దొంగగా మారిన ఐపీఎల్ స్టార్‌

By Newsmeter.Network  Published on  20 Feb 2020 1:19 PM GMT
దొంగగా మారిన ఐపీఎల్ స్టార్‌

క్రికెటర్లంతా కోరుకునేది జీవితంలో ఒక్కసారి అయినా ఐపీఎల్(ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) ఆడాలని. ఎందుకంటే ఒక్కసారి ఇందులో ఆడితే.. ఆ క్రికెటర్‌ దశ తిరిగినట్లే. రాత్రికి రాత్రే కోటీశ్వర్లులు అయిపోవడం ఖాయం. అలాంటిది.. ఒక్కసారి కాదు.. నాలుగు సంవత్సరాల పాటు ఐపీఎల్‌ ఆడితే.. ఆ క్రికెటర్‌ సంపాదన ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్ అయ్యాక కూడా కాలు మీద కాలు వేసుకుని కూర్చొని తినోచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా.. అయితే ఇది చదవండి.

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ ల్యూక్ పోమర్స్ బాచ్.. ఒకప్పుడు తారాజువ్వలాగా ఎగిపడ్డాడు. 2007లో ఆస్ట్రేలియా త‌ర‌పున పోమర్స్‌బ్యాచ్‌ ఏకైక టీ20లో ప్రాతినిధ్యం వ‌హించాడు. న్యూజిలాండ్‌తో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో 7 బంతుల్లోనే 15 ప‌రుగులు చేశాడు. దీంతో త‌ర్వాతి ఏడాది జ‌రిగిన ఐపీఎల్లో చోటుదక్కించుకున్నాడు. 3 ల‌క్ష‌ల డాల‌ర్ల ధ‌ర‌కు ఐపీఎల్ జ‌ట్టు కింగ్స్ లెవ‌న్ పంజాబ్ అత‌నిని కొనుగోలు చేసింది. పంజాబ్ కు కొన్ని మ్యాచుల్లో ఒంటి చేత్తో విజయాలను అందించాడు.

అయితే అంత‌టితో క‌థ సుఖాంతమ‌వ్వ‌లేదు. 2011 వ‌ర‌కు బాగానే బండి లాగించిన ల్యూక్‌.. ఐపీఎల్లో ఆడుతుండ‌గానే ఒక అమెరిక‌న్ యువ‌తిని వేదించడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ ఘటనతో ఐపీఎల్‌ ప్రాంఛైజీ అతన్ని జట్టు నుంచి తొలగించింది. తదనంతర పరిణామాలతో 2014లో ఆటకు వీడ్కోలు పలికాడు.

చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఒక సారి బైకు దొంగ‌త‌నం చేసి, మరోసారి లిక్క‌ర్ షాప్ నుంచి మ‌ద్యం దొంగిలించి అరెస్ట‌య్యాడు. ఈక్ర‌మంలో క‌నీసం ఉండ‌టానికి ఇల్లు కూడా లేని స్థితిలో ఒక కారులో త‌ల దాచుకున్నాడు. తాజాగా దొంగ‌త‌నంలో మ‌రోసారి ల్యూక్ అరెస్ట‌య్యాడు. బిగ్‌బాష్‌లీగ్‌లో కూడా ప్రాతినిథ్యం వ‌హించిన ల్యూక్ గురించిన తెలిసిన అభిమానులు షాక్‌కు గుర‌య్యారు. తాజా ప‌త‌నం అత‌ని స్వ‌యం కృతాప‌రాధ‌మ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Next Story