బెంగళూరులో పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) నిరసనగా నిర్వహించిన ‘సేవ్ కాన్‌స్టిట్యూషన్’ కార్యక్రమంలో అమూల్య లియోనా అనే అమ్మాయి పాకిస్థాన్ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేసింది. కర్ణాటక రాష్ట్రం చిక్ మగళూరు జిల్లాలోని కొప్పా టౌన్ లో ఉంటున్న ఆమె కుటుంబం మాత్రం బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతోంది. గురువారం రాత్రి కొందరు వారి ఇంటిపై రాళ్ళ వర్షం కురిపించారు. ఆమె తండ్రిని బయటకు పిలిపించి ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేయించే దాకా వదిలిపెట్టలేదు కొందరు నాయకులు. అమూల్య వ్యాఖ్యలపై సీరియస్ అయిన చాలా మంది ఆమెకు వ్యతిరేకంగా శుక్రవారం నాడు నిరసనలు చేపట్టారు. బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్, శ్రీ రామ సేనకు చెందిన సంఘాలు కొప్పా, చిక్ మంగళూరు, జయాపురలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆమెను కఠినంగా శిక్షించాలని కోరారు.

అమూల్య చేసిన తప్పుకు వారి కుటుంబం ఇబ్బంది పడుతోంది. చాలా మంది వారి ఇంటి ముందు రాత్రి సమయంలో గూమికూడుతున్నారని అమూల్య తండ్రి నొరొన్హా చెప్పారు. గురువారం రాత్రి రాళ్లతో తమ ఇంటిపై దాడి చేశారని, కిటికీలు ధ్వంసం చేశారని చెప్పారు. దీంతో అతడి ఇంటి ముందు రాత్రంతా ముగ్గురు పోలీసులను పహారాగా పెట్టారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఆయన ఒక్కరే ఉన్నారు. ఆయన భార్య కూడా బెంగళూరుకు వెళ్ళిపోయింది.

తన కూతురు చేసిన తప్పుకు చింతిస్తున్నానని.. ఆమె ప్రవర్తన చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు నొరొన్హా. తన కూతురు జైల్లో మగ్గినా తాను పట్టించుకోనని తేల్చి చెప్పారు. ఆమెను జైల్లో పెట్టినా, పోలీసులు ఆమె కాళ్లు విరగ్గొట్టినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె తండ్రి చెప్పారు. ఎటువంటి పర్యవసానాలు ఎదురవుతాయోనన్న కనీస జ్ఞానం లేకుండా తన కూతురు మాట్లాడిందని చెప్పుకొచ్చారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దని.. ఎటువంటి నిరసన కార్యక్రమాల్లోనూ పాల్గొనవద్దని.. చెప్పామన్నారు. బాగా చదువుకుంటే చాలని తాను ఆమెకు చాలా సార్లు చెప్పానని, అయినప్పటికీ తన కూతురిలో ఎలాంటి మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలను ఎవరూ సమ్మతించరని అన్నారు. తన కూతురి వల్ల తన కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోందని అన్నారు. ప్రస్తుతం అమూల్య పై దేశద్రోహం కేసు నమోదైంది. 14 రోజుల పాటు ఆమెను జ్యుడీషియల్‌ కస్టడీకి తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఆమెతో అటువంటి వ్యాఖ్యలు చేయించింది ఎవరు అన్నదానిపై కూడా విచారణ జరుగుతోంది.

కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప మాట్లాడుతూ ఆమెకు బెయిల్ వచ్చే అవకాశాలు లేవని అన్నారు. ‘నక్సల్స్ తో ఆమెకు లింకులు ఉన్నాయని’ చెప్పుకొచ్చారు. ఆమెను ప్రేరేపించిన వాళ్ళను వదిలేది లేదని.. వాళ్ళ గురించి కూడా ఆరా తీస్తామని ఆయన అన్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.