నిర్మాతగా ఉన్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.