పవన్ కళ్యాణ్ అత్మీయుడు, ఆంతరంగికుడు, సిద్ధాంతకర్త రాజు రవితేజ్ జనసేనకు గుడ్ బై చెప్పాడు. పార్టీ పాలిట్ బ్యూరో నుంచి తాను వైదొలగుతున్నట్టు, తనకు పార్టీకి ఇక ఎలాంటి సంబంధమూ ఉండబోదని రాజు రవితేజ్ ఒక ప్రకటన ద్వారా తెలియచేశాడు. ఈ రాజీనామా ను పవన్ కళ్యాణ్ తక్షణమే ఆమోదించారు. రాజు రవితేజ అభిప్రాయాలను, ఆందోళనను తాము అర్ధం చేసుకుంటున్నామని, ఆయన గతంలోనూ పార్టీని ఇదే కారణాలతో వీడి మళ్లీ వచ్చి చేరారని, జగన్మాత ఆయనకు, ఆయన కుటుంబానికి ఆశీర్వాదాలు ఇవ్వాలని తాను కోరుకుంటున్నట్టు పవన్ అన్నారు.అయితే రవితేజ్ మాత్రం పవన్ కళ్యాణ్ మారిపోయాడని, అతను కుల మతాల పేరిట విషాన్ని విరజిమ్ముతున్నాడని ఒక లేఖ వ్రాసి ఆరోపించాడు. ఇకపై తనకు పవన్ కు ఎలాంటి సంబంధాలూ లేవని ఆయన అన్నారు. పవన్ కుల మతాల విషాన్ని విరజిమ్ముతూ ఒక ప్రమాదకరమైన వ్యక్తిగా మారిపోయాడని ఆయన అన్నారు. మీరు అర్హత లేకుండా సంపాదించింది మీ అనుమతి లేకుండా చేజారిపోతుందని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.ఒక విడియో సందేశంలో పవన్ కుట్రపూరిత, నిజాయితీ రహిత, అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. పవన్ వ్యవహార శైలిలో కక్ష సాధింపు ధోరణి కనిపిస్తోందని, ఒక వర్గాన్ని మరొక వర్గంపై రెచ్చగొట్టే పనిని చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన గెలిస్తే అది సమాజానికి ప్రమాదకరమని, ఆయన కుట్రలు ఫలిస్తే సమాజంలో అయోమయ స్థితి నెలకొంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

రాజు రవితేజ్ తెలంగాణకు చెందిన వాడు కానీ జనసేన పార్టీ సిద్ధాంతకర్తగా ఎదిగాడు. ఆయన గతంలో పవన్ కళ్యాణ్ తో పలు దఫాలు చర్చించిన తరువాత పార్టీ సిద్ధాంతాన్ని వివరించే ఇజం అనే పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ తో పాటు కలిసి రచించారు.

జనసేనను వీడటం రవితేజ్ కు కొత్త కాదు. గతంలో 2014 లో ఆయన పార్టీ నుంచి దూరమై, ఆ తరువాత మళ్లీ 2017 లో పార్టీలో తిరిగి చేరారు. పవన్ కూడా పార్టీ ఆవిర్భావం సమయంలో తాను పార్టీ ఏర్పాటు విషయంలో పలు సార్లు రాజు రవితేజ్ తో చర్చించిన తరువాతే స్పష్టతను పొందానని ప్రకటించిన తరువాతే రవితేజ్ గురించి ప్రపంచానికి తెలిసింది.

రవితేజ్ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడైనా ప్రచార ఆర్భాటానికి చాలా దూరంగా ఉంటాడు. ఆయన పవన్ కామన్ మాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేసినప్పటి నుంచి పవన్ తో కలిసి పనిచేస్తున్నాడు. దాదాపు పది పుస్తకాలు వ్రాసిన రవితేజ్ పలు కంపెనీలకు కన్సల్టెట్ గా, ఇన్ స్పైర్ ఇండియా అనే సంస్థకు వ్యవస్థాపక మేనేజింగ్ ట్రస్టీగా 2004 నుంచి పనిచేస్తున్నారు. తరువాత కాలంలో గుడ్ విల్ సొసైటీ అన్న సంస్థలను కూడా ప్రారంభించాడు. ఆయన వెబ్ సైట్ ప్రకారం ఆఫీస్ బాయ్ ఉద్యోగం నుంచి కంప్యూటర్ ప్రోగ్రామర్ గా పనిచేశారు. తరువాత సేల్స్ మ్యాన్ గా కూడా పనిచేశారు.

Newsmeter.Network

Next Story