రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978′. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్‌ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా ఈ రోజు విడుదల అయింది.

కొత్త నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కడం, టైలర్ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చడంతో ఈ సినిమా ఒక డీసెంట్ బజ్ క్రియేట్ అవ్వడంతో ఈ చిత్రం మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందా లేదా అనేది రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ:

అది 1978 కాలం..  శ్రీకాకుళం జిల్లాలో పలాసా అనే ప్రాంతం…అక్కడ  పెద్దకులం వారుగా షావుకార్లుగా చలామణి అవుతున్న గురుమూర్తి (రఘు కుంచె) అతని అన్నయ్య పెద్ద షావుకారు ఎవరికి వారు వేరుగా పోటీగా దురాగతాలు చేస్తూ…  తక్కువ జాతి అని పిలవబడుతున్న వారిని పూర్తిగా అణిచివేస్తారు. అలాంటి తక్కువ జాతిలో పుట్టిన మోహన్రావ్  (రక్షిత్) మరియు అతని అన్నయ్య రంగారావ్ (తిరువీర్) షావుకార్లు చేస్తోన్న  అన్యాయానికి ఎదురుతిరుగుతారు.

ఆ తరువాత  ఇద్దరు సోదరులు మోహన్, రంగా మద్యే మనస్పర్థలు రావడం.. దాంతో రంగారావ్ తమ్ముడిని వదిలేసి పెద్ద షావుకారు దగ్గరికే మళ్ళీ వెళ్లిపోవడం.. ఇలా కథ చాలా మలుపులు తిరుగుతూ సాగుతోంది.  ఆ తరువాత జరిగిన నాటకీయ పరిణామాల అనంతరం  పెద్ద షావుకారును  మోహన్రావ్, రంగారావ్ కలిసి చంపేయడం, దాంతో చిన్న షావుకారు గురుమూర్తికి కలిసి రావడం,  మోహన్రావ్, రంగారావ్ లను దగ్గరకి చేరతీయడంతో పలాసలో వీళ్ళు రౌడీలుగా పేరు తెచ్చుకుంటారు. ఈ క్రమంలో వీరిని చంపడానికి ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి ? అసలు వీళ్ళను చపాలనుకుంటుంది ఎవరు ?  చివరకి మోహన్, రంగా అనుకున్నది సాధించారా లేదా ?  మొత్తం మీద వీరి కథ ఎలా ముగిసింది ? అనేది మిగతా కథ.

నటీనటులు :

ఈ సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ మోహన్రావ్ పాత్రలో అద్భుతంగా నటించారు.  క్లిష్టమైన కొన్ని సన్నివేశాల్లో  ఆయన నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తన అన్నయ్య,  తన భార్య చనిపోయిన సన్నివేశంలో అలాగే తన ప్రేమను వ్యక్త పరిచే సన్నివేశంలో రక్షిత్ నటన ఎమోషనల్ గా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది.

హీరోయిన్ గా నటించిన నక్షత్ర  తన నటనతో పాటు గ్లామర్ తోనూ  బాగా ఆకట్టుకుంది. ప్రేమ  సన్నివేశాలతో పాటు, కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కూడా తన పెర్ఫార్మెన్స్ తో నక్షత్ర  మెప్పించింది. హీరోయిన్ కి బ్రదర్ గా నటించిన నటుడు కూడా తన కామెడీతో  ఆకట్టుకున్నాడు.  అలాగే మరో కీలక పాత్ర అయిన విలన్ పాత్రలో నటించిన రఘు కుంచె బాగా నటించాడు. అలాగే తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ లతో మిగిలిన నటీనటులు కూడా  తమ పాత్ర పరిధి మేరకు  బాగా నటించారు.

ఇక ఈ మధ్య వస్తోన్న  సినిమాల్లో చాల వరకూ ఎమోషనల్ సాగే యాక్షన్‌ బేస్డ్‌ సినిమాలే అయినా  ఈ సినిమా మాత్రం కొత్త తరహా ఎమోషనల్ ఫిల్మ్స్ కోరుకునే అభిమానులను కూడా ఆకట్టుకుటుంది.  రెగ్యూలర్ సినిమా లెక్కలను పక్కన పడేసి..  కథలోని పాత్రల మధ్య సంఘర్షణనే నమ్ముకుని… పైగా ఆ సన్నివేశాలను  అలాగే తెరకెక్కించడం అంటే.. అది ఒక రేర్‌ అటెంప్టే.  అనవసరపు సన్నివేశాలను ఇరికించకుండా కథకు అనుగుణంగా సినిమా మొదటి ఫ్రేమ్‌ నుండి చివరి ఫ్రేమ్‌ వరకూ దర్శకుడు సినిమాని బాగా నడిపాడు.

సాంకేతిక విభాగం :

డైరెక్టర్ కరుణ కుమార్ సినిమాని ఎమోషనల్ గా బాగా తెరకెక్కించారు. మెయిన్ గా  కుల వ్యవస్థ మీద ఆయన ఇచ్చిన మెసేజ్ చాలా బాగుంది. అలాగే ఈ కుల బలహీనత వల్ల నలిగిపోయిన జీవితాలను  దర్శకుడు చాల  బలంగా చూపించారు. సంగీత దర్శకుడు రఘు కుంచె అందించిన పాటల్లో రెండు బాగున్నాయి.  ముఖ్యంగా హీరోహీరోయిన్ల మధ్య  వచ్చే లవ్ సాంగ్ బాగుంది.   అలాగే కొన్ని సన్నివేశాల్లో ఆయన అందించిన  నేపధ్య సంగీతం కూడా  ఆకట్టుకుంటుంది. కోటగిరి ఎడిటింగ్ జస్ట్ ఓకే అనిపిస్తోంది.  బోర్ కొట్టించే కొన్ని సన్నివేశాలను అయన తన ఎడిటింగ్ తో మ్యానెజ్ చేయలేకపోయారు.  సినిమాటోగ్రఫీ  బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు. ఇక  సినిమాలోని నిర్మాత  పాటించిన  ప్రొడక్షన్ వాల్యూస్  బాగున్నాయి.

అయితే సినిమాలో కాస్త ఎక్కువగా బూతులు ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు కాస్త ఇబ్బందే. ఇక సెకెండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా  నడుపుదామని దర్శకుడు బాగానే ప్రయత్నం చేశాడు, కాకపోతే అక్కడక్కడా ఆ ఎమోషన్ గాని, ఆ ఫీల్ గాని ఆడియన్స్ ఫీల్ అవ్వరు.  కథనం ఇంకా ఆసక్తికరంగా నడిపే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు మాత్రం తన శైలిలోనే సినిమాని మలిచారు. డైరెక్టర్ స్క్రీన్ ప్లే  పై ఇంకా శ్రద్ద పెట్టి ఉంటే సినిమా క్లాసిక్ అనిపించుకునేది ఏమో.

ఓవరాల్ గా సినిమా చివరకి వచ్చేసరికి  పాత్రలకు ఏం జరుగుతుందో అనే ఉత్సుకతను దర్శకుడు బాగా మెయిటైన్ చేశాడు. క్లైమాక్స్ ముగిసే సరికి సినిమా మీద  మంచి భావేద్వేగంతో కూడుకున్న అనుభూతి కలుగుతుంది.

ప్లస్ పాయింట్స్:

డైలాగ్స్,

పాత్రలు మరియు వాటి ఎమోషన్స్,

కథా నేపథ్యం,

నటీ, నటుల పర్ఫార్మెన్స్,

యాక్షన్ సన్నివేశాలు,

దర్శకత్వ పనితనం.

మైనస్ పాయింట్స్:

కొన్ని సీన్స్ స్లోగా సాగడం

స్క్రీన్ ప్లే ఊహించే విధంగా ఉండటం,

తీర్పు:

సగటు ప్రేక్షకుడ్ని భావేద్వేగమైన ఫీల్ తో  సున్నితమైన హాస్యంతో  సహజసిద్ధమైన పాత్రలతో.. ఈ సినిమా మెప్పిస్తుంది. ప్రధానంగా  సినిమా చూస్తున్నంత సేపు పలాస అనే ఊరిలోకి  వెళ్లి ఆ పాత్రలను మనం  దగ్గరనుండి చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.  కాకపోతే రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కి అలవాటు పడ్డ ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో నచ్చకపోవచ్చు.  కానీ ఈ సినిమా మంచి చిత్రాలని కోరుకునే ప్రేక్షకులకు చాల బాగా నచ్చుతుంది

రేటింగ్ : 3/ 5

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.