'ఆ' రనౌట్‌లో తప్పు ఎవరిది..?

By Newsmeter.Network  Published on  22 Feb 2020 1:34 PM GMT
ఆ రనౌట్‌లో తప్పు ఎవరిది..?

భారత్‌తో వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌పై న్యూజిలాండ్ పట్టు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 165 పరుగులకే కుప్పకూలగా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్‌ 216/5తో నిలిచింది. ఇప్పటికే 51 పరుగుల ఆధిక్యంలో ఉంది కివీస్‌. మూడో రోజు భారీ స్కోర్‌ సాధించి మరో సారీ బ్యాటింగ్‌ చేయకూడదనే ఆలోచనలో ఉంది కివీస్‌. ఇదిలా ఉంటే.. తొలి ఇన్నింగ్స్‌లో రిషబ్‌ పంత్ (19; 53 బంతుల్లో 1 పోర్‌, 1సిక్స్‌) రనౌట్ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. 64 టెస్టులు అనుభవం ఉన్న రహానే తొందపాటు కారణంగానే పంత్ రనౌట్‌ అయ్యాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా.. ఇందులో పంత్ తప్పు కూడా ఉందని కామెంటేటర్లు అంటున్నారు.

అసలేం జరిగింది..?

ఇన్నింగ్స్ 59వ ఓవర్ వేసిన ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ బౌలింగ్ లో బంతిని పాయింట్ దిశగా నెట్టిన అజింక్య రహానె సింగిల్ కోసం రిషబ్ పంత్‌ని పిలిచాడు. పంత్ స్పందించి.. వేగంగా రెండు అడుగులు ముందుకు వేశాడు. కానీ.. అప్పటికే బంతి ఫీల్డర్ అజాజ్ పటేల్ చేతుల్లోకి వెళ్తుండంతో అనూహ్యంగా వెనక్కి తగ్గాడు. కానీ.. అప్పటికే పిచ్ మధ్యలోకి వచ్చేసిన రహానె.. అలానే నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు పరుగెత్తడంతో రిషబ్ పంత్‌కి స్ట్రైకింగ్ ఎండ్‌వైపు పరుగెత్తడం తప్ప మరో ఆప్షన్ లేకపోయింది. అయితే.. అప్పటికే బంతిని అందుకున్న ఫీల్డర్ అజాజ్ వికెట్లపైకి దాన్ని విసరడంతో పంత్ రనౌట్‌గా వెనుదిరిగాడు. వాస్తవానికి అప్పటికే 100 బంతులు ఆడిన ఈ జోడి.. మరికొద్దిసేపు క్రీజులో ఉండింటే భారత్ మెరుగైన స్కోరు చేసేది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 165 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

నెటీజన్లు ఏమంటున్నారూ..?

పంత్ చాన్నాళ్లుగా రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు. అటు పరిమిత ఓవర్ల క్రికెట్ లో కేఎల్ రాహుల్.. ఇటు సుదీర్ఘ ఫార్మాట్‌లో వృద్ధిమాన్‌ సాహా ఉండడంతో పంత్ కు అవకాశాలు దక్కడం లేదు. రాక రాక న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో అవకాశం వచ్చింది. అలాంటి తరుణంలో ఈ రనౌట్‌ పంత్ కెరియర్‌నే ప్రశ్నార్థకం మారింది. సోషల్ మీడియాలో నెటీజన్లు పంత్ రనౌటవ్వడానికి కారణం రహానె అంటూ నిందిస్తున్నారు. టెస్టుల్లో.. అదీ సింగిల్ కోసం ఆ కక్కుర్తి అవసరమా..? పంత్ రనౌట్‌కు కారణం రహానే..? పాపం పంత్.. రహానే కోసం వికెట్‌ త్యాగం చేశాడు..? అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

క్రీడాపండితులు ఏమంటున్నారూ..?

టెస్టుల్లో పంత్ రనౌట్‌ కావడం పై క్రికెట్‌ విశ్లేషకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రనౌట్‌లో పంత్ పొరపాటు కూడా ఉందని కామెంటేటర్లు సంజయ్‌ మంజ్రేకర్‌, స్కాట్‌ స్టెయిరిస్‌ అభిప్రాయపడ్డారు. సంజయ్‌ మాట్లాడుతూ.. బంతి ఎక్కడ ఉందో పంత్ చూడటానికి ప్రయత్నించాడు. దీంతో అతడు పరుగు కోసం సంకోచించాడని అన్నాడు. దీనికి స్టైయిరిస్‌ స్పందిస్తూ.. మన భాగస్వామిపై నమ్మకం ఉంచాలి. రహానెను పంత్ నమ్మకపోవడం కాస్త నిరాశకు గురిచేసిందన్నాడు. రహానెను నమ్మి పరుగు కోసం వెంటనే ప్రయత్నించి ఉంటే రనౌటయ్యేవాడు కాదు. ఎందుకంటే.. అజాజ్‌ వేగవంతమైన ఫీల్డర్‌ కాదు. కానీ పంత్ బంతి ఎక్కడ ఉందని మరోసారి చూశాడు. దీంతో పరుగు పూర్తి చేయడంలో ఆలస్యం అయ్యింది. ఆ పరుగు విషయంలో రహానె ను పూర్తిగా విశ్వసించవచ్చు అని అన్నారు.

ఇద్దరి వాదన ఎలా ఉన్నా కూడా.. టీమిండియాకు జరగాల్సిన నష్టం జరిపోయింది. ఇక ఇప్పుడు టీమిండియా ముందు ఉన్న ఏకైక మార్గం కివీస్‌ ను సాధ్యమైనంత త్వరగా ఆలౌట్ చేసి.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ను సాధించడమే. అలా చేయకుంటే.. మ్యాచ్‌లో గెలుపు కష్టమే..

Next Story