ఫైన‌ల్ మ్యాచ్ ఆడ‌కుండా అశ్విన్‌ను కిడ్నాప్ చేశారు

By Newsmeter.Network  Published on  16 Feb 2020 5:52 AM GMT
ఫైన‌ల్ మ్యాచ్ ఆడ‌కుండా అశ్విన్‌ను కిడ్నాప్ చేశారు

టీమిండియాకు దొరికిన ఆణిముత్యాల‌లో ఆఫ్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఒక‌రు. ఒక‌ప్పుడు అన్ని ఫార్మాట్ల‌లో టీమిండియా రెగ్యుల‌ర్ ఆట‌గాడిగా ఉన్న‌.. ప్ర‌స్తుతం దాదాపు టెస్టుల‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. న్యూజిలాండ్‌తో ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడ‌నున్నాడు. ప్ర‌స్తుతం న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఈ ఆఫ్ స్పిన్న‌ర్.. ప్ర‌ముఖ క్రికెట్ వెబ్‌సైట్ ‘క్రిక్ బ‌జ్’ నిర్వ‌హిస్తున్న స్పైసీ పిచ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

త‌న జీవితంలో ఎదురైన ఓ చిన్న సంఘ‌ట‌న‌ను అభిమానుల‌తో పంచుకున్నాడు. త‌న‌ను ఓ ఫైన‌ల్ మ్యాచ్ ఆడ‌కుండా కిడ్నాప్ చేశార‌ని చెప్పుకొచ్చాడు. అశ్విన్ ఏం చెప్పాడంటే.. త‌నకు 14-15 ఏళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడు ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌న్నాడు. త‌న చిన్న‌ప్పుడు టెన్నిస్ బాల్ మ్యాచ్‌లు ఎక్కువ‌గా ఆడేవాడిన‌ని అయితే.. ఇంట్లో వాళ్లకి మాత్రం ఇష్టం ఉండేది కాద‌న్నాడు. అయితే ఓ రోజు త‌న ఇంటికి ఖ‌రీదైన బైకుల‌పై కొంద‌రు వ‌చ్చార‌ని అన్నారు. త‌న‌ను మ్యాచ్‌కు తీసుకెళ్లాన‌ని చెప్పి.. త‌న‌ను బైక్ పై ఎక్కించుకుని చెన్నైలోని ఓ టీస్టాల్ వ‌ద్ద‌కు తీసుకెళ్లార‌ని చెప్పాడు.

చాలా సేపు అక్క‌డ ఉన్నామ‌న్నాడు. త‌న‌కు మ్యాచ్ టైం అవుతుంద‌ని.. త్వ‌ర‌గా గ్రౌండ్‌కు తీసుకెళ్ల‌మ‌ని అడిగాన‌ని.. అయితే వారు చెప్పిన స‌మాధానం విని షాక్ అయిన‌ట్లు తెలిపాడు. తాము ఫైన‌ల్ మ్యాచ్ ఆడే ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు చెందిన వార‌మ‌ని, ఆ మ్యాచ్‌లో నేను ఆడ‌కుండా ఉండేందుకే.. కిడ్నాప్ చేసి అక్క‌డ‌కి తీసుకొచ్చిన‌ట్లు చెప్పార‌న్నారు. చివ‌రికి మ్యాచ్ ఆడ‌న‌ని ప్రామిస్ చేసిన త‌రువాత‌నే త‌న‌ను వ‌దిలిపెట్టార‌ని పేర్కొన్నాడు.

ఇప్పటి వరకు అశ్విన్‌ 70టెస్టులు, 111 వన్డేలు, 46టీ20ల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు.

Next Story