బ్యాంకాక్‌ నుంచి ఎలుకల స్మగ్లింగ్..!

By Newsmeter.Network  Published on  23 Dec 2019 2:50 AM GMT
బ్యాంకాక్‌ నుంచి ఎలుకల స్మగ్లింగ్..!

ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులకు ఎవరైనా బంగారంతో దొరుకుతారు లేకపోతే వజ్రాలతో దొరుకుతారు కానీ ఈ వ్యక్తి దేనితో దొరికాడా తెలుసా.. ఎలకలు, బల్లులు, ఉడతలతో. థాయిలాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ నుంచి చెన్నైకి అక్రమంగా తరలించిన అరుదైన వన్యప్రాణులను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వన్య ప్రాణుల అక్రమ రవాణా జరుగుతుందని విశ్వసనీయ సమాచారం అందడంతో చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎరైవల్‌ ఏరియాపై దృష్టి పెట్టారు. మహమ్మద్‌ మొహిదీన్‌ అనే వ్యక్తి అనుమానాస్పదంగా కదులుతుండటం, అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకపోవటం కస్టమ్స్‌ అధికారులు ఆయన లగేజీ బ్యాగులను తనిఖీ చేశారు. అతడి వద్ద గల స్ట్రోలర్‌ బ్యాగ్‌లోని ఎనిమిది ప్లాస్టిక్‌ కంటైనర్లలో చాక్లెట్లు, గిఫ్ట్‌ ఐటమ్స్‌ ల పేరుతో అరుదైన వన్య ప్రాణులు కనిపించాయి.

అయితే బ్యాంకాక్‌ విమానాశ్రయం బయట ఒక ఆగంతకుడు తనకు ఆ బ్యాగ్‌ అందజేశాడని, దానికోసం చెన్నై విమానాశ్రయం బయట ఒక వ్యక్తి వేచి ఉంటాడని కస్టమ్స్‌ అధికారుల విచారణలో మొహిదీన్‌ చెప్పాడు. దీంతో అతడ్ని విమానాశ్రయం బయటకు తీసుకెళ్లి కొంత సేపు వేచి చూసినా ఫలితం లేకపోయింది. తర్వాత ఆ వన్యప్రాణులను గుర్తించేందుకు ‘వన్యప్రాణుల నేరాల నియంత్రణ సంస్థ’ అధికారులను పిలిపించారు. వీటిని ఉత్తర అమెరికా అడవుల్లో తిరిగే జీవిత కాలం పాటుగా నీరు అవసరం లేని 12 కంగారు ఎలుకలు, మూడు ప్రైరీ డాగ్స్ అంటే కుక్కలు అనుకునేరు అవి ఒక ప్రత్యేకమైన ఉడుతలు, ఒక ఎర్రని ఉడుత, ఐదు నీలి ఇగువానా బల్లులుగా గుర్తించారు.

చెన్నై సమీపంలోని అరింగర్‌ అన్నా జంతు ప్రదర్శనశాలకు చెందిన పశు వైద్యులు ఆ వన్య ప్రాణులను పరీక్షించి, ఆరోగ్యంగానే ఉన్నాయన్నారు. 1962 కస్టమ్స్‌ చట్టం, విదేశీ వాణిజ్య అభివృద్ధి, నియంత్రణ చట్టం ప్రకారం ఆ వన్యప్రాణులను స్వాధీనం చేసుకున్న అధికారులు తదుపరి విచారణ నిమిత్తం మొహిదీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనుమతి పత్రాలు లేని ఈ జంతువులను తిరిగి బ్యాంకాక్ పంపుతున్నట్టు గా తెలిపారు.

Next Story