వివాహితులకు ఇకపై ప్రీస్ట్ హుడ్ నిరాకరణ?

By Newsmeter.Network  Published on  14 Jan 2020 12:44 PM GMT
వివాహితులకు ఇకపై ప్రీస్ట్ హుడ్ నిరాకరణ?

  • వివాహితులైన పురుషులకు ప్రీస్ట్ హుడ్ నిరాకరణ
  • పోప్ ఫ్రాన్సిస్ కు పోప్ బెనెడిక్ట్ XVI సూచనలు
  • పోప్ బెనెడిక్ట్ XVI సూచనలను గౌరవించిన పోప్ ఫ్రాన్సిస్
  • ప్రస్తుతానికి ఆ సూచనలను పక్కనపెట్టిన పోప్ ఫ్రాన్సిస్
  • అమెజానియా ప్రాంతంలో ప్రీస్ట్ ల కొరత
  • వాటిని అమలు చేయడంపై అశక్తతను వ్యక్తం చేసిన ఫ్రాన్సిస్
  • మతపరమైన విశ్వాసాలపైనే దృష్టి కేంద్రీకరించాలన్న బెనెడిక్ట్
  • వివాహితులైన పురుషులకు అది సాధ్యం కాకపోవచ్చని విమర్శ

వివాహితులైన పురుషులకు ప్రీస్ట్ హుడ్ ఇవ్వడం సరికాదని, వారికి ప్రీస్ట్ హుడ్ ని నిరాకరించాలని మాజీ పోప్ బెనెడిక్ట్ XVI తన వారసుడైన పోప్ ఫ్రాన్సిస్ కు బాహాటంగా సూచనలు చేయడం వాటికన్ వర్గాల్లో సంచలనాన్ని సృష్టించింది. 2013లో రిటైరైన ఈ మాజీ పోప్ వాటికన్ అత్యున్నత పదవికి అర్హతల గురించి, వివాహితులైన పురుషులకు క్యాథలిక్ ప్రీస్ట్ హుడ్ ఇవ్వడానికి ఉన్న అర్హత గురించి రాసిన పుస్తకంలోని కొన్ని అంశాలను ఫ్రాన్సిస్ లీ ఫిగారో ప్రచురించడంతో ఈ దుమారం రేగింది.

కానీ అమెజాన్ లోని మారుమూల ప్రాంతాల్లో ప్రీస్ట్ ల కొరత ఉన్నందువల్ల ప్రస్తుతం పోప్ ఫ్రాన్సిస్ కూడా పోప్ బెనెడిక్ట్ మాటలను పక్కనపెట్టి ప్రీస్ట్ హుడ్ ను ఇవ్వాల్సి వస్తోందని వాటికన్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి వివాహితులైన పురుషులు పూర్తిగా కుటుంబ వ్యవహారాలను చూసుకోవాల్సిన రావడం వల్ల మతపరమైన విశ్వాసాలు, కట్టుబాట్లు, నియమాలు, నిబంధనలను ప్రచారం చేయడంపై అంతగా శ్రద్ధ వహించలేరన్న అభిప్రాయాన్ని పోప్ బెనెడిక్ట్ వ్యక్తం చేశారు.

తప్పు మార్గాల్లో నడిచేవారిని, ప్రపంచం దృష్టిలో మహనీయులుగా చెలామణీ అవ్వాలనుకునేవాళ్లను, ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు ఆడేవాళ్లను, ప్రాపంచిక విషయాలపై ఎక్కువ శ్రద్ధ చూపించేవారినీ ప్రీస్ట్ హుడ్ కి అర్హులుగా పరిగణించకూడదనీ, దానివల్ల మొత్తంగా చర్చ్ పవిత్రతే దెబ్బతినే ప్రమాదం ఉంటుందని పోప్ బెనెడిక్ట్ తన పుస్తకంలో సూచనలు చేసినట్టు తెలుస్తోంది.

ఈ నియమాలను, నిబంధనలను పూర్తి స్థాయిలో కఠినంగా అమలు చేస్తే దానివల్లకూడా అనేక రకాలైన ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుందని వాటికన్ వర్గాలు అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి పోప్ బెనెడిక్ట్ చేసిన వ్యాఖ్యలు, సూచనలు మాత్రం వాటికన్ వర్గాల్లో కలకలానికి కారణమైనట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.

Next Story