ప్రొఫెసర్ కాసింపై కౌంటర్ కాపీలో సంచలన నిజాలు

By రాణి  Published on  31 Jan 2020 10:01 AM GMT
ప్రొఫెసర్ కాసింపై కౌంటర్ కాపీలో సంచలన నిజాలు

ముఖ్యాంశాలు

  • కౌంటర్ పై హైకోర్టులో ముగిసిన వాదనలు
  • ప్రొఫెసర్ ముసుగులో విద్యార్థులను ప్రభావితం చేస్తున్న కాసిం
  • మావోయిజాన్ని వ్యాప్తి చేసేందుకే ప్రొఫెసర్ అవతారం

నాలుగు రోజుల క్రితం ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ కాశీం అరెస్ట్ పై గజ్వేల్ పోలీసులు హై కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ప్రొఫెసర్ కాశిం ను పోలీసులు జనవరి 18న అరెస్ట్ చేశారు. ఈ కౌంటర్ పై శుక్రవారం హై కోర్టులో వాదనలు జరిగాయి. పోలీసులు ప్రొఫెసర్ కాశీం పై దాఖలు చేసిన కౌంటర్ లో సంచలన విషయాలున్నాయి.

ప్రొఫెసర్ కాసిం తో పాటు మావోయిస్టు భావజాలం ఉన్న వారు ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర పన్నుతున్నారని పోలీసులు కౌంటర్ లో పేర్కొన్నారు. అలాగే..అండర్ గ్రౌండ్ మావోయిస్టు లీడర్లతో ప్రొఫెసర్ ఖాసీం లాంటి ఓవర్ గ్రౌండ్ లీడర్లు నిరంతరం సంభాషణలు చేస్తుంటారన, ఇప్పటి వరకూ మావోయిస్టులు 12 వేలకు పైగా నేరాలకు పాల్పడినట్లు పోలీసులు కౌంటర్ లో తెలిపారు.

అంతేకాకుండా రెండువేలకు పైగా అమాయకుల ప్రాణాలను ఇన్ఫాన్మర్ల పేరుతో బలి తీసుకున్నారని, 370 మంది ప్రజా ప్రతినిధులను హత్య చేయడమే కాక 404 పోలీస్ సిబ్బందిని కూడా హతమార్చారని పోలీసులు పేర్కొన్నారు. ఇంత క్రూరమైన విప్లవ స్వభావమున్న మావో జాలాన్ని విద్యార్థులకు ఎక్కించేందుకు కాసిం ప్రొఫెసర్ ముసుగు ధరించారని పోలీసులు తెలిపారు. ఉస్మానియాలో ఎంతో మంది ప్రొఫెసర్లున్నా..వారెవ్వరినీ అరెస్ట్ చేయకుండా కాసింను మాత్రమే అరెస్ట్ చేశామంటే ఆయన ఎంత కుట్రపూరితమైన స్వభావాన్ని కలిగి ఉన్నారో అర్థం చేసుకోవచ్చని పోలీసులు కోర్టుకు తెలిపారు.

మావోయిస్టులతో సంబంధాలున్న నేపథ్యంలో జనవరి 18వ తేదీన అతడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. 2016లో ములుగు పీఎస్ లో నమోదైన కేసులో కాసిం ఏ2 నిందితుడిగా ఉన్నప్పటికీ..ఆయనను నిందితుడిగా నిరూపించేందుకు కావాల్సిన సాక్ష్యాధారాలను సేకరించేందుకు చాలా సమయం పట్టిందని కోర్టుకు తెలిపారు. ప్రొఫెసర్ కాసిం దంపతులు నడిపిస్తున్న "నడుస్తున్న తెలంగాణ" సంచిక కు మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడైన చంద్రన్న నిధులు సమకూర్చుతున్నాడని, కాసిమ్ ఇంట్లో సోదాల సమయంలో అనేక వస్తువులు స్వాధీనం చేసుకున్నామన్నారు.

ఇప్పుడు మావోయిస్టులు కూడా టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటున్నారని పోలీసులు వెల్లడించారు. వారి సంభాషణలను ఎవరూ డీ కోడ్ చేయకుండా..ఒక ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి మాట్లాడుకుంటున్నారని తెలిపారు. కాశిం ఇంట్లో లభించిన హార్డ్ డిస్క్ లు, పెన్ డ్రైవ్ లు, డీసీలను ఎఫ్ఎస్ఎల్ కి పంపామని తెలిపారు. కాని వాటిలో పూర్తిలో ఎన్ స్ర్కిప్ట్ డేటా ఉండటంతో డేటాను రీ ట్రై చేయడం వీలుకాలేదన్నారు. ప్రొఫెసర్ కాసింకు విద్యార్థి దశలోనే, మావోయిస్టు టాప్ లీడర్ మల్లా రాజిరెడ్డి తో సంబంధాలు ఉన్నాయని, అందుకే రాజిరెడ్డి కుమార్తె అయిన స్నేహలతను కాసిం వివాహమాడినట్లు పోలీసులు వెల్లడించారు.

ఖాసింపై ఎన్ని కేసులున్నాయి : హైకోర్టు ప్రశ్న

ప్రొఫెసర్ కాసింపై ఎన్ని కేసులున్నాయో తెలపాలని హై కోర్టు పోలీసులను ప్రశ్నించగా..కాసింపై మొత్తం నాలుగు కేసులున్నట్లు వెల్లడించారు. ములుగు, లక్ష్మిదేవిపల్లి, ఖానాపూర్, ఎల్బీనగర్ పీఎస్ లలో కాసిం పై కేసులు నమోదై ఉన్నాయన్నారు. మావోయిస్టులతో మాట్లాడే సమయంలో మాత్రం కాసిం...తన పేరు కార్తీక్ గా చెప్తాడన్నారు. అలాగే ఛత్తీస్ గఢ్ లో నిర్వహించే మావోల సమావేశానికి కాసిం హాజరయ్యేవాడని ఆరోపించారు. మావోయిస్టు భావజాలాన్ని రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తి చేసేందుకు కొన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ను ఏర్పాటు చేసి వాటన్నిటికీ సమన్వయకర్తగా కాసిం పని చేస్తున్నాడని పోలీసులు కోర్టుకు విన్నవించారు.

అంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న వారి గొంతు సైలెంట్ గా నొక్కేస్తున్నారా అని హై కోర్టు అడుగగా...సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారి పై అన్ని సాక్షాధారాలు సేకరించాకే అరెస్టు చేస్తున్నామని పోలీసులు సమాధానమిచ్చారు. మావోయిస్టుల ఏరివేత లో తెలంగాణ పోలీసులు అవలంబిస్తున్న తీరు ను కేంద్ర ప్రభుత్వం సైతం అభినందించిందని తెలిపారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు. మంచి భవిష్యత్ ఉన్న విద్యార్థులు మావోయిస్టు వైపు అడుగులు వేస్తే సమాజానికి మంచిది కాదన్నారు. ఇలా హై కోర్టులో వాదోపవాదాలు ముగిశాక ప్రొఫెసర్ కాసిం పై దాఖలైన హెబియస్ కార్పస్ ను డిస్మిస్ చేయాల్సిందిగా పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Next Story