మంత్రి ఊళ్లో పేకాట.. పట్టుకోవటానికి వెళితే పోలీసులపై దాడి

By సుభాష్  Published on  29 Aug 2020 2:12 AM GMT
మంత్రి ఊళ్లో పేకాట.. పట్టుకోవటానికి వెళితే పోలీసులపై దాడి

ఏపీలోని మంత్రిగారి ఊళ్లో చోటు చేసుకున్న ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎంత మంత్రిగారి ఊరైతే మాత్రం.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తే.. వారిపైనే దాడి చేసిన వైనం హాట్ టాపిక్ గా మారింది. ఏపీ కార్మిక శాఖామంత్రి గుమ్మనూరు జయరాం సొంతూరు గుమ్మనూరు (కర్నూలు జిల్లాలోని చిప్పగిరి మండలంలో ఈ ఊరుంది)లో పేకాట రాయుళ్లను పట్టుకునేందుకు పోలీసులు మఫ్టీలో వెళ్లారు.

తమకు అందిన ప్రత్యేక సమాచారంతో పేకాట రాయుళ్లను పట్టుకునేందుకు పోలీసులు సివిల్ దుస్తుల్లో వెళ్లారు. పేకాట ఆడుతున్న వారిని గుర్తించి..వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఇలాంటివేళ.. పోలీసులకు అనూహ్య పరిణామం ఎదురైంది. తాము మంత్రి జయరాం అనుచరులమని.. తమను అరెస్టు చేయటమా? అని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. పోలీసుల్ని చితకబాదేయటం షాకింగ్ గా మారింది.

ఈ ఉదంతంలో పోలీస్ కానిస్టేబుళ్లతో పాటు.. ఎస్ఐ సమీర్ బాషాకు గాయాలు కావటం సంచలనంగా మారింది. జరిగిన ఉదంతంపై పోలీసు శాఖ సీరియస్ కావటంతో.. పోలీసులపై దాడి చేసి పరారైన వారిని వెతికేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు ఈ ఉదంతంలో 32 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులపై దాడి చేసిన వారిలో డ్రైవర్లు మాత్రమే దొరికారని.. మిగిలిన వారు పారిపోయినట్లుగా చెబుతున్నారు.

ఇక.. ఈ పేకాట వ్యవహారం ఎంత భారీ అన్నది తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. పేకాట కోసం ప్రత్యేకంగా టెంట్ వేయటమే కాదు.. శానిటైజర్.. బ్లీచింగ్ పౌడర్లను జల్లి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. లిక్కర్ ప్యాకెట్లతో పాటు.. పేక ముక్కలు ఘటనా స్థలంలో లభించాయి. రూ.5.34లక్షల క్యాష్ తో పాటు.. 35 కార్లు.. ఆరు స్కూటర్లను సీజ్ చేశారు. మొత్తం 35 మంది నిందితుల్ని గుర్తించినట్లుగా చెబుతున్నారు.

ప్రత్యేకంగా టెంట్ వేసి మరీ.. ఇంత భారీగా ఏర్పాట్లు చేయటం చూస్తే.. ఇదేదో అల్లాటప్పా వ్యవహారం కాదని..దీని వెనుక పెద్ద విషయమే ఉండి ఉండాలన్న మాట వినిపిస్తోంది. చేసింది ఎదవ పనే కాదు.. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులపై దాడి చేయటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు.ఎంత మంత్రి ఊరు అయితే.. మాత్రం ఇలా చేస్తారా? అన్న ప్రశ్న వినిపిస్తోది. ఇలాంటి ఉదంతాల్లో మంత్రి పేరు వాడటం ఏ మాత్రం సరికాదంటున్నారు. దీనిపై సదరు మంత్రి స్పందించాల్సి ఉంది.

Next Story
Share it