రాశి ఫలాలు:  17-5-2020 ఆదివారం నుండి తే 23-5-2020 శనివారం వరకు.

By సుభాష్  Published on  25 May 2020 12:40 PM GMT
రాశి ఫలాలు:  17-5-2020 ఆదివారం నుండి తే 23-5-2020 శనివారం వరకు.

మేషరాశి :- ఈరాశి వారికి ఈ వారంలో శుభ పరంపర ఎక్కువగా ఉంది. శ్రమను మించిన ఫలితాన్ని కూడా పొందుతారు. స్వంత ఆలోచనతో ముందుకెళ్లినట్లు ఐతే ఆర్థికంగానే కాదు సామాజికంగా కూడా చాలా మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజకీయపరంగా మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయి. ఎంత చేసినా తోటివారు మిమ్మల్ని తృణీకార భావంతో చూసే అవకాశం ఉంది. ఏపని చేపట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. మీ వెనుకనే ఇంటనే శత్రువులు సిద్ధంగా ఉన్నారు. మీకు ఆందోళన ఎక్కువగా ఉంటుంది. అనారోగ్యం కలతలు కనిపిస్తుంది. రవి బుధ శుక్రుల కలయిక మీకు అంత లాభాన్ని చేకూర్చడం లేదు. అదొక్కటే ఇబ్బంది భవిష్యత్తులో కూడా మంచి ఫలితాలు రూపుదిద్దుకుంటాయి.అశ్విని నక్షత్ర జాతకులకు నైధన తారైంది ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నవి. భరణీ నక్షత్ర జాతకులకు సాధన తారైంది పనులన్ని కూడా చక్కబడతాయి. కృత్తికా ఒకటో పాదంవారికి ప్రత్యక్ తారైంది కాబట్టి ఫలితాలు ఒక మాదిరిగా ఉంటాయి.

పరిహారం :- సూర్యనమస్కారాలు చేయండి. గోధుమపిండి అప్పాలు గానీ అట్టు గాని సూర్యునికి నివేదన చేయండి. ఆదిత్య హృదయం పఠనం మేలు చేకూరుస్తుంది.

వృషభరాశి :- ఈ రాశి వారికి చక్కని సౌఖ్యము గృహ సంపత్తి సంతోషం ఈవారంలో దక్కనున్నాయి. వీరు వారంలో అకారణ కలహాన్ని తెచ్చుకుంటారు. శరీరారోగ్యం కూడా చూసుకోవడం చాలా అవసరం అనిపిస్తుంది. ఏదైనా ఒక విలువైన వస్తువును పోగొట్టుకునే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి. ఇతరుల కోసం మీరు చిక్కులు కొని తెచ్చుకుంటారు అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఆనందము కుటుంబం కోసం విపరీతమైన ఖర్చులు చేసే అవకాశం ఉంది. అయితే గ్రహస్థితి రవి బుధులు శుక్రుడు ఒకే రాశిలో ఉండడం స్థానచలనం ఇంకో దగ్గరికి వెళ్లడం ఇవి సంప్రాప్తం కానున్నాయి. దూర ప్రయాణ అవకాశం కూడా కనిపిస్తోంది ఉద్యోగరీత్యా లేదా వ్యాపార రీత్యా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు వారికి ప్రత్యక్ తారైంది ఫలితాలు వ్యతిరిక్తంగా ఉన్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు సంపత్ తారైంది కాబట్టి బావుంది. మృగశిర ఒకటి రెండు పాదాలు వారికి విపత్తారైంది ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం :- కాలసర్ప దోషం వర్తిస్తుంది కాబట్టి ముఖ్యంగా రాహు కేతు జపము, శుక్రునకు జపం చేయించండి. శుక్రవారం నియమాన్ని పాటించడం అమ్మవారి పూజ ధ్యానం మంచిది.

మిధున రాశి :ఈ రాశివారికి ఈవారం చాలా కఠినమైన పరీక్షా సమయంగా చెప్పవచ్చు. మానసికంగా శారీరికంగా మీరు దృఢత్వాన్ని సంపాదించుకోవాలి. ధైర్యాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. వీరికి సమాజం వ్యతిరిక్తంగా పనిచేస్తుంది. విపరీత మైన ధనవ్యయము. ఎంత ఉత్సాహం ఉంటుందో అంతకి మించి నటువంటి నిరాశ నిస్పృహలకు లాగే టటువంటి వాళ్లు వీళ్లకు ఎదురౌతారు. అనారోగ్యంతో జీవితం చరమాంకంలో ఉన్నామా అన్నంత బాధ పడిపోతారు. నిరాశ నిస్పృహ వీరికి కి తగిలిన దెబ్బలను బట్టి ఈ రకమైనటువంటి ఆలోచన కలుగుతుంది. అయితే ఇవన్నీ తాత్కాలికం అని గ్రహిస్తే ముందుకు వెళ్ళగలరు. ప్రతి పనిలోని మీకు ఈవారం ఎవరో ఒకరు ఏదో ఒకటి ప్రతిఘటిస్తూనే ఉంటారు. మృగశిర మూడు నాలుగు పాదాలు వారికి ప్రత్యక్ తారైంది ప్రతికూలతల ఎక్కువగా ఉన్నాయి. ఆర్ద్ర వారికి సంపత్ తారైంది చాలా అనుకూలత ఉన్నాయి. పునర్వసు ఒకట్రెండు మూడు పాదాలు వారికి జన్మ తార ఆరోగ్య విషయంలో దృష్టి పెట్టుకోండి.

పరిహారం: శని ప్రభావం తగ్గడం కోసం శనివారం నియమాన్ని పాటించడం నల్ల వస్త్రము నువ్వులు దానం చేయడం నూనె దీపం వెలిగించడం మంచి ఫలితాన్ని ఇస్తాయి.

కర్కాటక రాశి: :- ఈ రాశివారికి శుభ ఫలితాలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఆనందము ధనలాభం కుటుంబ సౌఖ్యము ఎక్కువగా మిమ్మలను ఆదరించే వారు చాలా ఎక్కువగా ఉన్నారు. కానీ మీరనుకున్న పనులు మాత్రం వాయిదా పడి మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. ఇంత ప్రయత్నము ఎందుకు వ్యర్థమయిందనే బాధ మిమ్మల్ని వెంటాడుతుంది. వ్యవహార జ్ఞానము తగ్గిందా ఏం చేయాలని ఇటువంటి ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. భవిష్యత్ ప్రణాళికలు మీకు లభిస్తాయి. కాబట్టి వీరు మరికొంత ఉత్సాహంగా ధైర్యంగా పనిచేసి ముందుకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. అనారోగ్య విషయంలో కించిత్తు శస్త్ర చికిత్స అవకాశం కూడా కనిపిస్తుంది. జాగ్రత్త. ఎంత ఆనందం పొందుతారో ఓ ప్రక్క మిమ్మల్ని అంత భయమూ వెన్నాడుతూనే ఉంటుంది. పునర్వసు నాలుగో పాదం వారికి జన్మతార ఆరోగ్యం జాగ్రత్త వహించండి. పుష్యమి పరమ మిత్ర తారైంది చాల బావుంది. ఆశ్రేష వారికి మిత్ర తారైంది పరిచయాలు మంచి మార్గంలోకి తీసుకుని వెడతాయి మంచి భవిష్యత్ ప్రణాళికలు ఏర్పడతాయి.

పరిహారం :- దక్షిణామూర్తి స్తోత్రం చదవండి మంచి ఫలితాలు లభిస్తాయి. శనివారం నియమాలను పాటించండి శనిస్తోత్రం చదువుకోండి మంచి ఫలితాలు.

సింహరాశి :- ఈ వారికి విశేష ధన లాభాలు కనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా కార్యం కంటే ముందుగా ఫలితం అంది పోతూ ఉంటుంది. అధికారుల రాజకీయాల ఒత్తిడి మీకు ఉన్నా విజయం మీదే. ఉద్యోగస్తులైనట్లయితే ఇంకా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నానావిధ ఆలోచనలతో మీరు చేస్తారు. సంతోషాన్ని దాని తాలుకా ఫలితాన్ని ధన రూపంలో పొందడం వల్ల చాలా బావుంటుంది. అయితే ఎంత సంపాదిస్తారు అంతకంత ఖర్చు తప్పదు. ఒక విషయంలో మీరు కార్య వైఫల్యాన్ని ఎదుర్కొంటారు అది మెల్లిగా దాటగలిగితే మీకు చాలా సుఖంగా మారిపోతుంది. మీకు ఈ వారంలో శుభఫలితాలు ఎక్కువగా ఉన్నాయి గనుక మీరు ఊహించిన దానికంటే పనులన్నీ సత్వరంగా నెరవేరుతాయి. మఖ నక్షత్ర జాతకులకు నైధన తార అయింది పూర్తి వ్యతిరేక ఫలితాలు మీరు పొందగలుగుతున్నారు. పుబ్బ నక్షత్ర జాతకులకు సాధన తారైంది చాలా చక్కగా పనులన్నీ నెరవేరతాయి. ఉత్తర ఒకటో పాదం వారికి ప్రత్యక్ తారైంది కాబట్టి ఫలితాలు వ్యతిరిక్తంగా ఉన్నాయి జాగ్రత్త వహించండి.

పరిహారం :- యోగ సాధన మార్గాల్లో సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయం పట్టిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి .

కన్యా రాశి :- ఈ రాశి వారికి ధనలాభం సంపదలాభం అన్ని వీరికి ఈ వారంలో బాగా కలిసొస్తున్నాయి. ఇటువంటి సమయంలో మీరు తలుచుకున్న కార్యక్రమాల్లో కొద్దిపాటి చొరవ చూపిస్తే పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. సంతానానికి మాత్రం అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త వహించండి. అలాగే దూకుడుగా ముందుకు వెళ్లినట్లయితే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. ఒత్తిడి మీకు ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారికి వారాంతంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ద్రవ్య నష్టం కూడా వుంది. పెద్దల దగ్గర బంధువర్గం దగ్గర జాగ్రత్తగా ప్రవర్తించండి. ఉద్యోగస్థులకు ఇబ్బందులు తప్పవు. ఎంత చేసినా మీ కష్టాన్ని గుర్తించేటువంటి వాళ్ళు ఉండరు. మందత్వం మీలో కొద్దిగా ఉంటుంది. దీన్ని తొలగించే ప్రయత్నం చేయండి. ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు వారికి ప్రత్యక్తారైంది ఫలితాలు వ్యతిరిక్తంగా ఉన్నాయి. హస్త వారికి క్షేమతార అయింది కాబట్టి శుభ పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. చిత్త ఒకట్రెండు పాదాలు వారికి విపత్తు తార అయింది వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి.

పరిహారం :- చంద్రునికి బియ్యం పాలు వెండి చేయండి లేదా తెల్లటి పువ్వులతో ఆంజనేయస్వామిని పూజించండి విశేష ఫలితాలు పొందగలుగుతారు.

తులా రాశి :- ఈరాశి వారికి కొద్దిపాటి శుభ సూచనలు ఉన్నాయి. స్థల విస్తరణ గృహ భూ సంబంధమైనటువంటి కార్యక్రమాలేవి చేసినా ప్రయోజనాలు కలుగుతాయి. కొద్దిపాటి ప్రయత్నంతో రావాల్సిన పాత బాకీ వసూలు చేసుకోవచ్చు. కడుపునొప్పికి ఎక్కువగా అవకాశం ఉంది ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడుతుంది. అలాగే అష్టమ మందున్న రవిబుధ శుక్ర గ్రహస్థితులు మీకు ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం చాలా అవసరం. పాత బాకీలు వసూలు కావాలంటే గురువారం నాడు మీ ప్రయత్నము చేయండి . ప్రయోజనం చేకూరుతుంది.కించిత్ ద్రవ్య నష్టం ఉన్నా అది మంచి పనికి వినియోగించ బడుతుంది. ఇబ్బందులేమీ ఉండవు. శత్రువులు ఎల్లప్పుడు మీపై నిఘా ఉంచుతూనే ఉంటారు. అది మీకు ఇబ్బంది కలగకుండా నిజాయితీగా మీరు ముందు కెళితే మీ పనులు చక్కపెట్టుకోవచ్చు. చిత్త మూడు నాలుగు పాదాల వారికి విపత్తారైంది కాబట్టి ఫలితాలు వ్యతిరిక్తంగా ఉన్నాయి. స్వాతి వాళ్లకి సంపత్తారైంది ఫలితాలు పరిపూర్ణంగా పొందగలుగుతారు. విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వారికి జన్మ తారైంది కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.

పరిహారం :- శుక్రవారం నియమాన్ని పాటించడం రవికి జపం చేయించడం చాలా అవసరం సూర్యోదయం కల్లా లేచి సూర్య నమస్కారాలు చేయండి.

వృశ్చిక రాశి :- ఈరాశివారికి ఆలోచనలతో కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు. అయితే విశేష ధన లాభము వుంది. కనుక కొద్దిపాటి ప్రయత్నంతో మంచి వ్యాపార దక్షత ఉద్యోగంలో అభివృద్ధి నైపుణ్యత చూపించగలుగుతారు. వీరికి ఏదో ఒక విచారం వెన్నంటుతూనే ఉంటుంది. ఎందుకంటే శత్రుపీడ ఉంది. చంద్రుడు నాల్గో స్థానాల్లో వారాంతంలో ఇబ్బందులని కలిగిస్తాడు. అలాగే వక్రించిన గురుడు మీకు కొద్దిపాటి సహకారం ఇవ్వబోతున్నాడు. మీ యొక్క కుటుంబాల యొక్క ఆరోగ్యాలపై దృష్టి సారించండి. వయో వృద్ధులకు ఇబ్బందికర కాలం.మీ బాకీలు వసూలు కావు. భూ కోర్టు వ్యవహారాలు అంత వేగంగా చక్కబడవు. చక్కని సలహాదారులను ఎంచుకోవడంలో మీ నైపుణ్యం ఉపయోగపడుతుంది. మీ మాట తీరు వల్ల కొందరిని మీరు శత్రువులుగా తయారు చేసుకుంటారు తప్ప నిజమైన శత్రువులు కారు. వాహన ప్రయాణాదులు దూరప్రయాణాలు సేవలు చేస్తే మాత్రం వస్తువుల మీద మనుషుల మీద దృష్టి కేంద్రీకరించండి. విశాఖ నాలుగో పాదం వారికి జన్మ తారైంది ఆరోగ్యం సరి చూసుకోండి. అనూరాధ వారికి పరమమిత్రతార మధ్యమ ఫలితాలున్నాయి. జ్యేష్ట వారికి మిత్ర తారైంది శుభఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం :- ఆదివారం మంగళవారం నాడు ఆంజనేయస్వామి పూజ చేయండి. మంచి ఫలితాలు వస్తాయి.

ధనూరాశి :- ఈ రాశి వారికి అలంకార ప్రాప్తి ధనలాభం విశేషంగా ఉన్నాయి కాబట్టి వీరు ఈవారంలో ఏ పని తలపెట్టినా శుభప్రదంగా నెరవేరుతుంది. సమస్త సుఖాలు వీరికి అమర్చి పెట్టేట్టుగా సమకూరుతూ ఉంటాయి. శత్రువులు కూడా తాత్కాలికంగా వాళ్ళ భావాన్ని మార్పు చేసుకుంటారు. గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. తాము భోగాన్ని పొందడమే కాదు ఇతరులు కూడా భోగాలు పంచేటటువంటి దృక్పధంతో వీరు ముందుకు వెళ్తారు. అయితే ఒకట్రెండు దగ్గర్ల అపకీర్తిని పొందే అవకాశం కూడా ఉంది. ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్లినట్లయితే మీకు ఆ భయమేమీ ఉండదు. శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారుతారు. అనారోగ్యం మాత్రం ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి మూలా నక్షత్ర జాతకులకు నైధన తారైంది కాబట్టి సామాన్య ఫలితాలు ఉన్నాయి. పూర్వాషాడ నక్షత్ర జాతకులకు సాధన తారైంది కాబట్టి పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరి పోతాయి. ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి ప్రత్యక్తారైంది కాబట్టి వ్యతి రిక్త ఫలితాలు ఉన్నాయి.

పరిహారం :- ఈ రాశివారు గురు నికి జపం చేయిస్తే చాలా మంచిది. శెనగలు దానం చేయించినా నానబెట్టిన శెనగలు బెల్లం ఆవులకి తినిపించిన మంచి ఫలితాలుంటాయి.

మకరరాశి :- ఈ రాశివారికి అడకత్తెరలో పోకచెక్క లాంటి పరిస్థితి అడుగు తీసి అడుగు వేస్తే మహా భయం ధన లాభం లేదు సరికదా కార్యహాని అన్నీ ఒకదానికొకటి తోడై వీళ్లని మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బంది పెడతాయి. ఇది వీరు తట్టుకోలేక ఇతరుల్ని కూడా తమ మాటల చేతగాని చేతులలో గాని ఇబ్బందులు పెడతారు. ఏ పని పట్టుకున్న వాళ్లకి అది నెరవేరదు సరికదా సమూలంగా నాశనం ఐపోతూ ఉంటుంది. వీరికి గ్రహముల అనుకూలత లేని స్థితి. రెండు గ్రహములు తప్ప ఇంకేవి కూడా సరిగా ప్రయోజనాన్ని చేకూర్చడం లేదు.

వారం మధ్యలో చంద్రుడి ప్రభావం చేత కాస్త అందవలసినవి సమయానికి అంది బంధుమిత్రులు కనిపించి విపత్తు నుంచి బయటపడతారు. ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారికి ప్రత్యేక తయారైంది ఫలితాలు చాలా శూన్యంగా ఉన్నాయి శ్రవణ నక్షత్ర జాతకులకు క్షేమ తీరింది కాబట్టి మీకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ధనిష్ట ఒకటి రెండు పాదాల వారికి విపత్తార.పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి.

పరిహారం :- ఆంజనేయస్వామి పూజలు సుబ్రమణ్య పూజ ప్రతి రోజు ఏదో ఒక దైవ దర్శన చేయడమూ శివుడికి అభిషేకం చేయించటం వల్ల తొందరగా మీరు ప్రతి ఫలాన్ని పొందగలుగుతారు.

కుంభరాశి :- ఈరాశి వారికి ధనవ్యయం ఉన్నప్పటికీ ఆరోగ్యవంతులై శత్రుజయాన్ని కలిగి స్త్రీ సౌఖ్యంతో జీవనాన్ని ఆనందంగా సాగిస్తారు. చక్కని భోజన సౌకర్యాన్ని పొందగలుగుతారు. అగౌరవాన్ని తట్టుకునే శక్తి వచ్చేస్తుంది. ఉద్యోగ లేదా కుటుంబపరంగా దూర ప్రయాణం చేయవలసి స్తుంది అయినా వీరికి దానివల్ల లాభం జరుగుతుందేగాని నష్టం జరగదు. మీరు ఎక్కడున్నా మీకు సుఖసౌఖ్యాలు కోసం పాటుపడే మిత్రులు బంధువులు చాలామంది ఉన్నారు. వారు సకాలంలో మీకు సహకరించి మంచి స్థానాన్ని కల్పన చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాల్లో మాత్రం లాభం సమకూరేటటువంటి అవకాశము లేదు. ఉద్యోగాల్లో ఉన్నతి కూడా ఏమీ కన్పించట్లేదు. సామాన్యమైన టువంటి వారంగా మీకు ఈ వారం గడిచిపోతుంది . ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు వారికి విపత్తారైంది ప్రతికూల స్థితులు న్నాయి. శతభిష నక్షత్ర జాతకులకు సంపత్తార సుఖసౌఖ్యాలు భోగభాగ్యాలు పొందుతారు. పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు వారికి జన్మ తారైంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి.

పరిహారం :- శనికి విశేషించి అభిషేకాలు నువ్వులు నల్లని వస్త్రము దానం చేస్తూ నువ్వులనూనెతో దీపం వెలిగిస్తే మీకు చాలా శుభ ఫలితాలు కనిపిస్తాయి.

మీన రాశి :- ఈ రాశి వీరికి సంపద ధనలాభం కుటుంబ సౌఖ్యము కలిసొస్తున్నాయి. మంచి రోజులుగా చెల్లుబాటు అవుతాయి. ఒకింత శారీరక కష్టము కొంత ఆర్థిక నష్టమూ తప్పదు. శత్రువుల పీడ మిమ్మల్ని బాధిస్తూనే ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్లినా వాళ్లు మీకు వ్యతిరిక్తంగా మాట్లాడడము సాక్ష్యం చెప్పడం కపట నీతి ప్రయోగించడం జరుగుతుంది. మీ ఉన్నతికి ఎక్కడో దగ్గర ఎదురు తిరిగే వాళ్లు ఉంటూనే ఉంటారు. విశేష ధన లాభం మీరు వారం మధ్యలో పొందబోతున్నారు. ఆ సమయంలో కొంచెం జాగ్రత్త వహిస్తే ఎవరైతే శత్రువుగా ఉన్నారో వాళ్లు కూడా మిత్రులుగా మారి మీకు సహకరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీదే ఆలోచన మీదే ఆచరణ అయినట్లయితే మంచి స్థాయిని పొందగలుగుతారు. పూర్వాభాద్ర నాలుగో పాదం వారికి జన్మతారయింది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు పరమ మిత్ర తారైంది చాల బావుంది. రేవతి నక్షత్ర జాతకులకు మిత్ర తార కాబట్టి పనులన్నీ కూడా చక్కగా సజావుగా నెరవేరుతాయి

పరిహారం :- మానసికంగా మీరు ధైర్యాన్ని వహించడానికి చంద్రునికి తెలుపు వస్త్రము బియ్యము దానం చేయండి. గురు స్తోత్రం గనుక పఠిస్తే మీరు మంచి ఆత్మ స్థైర్యాన్ని మనోధైర్యాన్ని పొంది పరిష్కార మార్గాన్ని పొందగలుగుతారు.

Next Story