మోదీ ట్వీట్ పై నెటిజన్ల సెటైర్లు

By రాణి  Published on  12 Dec 2019 9:15 AM GMT
మోదీ ట్వీట్ పై నెటిజన్ల సెటైర్లు

న్యూఢిల్లి : ''అస్సాంలోని నా సోదర, సోదరీలకు హామీ ఇస్తున్నాను. క్యాబ్ (పౌరసత్వ (సవరణ)బిల్లు) ను ఆమోదించడం వల్ల ఎవరికీ అన్యాయం జరగదని, ఆందోళన చెందవద్దు. మీ హక్కులు, అస్తిత్వం, అద్భుతమైన సంస్కృతిని ఎవరూ లాక్కోలేరు. అది అంతకంతకూ విస్తరిస్తూ వర్థిల్లుతుంది'' అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. అధికరణ 6 స్ఫూర్తితో అస్సామీల రాజకీయ, భాషా, సంస్కృతి, భూ హక్కులకు రాజ్యాంగబద్దంగా పూర్తి రక్షణ కల్పిస్తామని ప్రధాని స్పష్టం చేశారు. పౌరసత్వ (సవరణ)బిల్లు 2019 రాజ్య సభలో ఆమోదం పొందిన నేపథ్యంలో ఈశాన్య రాష్ర్టాల్లో నాలుగు రోజులుగా జరుగుతున్న ఆందోళనలు తీవ్రమయ్యాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను ఆపివేశారు. ఆందోళనలు ఎక్కువగా మరికొన్ని చోట్ల 144 సెక్షన్ విధించారు పోలీస్ అధికారులు.

అయితే మోదీ చేసిన ట్వీట్ కు వచ్చిన రిప్లైలు చూసి ఆయన ఖంగుతిన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆందోళనలు జరుగుతున్న ప్రదేశంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తే వారు మీ ట్వీట్ ఎలా చదువుతారని నెటిజన్లు వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు. ఇంతకన్నా మీరే అసోం వెళ్లి ‘సబ్ చంగా సి’ (అంతా బాగానే ఉంది) అని చెప్పండి అని మోదీకి సలహాలిస్తున్నారు. ‘‘అసోంలోని సోదరీ, సోదరులకు ఇంటర్నెట్ లేదు. కశ్మీర్‌లోని సోదరీ, సోదరుల మాదిరిగానే మీ సందేశాలు వాళ్లు కూడా మిస్ అవుతారు..’’ అని మరొకరు ట్వీట్ చేశారు. ‘‘మోదీగారు ఓవైపు అసోంలో ఇంటర్నెట్ ఆపేసి, మరోవైపు హామీలు ఇస్తున్నారు. పుండు మీద కారం చల్లినట్టుంది ఆయన వ్యవహారం..’’ అని మరో నెటిజన్ సెటైర్ పేల్చాడు.

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బుధవారం రాజ్యసభలో పౌరసత్వ( సవరణ )బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం అమిత్ షా సభలో మాట్లాడుతూ..ఇది ఒక చారిత్రాత్మక బిల్లుగా ఉంటుందన్నారు. దీనిద్వారా ఇండియాలో మైనార్టీలకు పూర్తి రక్షణ ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకూ తరతరాలుగా శరణార్థులకు అన్యాయం జరిగిందని, దేశ విభజనతో వారంతా తీవ్ర వివక్షకు గురయ్యారన్నారు. ఇకపై మైనార్టీల హక్కులకు ఎలాంటి విఘాతం ఉండదన్నారు. మైనార్టీల కోసం ప్రభుత్వం ప్రత్యేక బిల్లు చేస్తుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక తప్పుడు అపోహలు సృష్టిస్తున్నాయని అమిత్ షా విమర్శించారు. ఈ బిల్లును గురించి ఈశాన్య రాష్ర్టాల ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముస్లింలకు వ్యతిరేకంగా ఈ బిల్లును తీసుకురాలేదని స్పష్టత ఇచ్చారు.

Next Story