నాలుగు ఆస్కార్లు వచ్చిన 'పారాసైట్' మా సినిమాను కాపీ కొట్టి తీసిందే: తమిళ నిర్మాత

By సుభాష్  Published on  17 Feb 2020 2:07 PM GMT
నాలుగు ఆస్కార్లు వచ్చిన పారాసైట్ మా సినిమాను కాపీ కొట్టి తీసిందే: తమిళ నిర్మాత

పారాసైట్.. 92వ అకాడెమీ అవార్డ్స్ లో నాలుగు అవార్డులను సొంతం చేసుకున్న సినిమా..! పారాసైట్ సినిమాను చూసిన చాలా మంది తమిళ సినీ ప్రేమికులు ఇది తమిళ సినిమా 'మిన్సార కన్నా' సినిమాకు దగ్గరగా ఉందంటూ కామెంట్లు చేశారు. చాలా వరకూ ఈ రెండు సినిమాల 'కథ' దాదాపు ఒకటేనని చెప్పారు. మిన్సార కన్నా సినిమాలో స్టార్ హీరో విజయ్ నటించాడు. కె.ఎస్.రవి కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1999 లో విడుదలైంది. 'ఎం.ఏ.కెన్నడీ' మిన్సార కన్నాను రాయగా.. కె.ఎస్.రవి కుమార్ స్క్రీన్ ప్లే అందించాడు. ఇప్పుడు ఆస్కార్ అందుకున్న సినిమాను తమిళంలో 20 ఏళ్ళ కిందటే రూపొందించారన్నమాట. ఈ విషయంపై కె.ఎస్.రవి కుమార్ ను సంప్రదించగా.. తాను పారాసైట్ సినిమాను ఇంకా చూడలేదని.. చూసాక మాట్లాడుతానని అన్నారు.

మిన్సార కన్నా సినిమాకు ప్రొడ్యూసర్ అని చెబుతున్న పి.ఎల్.తేనప్పన్ ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు.(సినిమా టైటిల్స్ లో ప్రొడ్యూసర్ పేరు కె.ఆర్.జి. అని ఉంది.. ఆయన చనిపోయినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి)

పి.ఎల్.తేనప్పన్ మాట్లాడుతూ పారాసైట్ ను తెరకెక్కించిన 'బాంగ్ జూన్ హో' ను కోర్టుకు లాగుతానని చెబుతున్నారు. ప్రస్తుతం చెన్నై కు చెందిన ఓ లాయర్ తో సంప్రదింపులు జరుపుతున్న తేనప్పన్ త్వరలో ఇంటర్నేషనల్ లాయర్ ను కూడా పెట్టుకోబోతున్నామని చెప్పారు. పారాసైట్ సినిమాకు అన్ని అవార్డులు వచ్చాక.. తాను దాన్ని చూశానని.. సినిమా సంబంధించిన మెయిన్ ప్లాట్ తమ సినిమా నుండి దొంగిలించారని ఆరోపించారు. కోర్టు ఏ నిర్ణయం తీసుకోనుందో ఎదురుచూద్దామని చెబుతున్నారు తేనప్పన్. చాలా మంది కొరియన్ దర్శక నిర్మాతలు.. తమ సినిమాలను తమిళ దర్శకులు కాపీ కొట్టారని కేసులు నమోదయ్యాయి.. ఇప్పుడు తొలిసారి తమిళ నిర్మాత కొరియన్ చిత్ర దర్శక నిర్మాతలపై కేసు పెట్టబోతున్నాడని తేనప్పన్ చెప్పుకొచ్చారు.

Next Story