క్షణికావేశ నిర్ణయాలతో తలకిందులైన జీవితాలు

By రాణి  Published on  9 March 2020 6:24 AM GMT
క్షణికావేశ నిర్ణయాలతో తలకిందులైన జీవితాలు

క్షణికావేశ నిర్ణయాలతో ఇటు అమృత, అటు అమృత తల్లి గిరిజా జీవితాలు తలక్రిందులయ్యాయి. తిరునగరు మారుతీరావు జీవితం కిరోసిన్ వ్యాపారంతో మొదలై.. ఆ తర్వాత ఒక్కొక్క వ్యాపారం చేస్తూ..రూ.వందల‌ కోట్లు సంపాదించార‌ని టాక్‌. మారుతీరావు తండ్రి రేషన్ డీలర్ అవ్వడంతో..తండ్రి వద్దే కిరోసిన్ వ్యాపారంలో ప్రావీణ్యం పొందారు. ఆ తర్వాత పౌర సరఫరాల గుత్తేదారుగా పనిచేశారు. మద్య నిషేదం వచ్చిన సమయంలో నల్లబెల్లం వ్యాపారం చేసి, సిండికేట్ చేయించి ఎక్కువ ధరలకు విక్రయించి భారీగా నగదు కూడగట్టుకున్నారు. అలా వచ్చిన నగదుతో వడ్డీ వ్యాపారం, మీటర్, బారా కటింగ్ లతో కోట్లు గడించారు.

అదేవిధంగా మిర్యాలగూడకు చెందిన ఒక తహసీల్దార్ సహాయంతో రెవెన్యూ చట్టాల్లో ఉన్న లొసుగులపై పట్టు సాధించి..విలువైన ప్రభుత్వ భూములను కైవసం చేసుకున్నారు మారుతీరావు. స్వాతంత్ర్య సమరయోధుల పేరునున్న ప్రభుత్వ భూములను రాయించి, అవి వేరువారు కొనుగోలు చేసినట్లు రికార్డులను సృష్టించి..తిరిగి వాటిని మారుతీరావే కొనుగోలు చేసినట్లు భూములను తనపేరున రిజిస్ర్టేషన్ చేయించుకుని దక్కించుకున్నారన్న ఆరోపణలున్నాయి మారుతీరావుపై. అలాగే రెవెన్యూశాఖలో తనుకున్న అనుభవంతో వివాదాలున్న భూముల్లో తలదూర్చి మధ్యవర్తిత్వాలు చేసి.. సొమ్ము సంపాదించార‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. అలా సంపాదించిన సొమ్ముతోనే మారుతీరావు మిర్యాలగూడలో మూడు సినిమా థియేటర్లను కూడా కొనుగోలు చేశారని టాక్‌. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ రూ.100కోట్లకు పైగా ఉండొచ్చని సమాచారం. అయితే ఈ ఆస్తి వీలునామా మారుతీరావు ఎవరి పేరుమీద రాశాడన్న ప్రశ్నకు ఇంతవరకూ సరైన సమాధానం లేదు.

అమృత ప్రేమ, పెళ్లి

మిర్యాలగూడలోని ప్రైవేట్ పాఠశాలలో అమృత 9వ తరగతి చదివేటపుడు తన సీనియర్ అయిన పెరుమాళ్ల ప్రణయ్ ను ప్రేమించింది. ముత్తిరెడ్డికుంటలో నివాసం ఉంటున్న ఎల్ఐసీ ఉద్యోగి పెరుమాళ్ల బాలస్వామి, ప్రేమలత దంపతులకు పెద్ద కొడుకు ప్రణయ్. స్కూల్ డేస్ లోనే విషయం తెలుసుకున్న మారుతీరావు కుమార్తెను వేరే పాఠశాలలో చదివించారు. ఆ తర్వాత ఇంటికి దగ్గర్లో ఉన్న బాలికల కళాశాలలో మిగతా విద్యనభ్యసించింది అమృత.

Also Read : అమృతకు షాకిచ్చిన తల్లి, బాబాయ్‌

18 ఏళ్లు నిండటంతో 2018 జనవరి 30 వ తేదీన అమృత మిర్యాలగూడ రెడ్డికాలనీలోని తన నివాసం నుంచి ప్రణయ్ తో కలిసి హైదరాబాద్ వళ్లి అక్కడున్న ఆర్యసమాజ్ లో ప్రేమవివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో తమకు రక్షణ కల్పించాల్సిందిగా కోరారు. తర్వాత డీఎస్పీ కార్యాలయానికి వెళ్లగా..అక్కడ పోలీసులు ఇరు కుటుంబాల పెద్దలకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. భర్త తో కలిసి ముత్తిరెడ్డి కుంటలోని అత్తగారింటికి వెళ్లి కాపురం చేసిన కొద్ది నెలలకే గర్భం దాల్చింది. 2014 సెప్టెంబర్ 14వ తేదీన మిర్యాలగూడలోని జ్యోతి ఆస్పత్రికి చికిత్స నిమిత్తం అమృతను తీసుకువెళ్లిన ప్రణయ్ ను మారుతీరావు హత్యచేయించారు. సెప్టెంబర్ 19వ తేదీన పోలీసులు తిరునగరు మారుతీరావు (ఏ1), సుభాష్ శర్మ (ఏ2), అబ్దుల్ భారీ (ఏ3), అస్గర్ అలీ (ఏ4), అబ్దుల్ కరీం (ఏ5), తిరునగదు శ్రవణ్ కుమార్ (ఏ6), కారు డ్రైవర్ శివ (ఏ7), నిజాం (ఏ8) లను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. నిందితులపై సెక్షన్ 302,303,120,ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్య కేసులను నమోదు చేశారు.

అప్పటి నుంచి ఏడునెలలు వరంగల్ కేంద్ర కారాగారంలో రిమాండ్ లో ఉన్న మారుతీరావు, శ్రవణ్ కుమార్, అబ్దుల్ కరీంలు 2019 ఏప్రిల్ 29న షరతులతో కూడిన బెయిల్ పై విడుదలయ్యారు. తర్వాత కుమార్తె అమృత వద్దకు మాజీ కౌన్సిలర్ కందుల వెంకటేశ్వర్లు, రిటైర్డు తహసీల్దార్ భాస్కర్ రావులను రాయబారానికి పంపి.. కేసులో తమకు అనుకూలంగా వ్యవహరించాలని కోరారనే వార్త‌లు వ‌చ్చాయి. దీంతో అమృత మరోమారు ఫిర్యాదు చేయగా.. ఈ ముగ్గురిని 2019 నవంబర్ 30న అరెస్ట్ చేశారు.

గతనెల 29వ తేదీన మారుతీరావుకు చెందిన అద్దంకి-నార్కట్ పల్లి ప్రధాన రహదారి వెంబడి ఉన్న ఖాళీ షెడ్డులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించగా.. ఇప్పటి వరకూ ఆ మృతదేహానికి సంబంధించిన వివరాలేమీ తెలియలేదు. కాగా..ప్రణయ్ హత్యకేసు విచారణ ఈనెల 10వ తేదీన విచారణ జరగాల్సి ఉండగా.. మారుతీరావు శనివారం రాత్రి హైదరాబాద్ లోని ఆర్యవైశ్య భవనంలోని గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. మారుతీరావు మృతితో పోలీసులు మిర్యాలగూడలో బందోబస్త్ ఏర్పాటు చేశారు.

ఇలా అన్యకులస్తుడిని కూతురు పెళ్లాడిందన్న కోపంతో అల్లుడిని హత్య చేయించిన తిరునగరు మారుతీరావు.. మళ్లీ అదే కూతురు తిరిగి తనకు దగ్గరవ్వలేదని మనోవేదనకు గురై.. భార్యకు క్షమాపణలు చెప్తున్నట్లు ఉత్తరం రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.

Next Story
Share it