ఉమర్‌ అక్మల్‌కు మరో షాక్‌ ఇచ్చిన పీసీబీ..

By Newsmeter.Network  Published on  28 Feb 2020 12:15 PM GMT
ఉమర్‌ అక్మల్‌కు మరో షాక్‌ ఇచ్చిన పీసీబీ..

పాకిస్థాన్‌ క్రికెటర్‌ ఉమర్‌ అక్మల్‌కు పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డు(పీసీబీ) మరో షాకిచ్చింది. ఇప్పటికే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కోసం బుకీలతో అక్మల్ సంప్రదింపులు జరిపినట్లు వెలుగులోకి రావడంతో.. అవినీతి నిరోధక నియమావళిలోని ఆర్టికల్ 4.7.1 కింద పీసీబీ ఇటీవలే.. అక్మల్‌ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అక్మల్ పై విచారణ పూర్తి అయ్యే వరకు క్రికెట్‌ ఆడకుండా నిషేదించింది. దీంతో పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌‌ఎల్)లో ఆడే అవకాశం కోల్పోయాడు ఉమర్ అక్మల్‌.

పీఎస్‌ఎల్‌ క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ప్రాతినిథ్యం వహించాల్సిన అక్మల్‌ సస్పెన్షన్‌ కారణంగా ఆ లీగ్‌కు దూరం కావాల్సి వచ్చింది. దాంతో అక్మల్‌కు మరో తలనొప్పి ఎదురైంది. పీఎస్‌ఎల్‌ ఆడటానికి తాము ముందుగా ఇచ్చిన అడ్వాన్స్‌ను తిరిగి ఇచ్చేయాలంటూ గ్లాడియేటర్స్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు పీఎస్‌ఎల్‌ నిర్వహిస్తున్న పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుకు విన్నవించింది. అక్మల్‌ సస్పెండ్‌ అయిన కారణంగా అతనికి చెల్లించిన 70శాతం డబ్బును తిరిగి ఇచ్చేయండి. అతను చేసుకున్న కాంట్రాక్ట్‌లో భాగంగా చెక్‌ రూపంలో చెల్లించాం. దాన్ని పీసీబీ ద్వారానే సదరు క్రికెటర్‌కు అందజేశాం. దాంతో ఉమర్‌కు అందజేసిన డబ్బులు విషయంలో పీసీబీదే బాధ్యత అని ఫ్రాంచైజీ అధికారి ఒకరు తెలిపారు.

పీఎస్‌ఎల్ ఫ్రాంఛైజీలు తొలి సీజన్ నుంచి టోర్నీ ఆరంభానికి ముందే ఆటగాళ్లకి పేమెంట్‌లో 70 శాతం డబ్బుల్నిఅందజేస్తున్నాయి. మిగిలిన 30 శాతం అమౌంట్‌ని టోర్నీ ముగిసిన తర్వాత ఇస్తున్నాయి. అందులో భాగంగా.. టోర్నీ ఆరంభం కావడానికి ముందే అక్మల్‌కు ప్రాంఛైజీ డబ్బులు చెల్లించింది. ఈ విషయం పై స్పందించిన పీసీబీ.. ఆ డబ్బుని వీలైనంత త్వరగా ఫ్రాంఛైజీకి తిరిగి ఇచ్చేయాలని అక్మల్ ను ఆదేశించింది.

Next Story