రాజకీయ బేతాళం..!:చంద్రబాబు విమర్శల వెనుక ఆంతర్యం అదే...!.

By Newsmeter.Network  Published on  9 Oct 2019 8:35 AM GMT
రాజకీయ బేతాళం..!:చంద్రబాబు విమర్శల వెనుక ఆంతర్యం అదే...!.

అర్ధరాత్రి పన్నెండు గంటలైంది. ఒక్కసారిగా అలారం గట్టిగా మోగింది. పట్టువదలని విక్రమార్కుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. అలారం ఆఫ్‌ చేశాడు. శ్మశానానికెళ్లే సమయమైందన్నమాట... కళ్లునులుముకుని మంచం దిగాడు.

కత్తి మొలకు కట్టిన ఒరలో పెట్టుకుని బయలు దేరాడు. భారీ వర్షాలకు శ్మశానంలోకీ వరద వచ్చేసింది. మోకాలు లోతు నీళ్లల్లోంచి బేతాళుడు విసుక్కుంటూ ముందుకు కదిలాడు. సగం కాలి ఆరిపోయిన శవంలోంచి అప్పుడే పుట్టిన పిల్ల దెయ్యం విక్రమార్కుడి కేసి చూసి వికటాట్టహాసం చేసింది. దాన్ని దాటుకుంటూ మర్రిచెట్టు దగ్గరకొచ్చిన విక్రమార్కుడు చెట్టుకు వేలాడుతోన్న బేతాళుణ్ని భుజాలకెత్తుకున్నాడు. విక్రమార్కుని అవస్థ చూసి బేతాళుడికీ నవ్వొచ్చేసింది.

ఏంటి విక్రమార్కా వానలు ఎలా ఉన్నాయ్? అన్నాడు బేతాళుడు. విక్రమార్కుడు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని..ఏం చెప్పమంటావ్ బేతాళా ..ఎప్పుడో 2009లో పడ్డాయి ఇంతటి వర్షాలు.మళ్లీ ఇంతకాలానికి పడుతున్నాయి.. మంచిదే కదా. అని ముందుకు నడిచాడు.విక్రమార్కా...ఇప్పుడు నీకో కథ చెబుతాను. శ్రద్ధగా విను. అని కథ చెప్పడం మొదలు పెట్టాడు.

"ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం గద్దె దిగి నాలుగు నెలలైంది. ఈ నాలుగు నెలల స్వల్ప వ్యవధిలోనే అధికారంలో ఉన్న వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చంద్రబాబు నాయుడు...ఇతర టిడిపి నేతలూ విమర్శిస్తున్నారు. తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత తక్కువ కాలంలో చెడ్డపేరు మూటగట్టుకున్న ముఖ్యమంత్రి మరొకరలు లేరని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి తెగ విమర్శలు చేస్తున్నారు.ప్రజలు 151 స్థానాలను కట్టబెట్టి జగన్ మోహన్ రెడ్డికి తిరుగులేని మెజారిటీని ఇస్తే..ఆయన నిజంగానే విఫలమయ్యారా? అసలేం జరుగుతోంది ఏపీలో" దీనికి సమాధానం తెలిసీ కూడా చెప్పకపోతే నీ తల వెయ్యి చెక్కలవుతుంది అని బేతాళుడు కథ ముగించాడు.

విక్రమార్కుడు ఒక్క క్షణం ఆలోచించి..బేతాళా నిజానికి ఆంధ్ర ప్రదేశ్ లో గత నాలుగు నెలల వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పాలన అద్భుతంగానే ఉంది. లక్షల ఉద్యోగాలిచ్చారు. ఆశావర్కర్ల జీతాలు పెంచారు. ప్రతీ ఒక్కరికీ ఇంటి స్థలం ఇవ్వడానికి సిద్ధమయ్యారు.మంత్రి వర్గంలో బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేశారు. అన్ని రకాల పదవుల్లోనూ మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఎస్సీ-ఎస్టీ-బీసీ-మైనారిటీ వర్గాలకు పదవుల్లో అగ్రతాంబూలం ఇచ్చారు. రైతులకు ఏటా పన్నెండున్నర వేల రూపాయల ఆదాయాన్ని సమకూర్చే రైతు భరోసా కార్యక్రమాన్నీ ఈ నెల నుంచే అమలు చేయబోతున్నారు.పోలవరం రివర్స్ టెండరింగ్ లో రూ. 850 కోట్లకు పైనే ఆదా చేశారు.ఇలా ప్రతీ పనిలోనూ తనదైన ముద్ర వేస్తూ ముందుకు పోతూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఇసుక పాలసీ ఈ మధ్యనే ఖరారు చేయడం వల్ల ఇసుక లభ్యతలో కొద్ది పాటి తాత్కాలిక సమస్య ఉన్నప్పటికీ మొత్తం మీద జగన్ మోహన్ రెడ్డి పాలన బాగుందనే అందరూ అనుకుంటున్నారు.

అయితే..రివర్స్ టెండరింగ్ వల్ల టీడీపీ హయాంలో అవినీతి జరిగిందని తేటతెల్లం కావడంతో చంద్రబాబు భయపడుతున్నట్లుంది..?!.మును ముందు జగన్ మోహన్ రెడ్డి తీసుకోబోయే నిర్ణయాల వల్ల తమ అవినీతి పుట్ట బద్దలు కావడం ఖాయమని చంద్రబాబు కంగారు పడుతున్నారు. అయితే.. ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పుకోలేరు కదా. అందుకే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై రోజూ విమర్శలు చేయాలని చంద్రబాబు..టిడిపి నేతలు నిశ్చయించారు.

ఆ వ్యూహరచనలో భాగంగానే అయిందానికీ..కాని దానికీ కూడా చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి అసమర్ధ పాలన వల్లనే అన్ని వ్యవస్థలూ భ్రష్టు పట్టాయని ప్రచారం చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి పాలనను అందరూ మెచ్చుకుంటోన్న సమయంలో అదే ప్రభుత్వంపై బురద జల్లితే జనం అయోమయంలో పడతారన్నది చంద్రబాబు వ్యూహం.అందుకే ఆయన ఇలా మాట్లాడుతున్నారే తప్ప నిజానికి జగన్ మోహన్ రెడ్డి తన నాలుగు నెలల పాలనలో విఫలమయ్యారన్న దాంట్లో ఎలాంటి నిజం లేదు... అని విక్రమార్కుడు చెప్పాడు.

విక్రమార్కుడి చెప్పిన సమాధానంతో సంతృప్తి పడ్డ బేతాళుడు విక్రమార్కుడి భుజాలపై మాయమై మళ్లీ చెట్టుకు వేలాడాడు.

- వీర పిశాచి

Next Story