సుజయ్ – సుశీల్ దర్శకత్వంలో సాయి రోనాక్ – ప్రీతీ ఆష్రాని జంటగా వచ్చిన చిత్రం ‘ప్రెజర్ కుక్కర్’. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :
నారాయణ (సీవీఎల్‌ నరసింహారావు) తన బంధువులు అందరూ అమెరికాలో బాగా స్థిరపడటంతో.. అమెరికా మీద ప్రేమను బాగా పెంచేసుకుంటాడు. దాంతో తన కొడుకు కిశోర్‌ (సాయి రోనక్‌)ను కూడా అమెరికాను పంపించాలని చాల బలంగా కోరుకుంటాడు. కానీ కిశోర్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా అతనికి అమెరికా వీసా మాత్రం దొరకదు. ఈ క్రమంలో వీసా ప్రయత్నాల్లో భాగంగా కిశోర్ హైదరాబాద్‌ లో ఉంటున్న తన ఫ్రెండ్స్ దగ్గరకు వస్తాడు. ఈ క్రమంలోనే అతనికి అనిత (ప్రీతి అస్రాని)తో పరిచయం…ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఈ మధ్యలో కిశోర్ అనుకోని ఆపదలో చిక్కుకుంటాడు. దాని నుండి బయటపడే క్రమంలో గర్భిణీ స్త్రీలకు ఉపయోగపడే పరికరం కనిపెడతాడు. దాంతో అతని లైఫ్ మారుతుంది. వీసా వస్తోంది. మరి కిశోర్‌ తన తండ్రి కోరిక మేరకు అమెరికా వెళ్లాడా? లేదా ? అలాగే కిశోర్‌- అనితల లవ్ స్టొరీ ఎలా సాగింది ? చివరికీ కిశోర్ అమెరికాకి ఎందుకు పోడు ? అతని ఆలోచనా విధానాన్ని ఆనంద్ రావు (తనికెళ్ల భరణి) ఎలా మార్చాడు ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

నటీనటులు :

ఈ సినిమాలో హీరో, హీరోయిన్‌ లుగా నటించిన సాయిరోనక్‌, ప్రీతి అస్రానీలు తమ నటనతో ఆకట్టుకున్నారు. సినిమా మొత్తం సాయి రోనాక్ చుట్టే తిరుగుతుండటంతో అతనికి నటనకు మంచి స్కోప్‌ దొరికింది. వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు హీరోయిన్ తో సాగే ట్రాక్ లో గాని, క్లైమాక్స్ సన్నివేశంలో గాని ఎంతో అనుభవం ఉన్న నటుడిలా చాలా బాగా నటించాడు.

అలాగే హీరోయిన్ ప్రీతి కూడా క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. ఎంతో అనుభవమున్న నటిగా ప్రీతి నటించింది. మెయిన్ గా లవ్ సీన్స్ లో అవలీలగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. అలాగే ఎమోషనల్ పాత్రలో నటించిన తనికెళ్ల భరణి అద్భుతంగా నటించారు. ఇక హీరో ఫ్రెండ్ గా నటించిన రాహుల్ రామకృష్ణ కూడా తన కామెడీ టైమింగ్ తో తానూ కనిపించిన సీన్స్ అన్నిట్లో చాలా బాగా అలరించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు.

దర్శకులు ‘ప్రెజర్ కుక్కర్’ కథను నడిపించిన తీరులో పెద్ద ప్రెజర్ ఉంది. కథలో ప్రేమ,స్నేహం, కుటుంబం, దేశభక్తి, కెరీర్ ఇలా చాలా విషయాలను చర్చించారు గాని, ఒక్క విషయాన్ని కూడా పూర్తి స్పష్టంగా చెప్పలేకపోయారు. సినిమా ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే అసలు కథ కేవలం ఒక పాయింటే అని అర్ధమైపోతుంది. తన కొడుకు అమెరికా వెళ్లాలని ఒక తండ్రి చాల బలంగా ఆరాట పడతాడు ఇదే మెయిన్ పాయింట్. అసలు తన కొడుకు అమెరికా ఎందుకు వెళ్లాలని ఆ తండ్రి అంత బలంగా కోరుకుంటుంన్నాడు ? సరే అమెరికాకి వెళ్ళడానికి హీరో పడిన కష్టాలు, ఎదుర్కొన్న అడ్డంకులు ఎంత ఇంట్రస్ట్ గా చూపించొచ్చు ? కానీ చాల పేలవమైన ప్లేతో సినిమాని లాగారు.

ఇక సెకండాఫ్‌ వచ్చే సరికి సినిమా ఏటో వెళ్లిపోతోంది అనే భావన కలుగుతుంది. సాగదీత సీన్లు, సెంటిమెంట్‌ సీన్లు అంతగా వర్కౌట్‌ కాలేదు. పైగా అనవసరమైన సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి. పైగా ఆ సీన్స్ అన్ని కూడా.. ఒకేలా సాగడం కూడా విసుగు తెప్పిస్తోంది. మొత్తంగా సినిమాలో మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నా.. ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. అలాగే సినిమాలో ఉన్న కంటెంట్ ను కూడా బాగా ఎలివేట్ చేయలేకపోయారు. దీనికితోడు హీరో చుట్టూ సాగే డ్రామా కూడా బలహీనమైన సంఘటనలకు లోబడి బలహీనంగా సాగడంతో.. సినిమాలో బలమైన సంఘర్షణ మిస్ అయింది. స్క్రిప్ట్ లో కాన్ ఫిల్ట్ పై బాగా శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.

ప్లస్ పాయింట్స్ :
స్టోరీ థీమ్,
కొన్ని కామెడీ ఎలిమెంట్స్
డైలాగ్స్

మైనస్ పాయింట్స్ :
కథా కథనాలు ఆసక్తి కరంగా సాగక పోవడం,
సినిమాలో సరైన ప్లో మిస్ అవ్వడం,
అలాగే, సినిమా స్లోగా సాగుతూ బోర్ కొట్టించడం,
అనవసరమైన కామెడీ అండ్ లవ్ సీన్స్.

చివరగా…
ఫన్నీ టైటిల్ తో పాటు మంచి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ ‘ప్రెజర్ కుక్కర్’లో ‘ప్రెజర్ ఎక్కువైపోయి కుకింగ్ తక్కువైపోయింది. సినిమా సరైన ప్లో లేకుండా స్లోగా సాగుతూ బోర్ కొడుతోంది. స్టోరీ ఐడియాకి తగ్గట్లు సరైన ట్రీట్మెంట్ ను లేకపోవడం, విషయం లేని సీన్స్ ఎక్కువవడం, పైగా ఉన్న కంటెంట్ ను కూడా సరిగ్గా ఎలివేట్ చెయ్యకపోవడం వంటి అంశాలు సినిమాకి కనెక్ట్ కాకుండా చేశాయి. ఓవరాల్ గా ఈ సినిమా ఎక్కువమంది ప్రేక్షకులకు నిరాశనే మిగులుస్తోంది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.