చిందు.. మనోవ్యాధికి మంచి మందు

By సుభాష్  Published on  17 Feb 2020 9:30 AM GMT
చిందు.. మనోవ్యాధికి మంచి మందు

మనసు బాగోలేదా? మానసికంగా కుంగిపోతున్నారా? పారనొయియా, ష్కిజోఫ్రీనియా, సైకోసిస్, డిప్రెషన్ .. వంటి మానసిక రుగ్మతలు మిమ్మల్ని దెబ్బతీస్తున్నాయా? వీటన్నిటికీ సులువైన ఒక మందు ఉంది. ఆ మందు వాడితే ఈ మానసికంగా కుంగదీసే వ్యాధులన్నీ మటుమాయమైపోతాయి. ఆ మందు మీ దగ్గరే ఉంది. వేసుకుంటే చాలు.. అంతా బాగైపోతుంది.

ఇంతకీ ఆ మందు ఏమిటి అనుకుంటున్నారా? ఆ మందు పేరు డాన్స్.. అవునండీ.. డాన్స్.. అంటే నృత్యం. నృత్యం చేస్తే మానసికంగా ఉల్లాసం కలుగుతుంది. ఉత్సాహం పెరుగుతుంది. మానసిక వ్యాధులు మాయమైపోతాయి. దీన్నే మానసిక వైద్యులు డాన్స్ మూవ్ మెంట్ థెరపీ లేదా డీ ఎం టీ అంటారు. డాన్స్ ద్వారా మానసిక వ్యాధులను తగ్గించడం ఇప్పుడు రోజురోజుకీ పాపులర్ అవుతోంది.

పలు పరిశోధనలలో డాన్స్ మానసిక ఒత్తిడిని దూరం చేస్తుందని తేలింది. ముఖ్యంగా డిప్రెషన్ తో బాధపడేవారు డాన్స్ చేస్త మానసికంగా ప్రశాంతి కలుగుతుంది. వారు తమ బాధలను మరిచిపోతారు. ఉల్లాసంగా ఉంటారు. ఒత్తిడులను మరిచిపోతారు. ఉత్సాహంగా ఉంటారు. అందుకే ఢిల్లీ, ముంబాయి వంటి మహానగరాల్లో వ్యాయామంతో పాటు నాట్యాన్ని జోడిస్తున్నారు. జిమ్ లలో సమగ్ర ఆరోగ్య అవగాహనా కార్యక్రమంలో భాగంగా డాన్స్ చేయిస్తున్నారు. ఏరోబిక్స్ వంటివి నాట్యాన్ని, వ్యాయామాన్ని మేళవించిన వ్యాయామ ప్రక్రియలే.

డీఎంటీని అమెరికన్ డాన్స్ తెరపీ అసోసియేషన్ ఒక సైకో తెరపీ ప్రక్రియగా గుర్తించింది. అయిదు రకాల డాన్స్ స్టెప్ లను ఈ చికిత్సలో ఉపయోగిస్తారు. చాలా సంస్థల యాజమాన్యాలు తమ ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడిని, కోపం, విసుగులను తొలగించేందుకు ఈ డాన్స్ థెరపీని ఉపయోగిస్తున్నారు. జైళ్లలో, స్కూళ్లలో కూడా దీనిని విజయవంతంగా ప్రయోగిస్తున్నారు. జీవన శైలిలో వస్తున్న వేగవంతమైన మార్పులు, పోటీ, టార్గెట్ల వెనుక పరుగుల వల్ల ఆరోగ్యాలు త్వరగా దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి బాగా పెరుగుతోంది. వీటన్నిటికీ పరిష్కారంగా డాన్స్ తెరపీ ముందుకొస్తోంది.

అయితే ఈ డాన్స్ తెరపీ వందల మందికి ఒకే సారి చేయడం కన్నా పది నుంచి పదిహేను మందిని ఒక గ్రూప్ గా చేసి వారికి తెరపీ ఇవ్వడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది. అందుకే ఈ శిక్షణను చిన్న చిన్న గ్రూపులకే ఇవ్వడం జరగుతుంది. మన పూర్వీకులు కూడా ఈ కారణంతోనే బహుశ కోలాటం, భజన, చిందు భాగవతం వంటివి ప్రవేశపెట్టారేమో? వాటిని నిత్య జీవితంలో భాగం చేశారేమో? ఇంకెందుకు ఆలస్యం.. హాయిగా చిందేయండి. దరువుకు అనుగుణంగా నాట్యం చేయండి. మానసిక ఆరోగ్యాన్ని పొందండి.

Next Story