ఆ కయ్యంతో ఇబ్బందుల్లో మన బియ్యం..!

By Newsmeter.Network  Published on  13 Jan 2020 5:26 AM GMT
ఆ కయ్యంతో ఇబ్బందుల్లో మన బియ్యం..!

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నది పాత సామెత. కొత్త సామెత ఏమిటంటే ఇరాన్ యుద్ధం ఇండియా చావుకొచ్చింది. ఎందుకంటే ఇరాన్ లో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. అమెరికా, ఇరాన్ లు అమ్ములపొదులు సిద్ధం చేసుకున్నాయి. అస్త్రాలు సంధించుకున్నాయి. మిసైళ్ల వర్షం కురుస్తోంది. ఇప్పుడు గల్ఫ్ ప్రాంతం లో రణ గర్జనలు వినిపిస్తున్నాయి.

కానీ ఇరాన్ లో సంభవిస్తున్న పరిణామాలు మన దేశంలో బాస్మతీ బియ్యాన్ని పండించే రైతులకు మాత్రం ప్రాణసంకటంగా మారింది. సువాసనలు గుబాళించే ఈ బాస్మతీలేకపోతే బిర్యానీకి రుచి లేదు. పులావ్ కు పచి లేదు. ఇరాన్ ప్రజలకు పులావ్ తినాలంటే చాలు భారత్ లోని పంజాబులో పండే బాస్మతి గుర్తుకొస్తుంది. వాళ్ల రైస్ కుక్కరూ, మన బాస్మతీ బియ్యం కలిస్తేనే బిర్యానీ ప్లేట్లో వడ్డించడం సాధ్యమౌతుంది. ఇప్పుడు యుద్ధం పుణ్యమా అని బాస్మతీ దిగుమతులను ఇరాన్ తగ్గించేసింది. ఏటా రూ. 12000 కోట్ల విలువైన 14 మిలియన్ టన్నుల బాస్మతీ బియ్యాన్ని ఇరాన్ దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు యుద్ధ వాతావరణం కారణంగా దిగుమతులు సగానికి తగ్గిపోయాయి.

మామూలుగా మన పంజాబీ బాస్మతికి ప్రపంచమంతా భలే గిరాకీ ఉంది. మన దేశం దాదాపు 40 లక్షల టన్నుల బాస్మతీని దాదాపు వంద దేశాలకు ఎగుమతి చేస్తుంది. దీని వల్ల మనకు రూ 36000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభిస్తుంది. ఇందులో దాదాపు 30 శాతం ఎగుమతులు ఇరాన్ కే జరుగుతాయి. ఇప్పుడు మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు మన బాస్మతీలో రసాయనిక ఎరువులు, క్రిమి సంహారకాల అవశేషాలు ఉన్నాయని ఆరోపిస్తూ యూరోపియన్ యూనియన్ కొనుగోలును దాదాపుగా ఆపివేసింది. దీంతో మన బాస్మతీ బియ్యం రైతులు గడ్డు కాలంలో ఉన్నారు.

ఎంకి ఏడుపు సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో మరి?

Next Story