•  మెల్లగా ముందడుగు వేస్తున్న అభివృద్ధి పథకాలు
  •  ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
  •  కాళేశ్వరం పథకానికి పెద్ద ఎత్తున మద్దతు
  •  నత్త నడకన సాగుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం
  •  నిధుల లేమివల్లే పథకాల అమలు ఆలస్యం
  •  పూర్తి స్థాయిలో అన్ని పథకాలను అమలు చేస్తామంటున్న ప్రభుత్వం
  •  నమ్మకంతో వేచి చూస్తున్న తెలంగాణ ప్రజలు

వరసగా రెండోసారి అధికారాన్ని చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఈ ఏడాదిలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన నత్తనడకన సాగుతున్నట్లే ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో హామీలు ఇచ్చినంత వేగంగా వాటిని ఆచరణలో పెట్టలేకపోతుందంటున్నారు. ఇప్పటి వరకూ ప్రారంభించిన పథకాల ద్వారా మాత్రం కేసీఆర్ ప్రభుత్వం మంచి పేరే సంపాదించుకుందట. భూసేకరణ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు లాంటి పథకాల్లో ముందడుగు వేయలేని ఆశక్తతను తెలివిగా ముఖ్యమంత్రి అధిగమించి, వీలైనంతగా ప్రజల్లోకి చొచ్చుకుపోయే పథకాల మీద శ్రద్ధ పెట్టి ప్రజాబాహుళ్యంలో మంచి మార్కులే తెచ్చుకుంటున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చిపెట్టిన పథకాలు

రైతుబంధు :

ఈ పథకం దాదాపుగా కేసీఆర్ రెండోవిడత పాలనలో సక్సెస్ సాధించినట్లే. నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమచేసి, రైతుకు ప్రయోజనాన్ని చేకూర్చే పథకం ఇది. 2018 ఎన్నికల్లో ఈ రైతుబంధు పథకం టీఆర్ఎస్ కు ఓట్ల వర్షాన్ని కురిపించింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయానికి దోహదం చేసిన ముఖ్యమైన అంశాల్లో ఈ పథకం సక్సెస్ కూడా ఒకటని రాజకీయ విశ్లేషకులు బల్లగుద్ది మరీ చెప్పారు. రైతు బంధు ద్వారా ప్రతి రైతుకూ ఎకరానికి రూ.4,000 నుంచి రూ.5,000 వరకూ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.6000 కోట్లు కేటాయించింది. కేటాయించిన నిధులు సరిపోకపోవడంతో రూ.1,300 కోట్లను అదనంగా కేటాయించగలిగితేనే పూర్తి స్థాయి ఫలితాలు సాధించడానికి వీలుంటుందని నిపుణులు, అధికారులు ముఖ్యమంత్రికి విన్నవించారు. దాంతో ముఖ్యమంత్రి ఏమాత్రం వెనకడుగు వేయకుండా మరో రూ.1,000 కోట్లను రైతుల కోసం కేటాయించేందుకు సిద్ధపడ్డారు. కిందటిసారి ఎలాంటి అవరోధాలూ లేకుండా పథకం అమలు సాఫీగా సాగిపోయింది. ఈసారి మాత్రం ఐదునుంచి పది ఎకరాల భూమి ఉన్న రైతులు కొందరు తమకు డబ్బు అందలేదని ఫిర్యాదు చేస్తున్నారు. ప్రభుత్వం ఒత్తిడిని తట్టుకునేందుకు ఈ పథకానికి పదెకరాల పరిమితిని విధించాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అలా చేయడంవల్ల అంతకు మించి భూమి ఉన్న పెద్ద రైతులకు డబ్బు ఇవ్వడంకంటే చిన్న రైతులను ఆదుకోవడంద్వారా మంచి పేరు వస్తుందన్నది అధికారుల ఆలోచన. కానీ సీఎం సార్ మాత్రం అందుకు సిద్ధంగా లేరు. పూర్తి స్థాయిలో రైతులందరికీ పథకాన్ని వర్తింపజేయాలన్నది ఆయన ఆకాంక్ష. అలా చేయాలంటే కనీసం మరో రూ.1000 కోట్ల నిధులు అవసరమవుతాయి.

ఋణ మాఫీ పథకం :

ఈ పథకం సఫలమో? విఫలమో? కూడా అర్థంకాని పరిస్థితి నెలకొంది. రెండోసారి ఆధికారాన్ని చేపట్టిన ప్రభుత్వానికి ఋణమాఫీ పథకం పెద్దగా ప్రయోజనాన్ని చేకూర్చిన ఆనవాళ్లేవీ కానరావడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది రైతులు ఈ పథకం కింద తాము తీసుకున్న ఋణాలు మాఫీ అవుతాయని ఆశగా ఎదురుచూస్తునే ఉన్నారు. చెల్లించాల్సిన బకాయిలు రద్దు అవ్వని కారణంగా చాలామంది రైతులకు కొత్త ఋణాలు ఇంకా అందనేలేదు. మూడేళ్లలో ఖచ్చితంగా ఋణమాఫీని అమలు చేసి తీరతామని, మూడు విడతల్లో రైతులందరి ఋణాలనూ మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ రైతులకు వాగ్దానం చేశారు. మొదటి విడతలో (2014-18), రూ.17,000 కోట్ల నిధులు ఈ పథకం కోసం కేటాయించారు. రెండో విడత వచ్చేసరికి చాలామంది రైతులు ప్రభుత్వం ఋణమాఫీ పథకాన్ని అమలు చేస్తుందన్న భరోసాతో కొత్త ఋణాలు తీసుకున్నారు. ఫలితంగా ఇప్పుడు మాఫీ చేయాల్సిన ఋణాలు దాదాపుగా రూ.32,000 కోట్లకు చేరుకుంది. ఇది రాష్ట్రానికి పెను భారంగా మారింది.

గ్లోబల్ సిటీ – హైదరాబాద్ :

రోడ్లు, కాలుష్యం, అక్రమ లే అవుట్లు దీనికి తీవ్రస్థాయి విఘాతాలు. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మారుస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు. ఐదేళ్లు గడిచిన తర్వాత కూడా మహానగర రోడ్లు, కాలుష్యం పరిస్థితిలో ఏ మాత్రం మార్పులేదు. ఏ పక్క రోడ్లు చూసినా పెద్ద పెద్ద గుంటలు, నోళ్లు తెరుచుకుని ఉన్న మ్యాన్ హోల్స్ దర్శనమిస్తున్నాయి. నగరంలో ఏ వైపు చూసినా పూర్తి స్థాయిలో రోడ్లు కిక్కిరిసిన ట్రాఫిక్ తో సతమతమవుతున్నాయి. నిజానికి మెట్రో రైలు వచ్చిన తర్వాత కొంత రోడ్డు ట్రాఫిక్ తగ్గాలి. అదేం విచిత్రమో గానీ మెట్రో వచ్చాక ట్రాఫిక్ ఇంకా ఎక్కువైంది. నగరంలో ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పనకు సుమారు రూ.4,000 కోట్లయినా అవసరమవుతాయని అంచనా. రెండోసారి అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటుతున్నా కనీస సదుపాయాలు కల్పించేందుకు రూ.4,000 కోట్లు ఖర్చు పెట్టగలిగే పరిస్థితిలో ప్రభుత్వం లేదని అధికారులే చెబుతున్నారు. ఎల్బీనగర్ దగ్గర నిర్మించిన ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ నిర్మాణాలను జి.హెచ్.ఎం.సి పూర్తి చేసింది. ఇది కొంతలో కొంత మెరుగైన అంశం. చెరువుల ఆక్రమణ, అక్రమ లే అవుట్ల నిర్మాణం వల్ల రోజురోజుకీ నగరం పూర్తిగా అస్తవ్యస్తంగా తయారవుతోందన్నది వాస్తవమనే చెప్పాలి. ఇక రోడ్లు, పార్కుల ఆక్రమణల సంగతి సరేసరి. దీనివల్ల మరిన్ని కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయన్న విషయాన్ని తోసిపుచ్చలేని పరిస్థితి. కొత్తగా చేపట్టిన అనేక ప్రాజెక్టులయితే నిధుల లోపం వల్లో, భూ ఆక్రమణల వల్లో పూర్తి స్థాయిలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. మెట్రోపాలిటన్ రీజియన్ మాస్టర్ ప్లాన్ అమలు ఆరు నెలల క్రితమే పూర్తి కావాల్సింది. కానీ ఇప్పటికి దాని ఊసైనా లేదు. కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలనన్నింటినీ ఔటర్ రింగ్ రోడ్డు అవతలికి తరలించాలన్న ఆలోచనకూడా ఉంది. కానీ ఇప్పట్లో అది సాధ్యమయ్యే పని కాదన్న విషయం ప్రభుత్వానికీ స్పష్టంగా తెలుసు. ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసుకుంటూ వెళ్తామన్న ప్రభుత్వం చెప్పిన మాటలు నీటి మూటలే అయ్యాయి. అక్రమ లే అవుట్లను రెగ్యులరైజ్ చెయ్యడంవల్ల నేరుగా వాటిని ప్రోత్సహించినట్లయ్యిందని కొందరు తీవ్ర స్థాయిలో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కానీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గక పూర్తి స్థాయిలో అక్రమ లే అవుట్లను క్రమబద్ధీకరించేసింది. జీహెచ్ఎమ్సీ గానీ హెచ్ఎండిఎ గానీ అక్రమ లే అవుట్లను నిరోధించడంలో ఏమాత్రం శ్రద్ధను కనపరచలేకపోయాయి.

మిషన్ భగీరథ :

కేసీఆర్ బ్రెయిన్ ఛైల్డ్ పథకం, ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పథకం ఇది. అంత ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించినప్పటికీ వేలాది గ్రామాలు ఇంకా నీటికోసం తహతహలాడుతూనే ఉన్నాయి. 24వేల మంచినీటి కుళాయిల్ని ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. దీనికి గాను అంచనా వ్యయం రూ.45 వేల కోట్లు. 23,900 కుళాయిల్ని ఇప్పటికే ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. కేవలం వంద కనెక్షన్లు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయంటోంది. వాస్తవిక పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఇవ్వాల్టికీ వేలాది గ్రామాలకు ఇంకా ఈ పథకం కింద లబ్ధి చేకూరనేలేదు. చాలా గ్రామాల్లో మంచినీటి చెరువులను తవ్వించి లేదా ఓవర్ హెడ్ ట్యాంకుల్ని ఏర్పాటు చేసి వాటి ద్వారా జనానికి నీళ్లివ్వాలన్న ప్రభుత్వ యోచన మంచిదే. కానీ అది అందరికీ అందకపోవడంతో అందని ద్రాక్ష పుల్లన అని కొందరు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. దానివల్ల ప్రభుత్వం మీద నెగటివ్ భావనలు పెరుగుతాయి. మారుమూల గ్రామాల్లో, ప్రత్యేకించి గిరిజనులు ఉండే ప్రాంతాలు, గ్రామాల్లో ఇంకా చాలామందికి అసలు మంచినీటి కుళాయనేది ఒకటి ఇస్తున్నారన్న సంగతి కూడా తెలీదు. కొన్నిచోట్ల ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టి పైపులు వేసినప్పటికీ ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇవ్వలేదు. పనుల నాణ్యతపై కూడా తీవ్రస్థాయిలో ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రత్యేకించి పైపుల నాణ్యత సరిగా లేదన్న వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. నిధుల కొరతవల్ల పూర్తి స్థాయి వేగంతో దీన్ని పూర్తి చేయడానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ ఏడాదిలోగా పూర్తి స్థాయిలో ఈ పథకాన్ని పూర్తి చేస్తామని అధికారులు అంటున్నారు.

ఇరిగేషన్ ప్రాజెక్టులు : కాళేశ్వరంపైనే పూర్తి దృష్టి – మిగతా ప్రాజెక్టుల నత్త నడక

రాష్ట్రంలో కొత్తగా మరో కోటి ఎకరాలను సాగులోకి తీసుకురావాలన్న సత్సంకల్పంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. దీనివల్ల సాగునీటి, తాగునీటి ప్రయోజనాలు చేకూరతాయన్న మాట వాస్తవమే కానీ కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ మీదే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడంవల్ల రాష్ట్రంలో మిగిలిన చిన్నాచితకా ప్రాజెక్టులు పూర్తిగా మరుగునపడ్డాయి. ఆఖరికి మిషన్ కాకతీయ పథకం కింద మంచినీటి ట్యాంకుల్ని ఆధునీకరించే పనులు కూడా మూలన పడ్డాయి. మేడిగడ్డనుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్ కు, ఎల్లంపల్లి నుంచి మానేరుకు ఎత్తిపోతలకోసం ప్రభుత్వం కాళేశ్వరం ఫేజ్ 1ని ఆగమేఘాలమీద పూర్తి చేసింది. ఇప్పుడు పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను పట్టాలు ఎక్కించేందుకు ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయి. దీనివల్ల రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందుతుంది. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ దుమ్ముగూడెం ప్రాజెక్టును ప్రకటించారు. దీంతోపాటు కాళేశ్వరానికి సంబంధించిన అదనపు పనుల్ని పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులను పూర్తిచేయడమే సీఎం లక్ష్యం.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు : రెండేళ్లలో కనీసం 15% వరకైనా లక్ష్యాన్ని సాధించలేకపోయిన ప్రభుత్వం

ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ ఖచ్చితంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చితీరుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ వాగ్ధానం చేశారు. 2014 ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినా..ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఏ మాత్రం ముందడుగు పడిన దాఖలాలు కనిపించడంలేదు. గడిచిన ఆరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 40వేలకంటే తక్కువ ఇళ్లు నిర్మితమయ్యాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును తీవ్రస్థాయిలో నిధుల లేమి ఇబ్బంది పెడుతోంది. హీనపక్షం దీనికోసం 7వేల కోట్లరూపాయల్ని కేటాయించాల్సి ఉండగా ఇప్పటివరకూ రూ.2,400 మాత్రం కేటాయించారు. కిందటి ఎన్నికల్లో కేసీఆర్ మరో వరాన్ని ప్రకటించారు. భూమి ఉన్నవాళ్లు ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవడానికి (అసలు ఇల్లు లేని వాళ్లకు మాత్రమే) ముందుకొస్తే వాళ్లకు ప్రభుత్వం రూ.5 లక్షలు కేటాయిస్తుందని వాగ్దానం చేశారు. మాటయితే ఇచ్చారు కానీ డబ్బుల మూటల్ని తేవడానికి ప్రభుత్వానికి ఇప్పుడు తల ప్రాణం తోకకొస్తోందనే చెప్పాలి. ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే ఎన్నో అవాంతరాలను అధిగమించాలి ఈ ప్రభుత్వం. ముఖ్యంగా నిధులలేమి అన్నింటికంటే పెద్ద అవాంతరం. వచ్చే మార్చి, ఏప్రిల్ నాటికి కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటివరకూ ఆరువేల ఐదు వందల కోట్ల రూపాయల్ని ఈ పథకం కోసం వెచ్చించిందీ ప్రభుత్వం.

26 ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ ల నిర్మాణం : మూడేళ్లకు కూడా పూర్తి కాని నిర్మాణాలు

జిల్లాల్లో సకల సదుపాయాలతో కూడిన సమగ్రమైన కలెక్టరేట్ కాంప్లెక్స్ లను నిర్మించ తలపెట్టిన ప్రభుత్వం ఇందుకోసం రూ.850 కేటాయించింది. కానీ మూడేళ్లు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది పథకం పనితీరు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణం ప్రారంభమైనప్పటికీ పని నత్తనడకన సాగుతుండటం గమనార్హం. జూన్ కల్లా కనీసం కొన్ని నిర్మాణాలైనా పూర్తి చేయాలన్న గట్టి పట్టుదలతో ఉంది ప్రభుత్వం. ముఖ్యంగా సరైన, అనుకూలమైన భూమిని గుర్తించడం, సేకరించడంలోనే ఈ ప్రాజెక్టుకు ప్రాథమిక స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయని విశ్లేషకుల అంచనా. నిధుల మంజూరులో జాప్యం వల్ల ప్రాజెక్ట్ ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో నిర్మాణాలకోసం కేటాయించిన నిధులు రూ.95.37 కోట్లు. కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో రూ.66.85 కోట్లతో ప్రాజెక్ట్ ల నిర్మాణాన్ని చేపట్టాలి. పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలకు అంచనా వ్యయం రూ.93 కోట్లు. వరంగల్, జనగాం జిల్లాలకు ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ. 62 కోట్లు. నిజానికి ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రాజెక్ట్ ప్రజలకు అత్యంత లాభదాయకమైనదే. ఈ పథకం పూర్తైతే ప్రజలు వివిధ అధికారిక కార్యాలయాల కోసం కాళ్లరిగేలా తిరగాల్సిన అవసరం ఉండదు. ఒకే గొడుగు కింద అన్ని కార్యాలయాలు ఉండడం వల్ల చాలా తేలికగా ప్రజలు తమ పనులు చేసుకోగలుగుతారు.

తెలంగాణ హరిత హారం : గ్రీన్ డ్రైవ్ సక్సెస్ స్టోరీ

ఈ పథకం అమలులో కేసీఆర్ ప్రభుత్వం ఘన విజయాన్ని సాధించిందని ఒప్పుకుని తీరాల్సిందే ఎవరైనా. నేషనల్ ఫారెస్ట్ పాలసీ ప్రకారం రాష్ట్రంలో 33% భూమిలో అడవులు ఉండి తీరాలి. తెలంగాణలో 24% భూమి అటవీ ప్రాంతంగా ఉంది. దీన్ని పెంచేందుకు 2014-15లో ఆగమేఘాలమీద ఈ కొత్త పథకాన్ని ప్రారంభించిందీ ప్రభుత్వం. 230 కోట్ల మొక్కల్ని నాటడం ద్వారా రాష్ట్రాన్ని హరిత హారంగా తీర్చిదిద్దాలన్న సత్సంకల్పానికి ప్రజల నుంచికూడా పెద్ద ఎత్తున మద్దతు లభించింది. అటవీ శాఖ, మిగిలిన ఇతర ప్రభుత్వ శాఖలు కలిసి 170 కోట్ల మొక్కల్ని నాటాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకంపై మొదటినుంచీ ప్రత్యేకమైన శ్రద్ధను కనబరచి తెలంగాణను హరిత తెలంగాణగా మలచేందుకు పూర్తి స్థాయి కృషి చేసిన తీరు బహుధా ప్రశంశనీయం. ఇప్పటివరకూ రూ.3000 కోట్లను ఈ పథకం కోసం ఖర్చు చేసి సత్ఫలితాలను సాధించిందీ ప్రభుత్వం. నాటిని మొక్కల్లో ఎన్ని బతికాయి, పథకం ఎంతగా సక్సెస్ అయ్యింది అన్నదానిపై ఎప్పటికప్పుడు విజిలెన్స్ విభాగం సర్వేచేసి సంతోషకరమైన స్థాయిలో పథకం విజయవంతమయ్యిందని నివేదిక ఇచ్చింది.

మొత్తం మీద టీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి మెల్లగా సాగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను చేసిన వాగ్ధానాలను నిలబెట్టుకునే దిశగా సాయశక్తులా కృషి చేస్తున్నారన్న నమ్మకం రాష్ట్ర ప్రజలకు గట్టిగానే ఉంది. దీనివల్ల భవిష్యత్తులో మెల్లగానైనా ప్రభుత్వ పథకాలన్నీ మంచి ఫలితాలను ఇస్తాయన్న ఆశాభావం ప్రజల్లో వ్యక్తమవుతోంది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.