చచ్చిపోతా అన్న బాలుడిలో ధైర్యం నింపిన నెటిజన్లు

By సుభాష్  Published on  22 Feb 2020 4:54 AM GMT
చచ్చిపోతా అన్న బాలుడిలో ధైర్యం నింపిన నెటిజన్లు

అన్ని వేళ్ళు ఒకేలా ఉండవు.. అలాగే అందరూ మనుషులు కూడా ఒకలా ఉండరు. అది శారీరికంగా కావచ్చు, మానసికంగా కావచ్చ. శారీరిక వైకల్యం ఉండచ్చు. కానీ అటువంటి మనుషుల్ని అవమానించటం అంగవైకల్యం కంటే ఘోరంమైనది. తనకున్న వైకల్యం కంటే ఎదుటివారి అవమానాలకు, హేళన ను భరించలేక చచ్చిపోదామనుకున్నాడు తొమ్మిది సంవత్సరాల బాలుడు. దీంతో అమ్మా..నాకు బతకాలని లేదు..చచ్చిపోతాను..దయచేసి నేను చచ్చిపోవటానికి ఓ కత్తో..తాడో ఇవ్వు అని కన్నతల్లినే అడిగాడు. బిడ్డ మాటలు విన్న ఆ తల్లి తల్లడిల్లిపోయింది. తోటి విద్యార్థులు చేస్తున్న తప్పు వారికి మాత్రమే కాదు మొత్తం ప్రపంచానికి తెలియచేయాలనుకుంది. తద్వారా తల్లిదండ్రులలో మార్పు వచ్చేలా చేసే ప్రయత్నం చేసింది.

ఆస్ట్రేలియాలోని బ్రిస్‌బేస్‌కు చెందిన క్వాడెన్ కు 9 సంవత్సరాలు. క్వాడెన్ అచాడ్రోపాల్సియా అనే వ్యాధితో బాధపడుతున్నాడు. తన పరిస్థితికి బాధగానే ఉన్నా క్వాడెన్ చదువుకోవడానికి స్కూల్‌ వెళ్తున్నాడు. కానీ స్కూల్లో తోటి విద్యార్దులు క్వెడెన్ ను చూసి గేలి చేసేవారు. హేళనగా మాట్లాడేవారు. అయినా చదువుకోవాలనే పట్టుదలతో క్వాడెన్ వారి మాటలు పట్టించుకునేవాడు కాదు.

కానీ విద్యార్ధుల ఆగడాలు పెరిగాయి. దారుణంగా అవమానించారు. ఆ మాటలు భరించలేని క్వెడెన్ బుధవారం నాడు స్కూల్ నుంచి బయటకు ఏడుస్తూ వచ్చాడు. తన తల్లి కార్ ఎక్కగానే అమ్మా..నాకు బతకాలని లేదు అంటూ ఏడుపు మొదలుపెట్టాడు. నేనే చచ్చిపోతాను లేదా నన్నెవరన్నా చంపేయండి అంటూ కన్నీరు మున్నీరయ్యాడు. బిడ్డ పరిస్థితి అర్థం చేసుకున్న తల్లి ఎంతగానో ఓదార్చింది. చివరికి కొడుకు ఏడుస్తున్న దృశ్యాలను వీడియో తీసిన తల్లి యర్రాక.. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీడియో చూసి స్పందిస్తున్న నెటిజన్లు.. క్వాడెన్‌కు ధైర్యం చెబుతూ కామెంట్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన బాలుడి తల్లి, అవమానాల పాలు కావటం తన కుమారుడికి కొత్తేమీ కాదని, అవమానాలు తట్టుకోలేక మూడు సంవత్సరాల క్రితం కూడా ఆత్మహత్యకు యత్నించాడన్నారు. తోటి విద్యార్దులు చేసే అవమానాలను సీక్రెట్‌గా..స్కూల్‌ ప్రిన్సిపల్‌కు చెప్పి ఊరుకునే దాన్ని. కానీ, ఓ పసివాడు పడుతున్న బాధను అందరూ తెలుసుకోవాలని, తల్లిదండ్రులు, పిల్లలు జాగ్రత్తపడాలని వీడియోను పబ్లిక్‌ ముందు ఉంచానని తెలిపారు.

ఆ పసివాడు తాను బతకనంటూ ఏడుస్తున్న తీరు చూసి నెటిజన్లు చలించిపోయారు. ఫేస్ బుక్ లో ఒక్క రోజులోనే 70 లక్షల మంది ఆ వీడియోను చూశారు. లక్షన్నర మందికిపైగా షేర్ చేశారు. ఆ చిన్నారిని ఓదారుస్తూ.. ధైర్యంగా ఉండాలని చెబుతూ 89 వేల మంది కామెంట్లు చేశారు. ఆస్ట్రేలియా ఆల్ స్టార్స్ రగ్బీ టీమ్ ఆ చిన్నారికి బాధను చూసి కరిగిపోయింది. ఏడవకు.. మేమున్నామంటూ ధైర్యం చెప్పింది ఆ టీమ్. ‘నీకు అండగా ఉంటాం’ అని చెబుతూ వీడియో చేసి పంపారు. శనివారం జరిగే మ్యాచ్ లో తమ టీమ్ గ్రౌండ్ లో దిగేటప్పుడు ముందు నిలబడి లీడ్ చేయాలని ఆహ్వానించారు. మొత్తం మీద ఇప్పుడు క్వేడెల్ చాలా హుషారుగా ఉన్నాడు. ఎందుకంటే ఒక జీవితం కాలానికి సరిపడే ధైర్యం నింపారు నెటిజన్లు అతనిలో.

Quaden

Next Story