15-3-2020 ఆదివారం నుండి 21-3-2020 శనివారం వరకు

By సుభాష్  Published on  15 March 2020 9:06 AM GMT
15-3-2020 ఆదివారం నుండి 21-3-2020 శనివారం వరకు

మేష రాశి : ఈ రాశివారికి ఈ వారంలో హెచ్చు తగ్గులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. లగ్నంలో శుక్రుడు ఉండడం వల్ల శరీర సౌఖ్యాన్ని పొందుతారు. అధికారికంగా చిక్కులు మాత్రము తప్పవు. వారం ప్రారంభం మాత్రం శుభ సూచనలతో మంచి ఆదాయంతో ప్రారంభమవుతుంది. కానీ బుధవారం నుండి చిన్న అనారోగ్యము అవమానము ఆ కారణంగా ధనవ్యయం తప్పనిసరి పరిస్థితి అవుతుంది. అయితే కుటుంబపరంగా ఆనందాన్ని పొందగలుగుతారు. పిల్లల ఆరోగ్యము చదువు మిమ్మల్ని కొంచెం కలత చెందిస్తుంది. కావలసినంత ధనం ఎలాగో ఒకలాగ సమకూరుతుంది. మీ శత్రువులు బయటికి కనిపించరు గాని అంతరంగంలో శత్రు భావన కలిగి ఉంటారు. వారికున్న ధన రాజకీయ అధికార బలాలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీధనం దుర్వినియోగం అయ్యేటట్టు చేస్తారు. వారాంతంలో శుభం జరుగుతుంది. అశ్వినీ నక్షత్ర జాతకులకు మిత్రతార అయ్యింది కాబట్టి మంచి ఫలితాలు పొందగలరు .భరణీ నక్షత్ర జాతకులకు నైధన తార అయ్యింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి కృత్తికా ఒకటవ పాదం వారికి సాధన తార శుభప్రదమై ఉన్నది.

పరిహారం :- ప్రతిరోజు సూర్యోదయం సరికి ఆవునేతితో దీపాన్ని వెలిగించి నమస్కరించండి అగ్నిదేవుని అనుగ్రహం పొందుతారు.

వృషభరాశి : ఈ రాశివారికి ఈ వారంలో అన్ని పనులు చేయగలిగిన సామర్ధ్యం ఉంటుంది . సమయమే ఉండదు. ఒకానొక సమయంలో మీరు శస్త్ర చికిత్సని పొందవలసిన అవసరం పడుతుంది. దానివల్ల బాగా ధనవ్యయం ఎక్కువ ఔతుంది . మీలో ఈ కారణంగా ఉత్సాహం తగ్గుతుంది. దీర్ఘ రోగులకు ఇది ప్రతికూల సమయం. మీ మితృలు బంధువుల ద్వారా మాత్రమే సంతోషాన్ని పొందుతారు. విలువైన వస్తువులు చేజారిపోతాయి. మళ్ళీ దొరికే అవకాశం కూడా ఉండదు. అకారణంగా మీతో కలహించడానికి శత్రువులు చూస్తూ ఉంటారు. అధికారులతో సున్నితంగా వ్యవహరించండి. మాటల జోరు తగ్గించాల్సిన సమయమిది. వారం ఆరంభంలో లాభాన్ని మళ్లీ వారాంతంలో కూడా ధనలాభాన్ని సుఖ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. మీ ఓపిక మిమ్మల్ని పరీక్ష చేస్తూ ఉంటుంది. కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల వారికి సాధన తార కాబట్టి పనులన్నీ సులువుగా జరుగుతాయి. రోహిణి వారికి ప్రత్యక్తార అయింది కాబట్టి ఆలోచనలు స్థిరంగా ఉండవు. మృగశిర ఒకటి రెండు పాదాల వారికి క్షేమ తారైంది కాబట్టి శుభప్రదంగా ఉంటుంది.

పరిహారం :- మీరు ఇంద్రాక్షి స్తోత్రాన్ని పఠించిన లేదా సూర్యనారాయణస్వామి ప్రార్థనలు చేసిన ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది.

మిధున రాశి : ఈ రాశివారికి కార్యజయంతో వార ప్రారంభము విశేష ధనలాభముంది. సౌఖ్యము ఎంత ఉందో వీరికి భయం కూడా అంతే ఉంటుంది. వీరికి వీరి పనిపట్ల కంటే ఇతరుల పనుల పట్ల ఎక్కువగా ఇష్టత. వీరికి ద్రవ్య నష్టము, కార్య విఘ్నము, పై అధికారుల ఒత్తిడులు ఎక్కువయి తీవ్ర మానసిక ఆందోళన అనుభవిస్తారు. ఒకచోట నిలువలేక ఎవరితోనూ చెప్పుకోనూ లేక మానసిక ఆందోళనకు గురి అవుతారు. ప్రతి పనిలోనూ వీరే ముందు పని జరగదేమో అని చెడు ఆలోచనలు కలవారవుతారు. ధనం ఎంత వస్తుందో అంతా నష్టపోయే అవకాశం కూడా వుంది. కార్యాన్ని జయించాలనే పట్టుదలతో మాత్రం ముందుకు సాగిపోతే తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. మృగశిర మూడు నాలుగు పాదాల వారికి క్షేమ తారైంది శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఆరుద్ర వారికి ఈ వారంలో విపత్తార అయింది కాబట్టి వ్యతిరిక్త ఫలితాలు ఎక్కువగా కనిపిస్తాయి. పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారికి సంపత్తార అయింది కాబట్టి ధనలాభాన్ని పొందగలుగుతారు.

పరిహారం : బుధవారం నాడు నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించిన, పచ్చని రంగు వస్త్రాలు ధరించినా విష్ణుసహస్రనామ పారాయణ చేసినా శుభప్రదం.

కర్కాటక రాశి :- ఈ రాశివారికి కష్టాలతో వారం ప్రారంభం ఐనా విశేష ధన లాభం వస్తు లాభం వుంది. మీ ఆలోచనలు సమాజానికి పనికొచ్చే మీకో మంచి భవిష్యత్తు ఇవ్వనున్నాయి. సంతోషాన్ని సుఖజీవనాన్ని కూడా పొందగలుగుతారు. మీరంటే సంఘంల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ వ్యవహార జ్ఞానమే మిమ్మల్ని విశేష ధనవంతులను చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.వైద్య రంగంలో ఉన్నవారికైనా ఈ వారం మిమ్మల్ని ఒక స్థాయికి నడిపిస్తుంది. మీకు గ్రహ అనుకూలత ఎక్కువగా ఉండడం వల్ల మీరు స్వేచ్ఛగా మీ పనులు మీరు చేసుకునే అవకాశాలు కల్పించబడతాయి. మీకు ఇంతకు ముందు లేని ఆనందము మీ కౌశలము కూడా పదిమంది చూసి హర్షిస్తారు. మీ బహుముఖ ప్రజ్ఞా శీలతకు ఈ వారం ఒక చక్కని వేదిక కల్పిస్తుంది. పునర్వసు నాలుగవ పాదం వారికి క్షేమ తారైంది కాబట్టి శుభప్రదంగా ఉంది. పుష్యమి నక్షత్రం వారికి ఆరోగ్యాన్ని హెచ్చరిస్తోంది. ఆశ్రేషా నక్షత్రం వారికి పరమ మిత్ర తారైంది కాబట్టి శుభ ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు.

పరిహారం :- గౌరీదేవిని ప్రార్థించినా పంచామృతాలాతో అభిషేకం చేసినా మీకు సత్ఫలితాలు కలుగుతాయి.

సింహరాశి : ఈ రాశి వారికి విశేషమైన ధనాకర్షణ శక్తి కలుగుతుంది. కొత్త వస్తువుల్ని భూమిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. స్థలమార్పిడి వల్ల కూడా మీరు లబ్ధిని పొందగలుగుతారు. మీకున్న కార్యదక్షత సామర్థ్యత తట్టుకోలేని తోటివారు శత్రువులుగా మారిపోయి మీకు హాని తలపెడతారు. అయినా అన్నిటి నుంచి మీరు ధైర్యంగా ముందుకొచ్చే అవకాశం ఉంది. వారాంతంలో మీరు ధన సంపదతో తులతూగుతారు. కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది. అయినా మీరు అనుకున్న పనులను చక్కగా నెరవేర్చుకుంటారు. పిల్లల ఆరోగ్య విషయం మాత్రం జాగ్రత్తగా చూడండి మీ పిల్లలు మీకు దూరం అవుతారేమో వారితో మాట్లాడి వారిని సన్మార్గంలోకి నడిపించండి. మఖ నక్షత్ర జాతకులకు మిత్ర తయారైంది చాలా లబ్ధిని పొందగలుగుతారు పుబ్బ వారికి నైధన తార అయ్యింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్న ఉత్తర ఒకటో పాదం వారికి సాధన తారైంది కాబట్టి మంచి ఫలితాలని పొందగలుగుతున్నారు.

పరిహారం : మీరు ఆదిత్య హృదయాన్ని క్రమం తప్పకుండా రోజుకొక్కసారైనా పాఠం చేస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది. మన్యసూక్త పారాయణ కూడా సత్ఫలితాన్ని ఇస్తుంది.

కన్యా రాశి : ఈ రాశివారికి అలంకార ప్రాప్తి ఉంది. స్థిరాస్తిని పొందే అవకాశం కూడా ఉంది. అయితే ఎక్కువ విచారము,అనుకున్న పనులు సకాలంలో జరగక పోవటం ఇవి మానసికంగా కుంగదీస్తాయి. సంతానానికి కూడా అనారోగ్యం సూచిస్తోంది. ఈ కృతంగా ధనం వ్యయం తప్పదు. కొద్దిపాటి గౌరవ భంగ సూచనలు కూడా ఉన్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అనుకున్నంత స్థాయిలో పొందలేకపోవచ్చు. ఆర్థిక ఫలితాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి .వీరికి ఆత్మస్థైర్యము మనోధైర్యము ఈ రెండూ పుష్కలంగా ఉంటేనే పనులన్ని సాధించుకో గలుగుతారు. వారం ప్రారంభంలోనూ చివరిలోనూ ధనలాభాన్ని పొందుతారు. మధ్యలో మాత్రం ఇబ్బందులను ఎదుర్కొంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారికి సాధన తార అయింది శుభఫలితాలున్నాయి. హస్తా నక్షత్ర జాతకులకు మాత్రమే ప్రత్యక్తారైంది జ్ఞాపక శక్తి భంగం ఉంది. చిత్త ఒకటి రెండు పాదాల వారికి క్షేమ తారైంది కాబట్టి మంచి ఫలితాల్ని మీరు పొందగలుగుతారు.

పరిహారం : విష్ణు సహస్రనామ పారాయణ చాలా మేలు చేస్తుంది. ఆంజనేయస్వామి పూజ కూడా మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది.

తులా రాశి :- ఈ రాశివారికి ఈ వారం కత్తిమీద సాములా ప్రతి పని కూడా వాయిదా పడుతూనే ఉంటుంది. ఎవరో ఒకరు వీరిని వెనక్కి లాగుతూనే ఉంటారు. దాని కారణంగా వీరిలో గుండె ధైర్యం తగ్గిపోతుంది. అన్ని యోగ్యతలు ఉండి కూడా భోగాలను అనుభవించలేక ఇబ్బంది పడతారు. ఊహించినదానికంటే ధనవ్యయం ఎక్కువవుతుంది. ఈ వారంలో వీరే కష్టనష్టాల్ని ఎక్కువగా చవి చూస్తారు. ఉదర రోగ పీడితుల వుతారు. వారం మధ్య నుండి సమయానికి ధనము మనుష్య సహకారము అందక అవమానం పడతారు. వీరికి ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తులు కరువవుతారు. అర్ధాష్టమ శని ప్రభావము చంద్రుడు కలిసే సమయంలో వీళ్లు ఇంకా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.కోర్టు వ్యవహారాలలో అనుకూలత లేదు. చిత్త మూడు నాలుగు పాదాల వారికి క్షేమ తార అయ్యింది శుభ ఫలితాలున్నాయి. స్వాతీ నక్షత్రం వారికి విపత్తార అయింది ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కోవాల్సివస్తుంది. విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారికి సంపత్ తారైంది మంచి ఫలితాలు చవి చూస్తారు.

పరిహారం : వీరికి దుర్గాదేవి సప్త శతి గాని లేదా ఖడ్గమాలా పారాయణం గానీ మంచి ఫలితాలను ఇస్తాయి.

వృశ్చిక రాశి :- ఈ రాశివారికి చంద్రుడు నీచ పొందడం వల్ల మానసిక ఆందోళన ఎక్కువవుతుంది. ఖరీదైన వస్తువులను పోగొట్టుకునే అవకాశముంది. విద్య చేతగాని ధనం చేతగాని అవమానాన్ని పొందాల్సి వస్తుంది. మీకు రావాల్సిన బాకీలు ఈవారంలో వాయిదా పడతాయి. మీకంటే మీ శత్రువులే విజయాన్ని చవి చూస్తారు. కుటుంబ సౌఖ్యము భోజన సౌఖ్యము ఉన్నాయి. ఆదాయ వ్యయములు ఈ వారంలో సరి తూగుతాయి. కంటికి సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిద్రలేమి అసహనం మిమ్మల్ని మరింత కుంగదీస్తాయి. సహజంగా ఉండే మీ శక్తి మీకు కాకుండా ఇతరుల కింద ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడుతుంది. విశాఖ నాలుగో పాదం వారికి సంపత్తారైంది శుభ ఫలితాల్ని పొందుతారు. అనూరాధవారికి జన్మ తారైంది కోపాన్ని జయించాల్సిన అవసరం ఉంటుంది. జ్యేష్టా నక్షత్ర జాతకులకు పరమ మిత్ర తారైంది. రోగ సూచన ఉన్నది.

పరిహారం: ఆంజనేయస్వామికి తమలపాకులతో అర్చన చేసిన మంచి ఫలితాలని పొందగలుగుతారు.

ధనూరాశి : ఈ రాశి వారికి గ్రహస్థితి చాల ప్రతికూలంగా పనిచేస్తుంది. స్థాన చలనం కనిపిస్తోంది. అనేక రకాలుగా బంధుమిత్రుల సహకారంతో విపత్తు ల్లోంచి బయటపడే అవకాశం ఉంది. నాకేం జరగబోతోంది ఎవరెవరు ఇబ్బంది పెడతున్నారు సంపాదన ఎలా అవుతుంది మరి ఖర్చులు ఎక్కువైపోతున్నాయి అనే ఆలోచన ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. శత్రు వర్గాల ద్వారా వీళ్లు చాలా అవమానాల్ని ఎదుర్కొంటారు. గ్రహ స్థితిలో ముఖ్యంగా సప్తమ రాహు కారణంగా వీరి మాటలే వీరికి శత్రువులుగా మారిపోయి ఇబ్బందిని కోరి తెచ్చుకున్నట్టుగా అయిపోతుంటుంది. దీన్ని అధిగమించడానికి కాస్త వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం ఈ వారంలో చాలా అవసరం. మూలా నక్షత్ర జాతకులకు మిత్ర తారైంది కాబట్టి శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు నైధన తార అయ్యింది అంచేత వాళ్లకు వ్యతి రిక్త ఫలితాలుమార్పులు కనిపిస్తాయి. ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి మాత్రము సాధన తారైంది కాబట్టి ఫలితాలు శుభప్రదంగా ఉండబోతుంది.

పరిహారం :- గురువారం నియమాన్ని పాటించండి దత్తాత్రేయ జపం గాని సరస్వతీదేవి ప్రార్థన గాని చాలా మార్పు తెస్తాయి .

మకర రాశి : ఈరాశి వారికి స్త్రీ సౌఖ్యంతో వారం ప్రారంభం కాబోతోంది. వీరికి అనుకోకుండా సంపదలు చక్కనైన భోజనము కుటుంబ సౌఖ్యము ఉంటాయి. ధనవ్యయం తప్పదు. అలంకార ప్రాప్తి కూడా ఈ వారంలో వీరికి ఉంది. వీరికి వ్యయం ఎక్కువగా కనిపిస్తోంది. చిన్న ఆపదను ఎదుర్కొంటారు దాన్నించి బయట పడ్డానికి కొంత ధనం వ్యయం కూడా చేయవలసి వస్తుంది. అనుమానాస్పద రీతిలో వీళ్లు తమను తామే తప్పు చేసామా అని వెనక్కి తిరిగి చూసుకునే స్థితి ఉంది. పన్నెండు ఇంట్లో కుజుడు దారుణమైన కష్టాన్ని సంప్రాప్తం చేస్తాడు. గురుడు కూడా సమయానికి సహకరించకపోవడం వల్ల ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మొత్తం మీద వీరికి ఈ వారం శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారికి నైధన తార అయ్యింది కాబట్టి పూర్తి వ్యతిరేక ఫలితాలున్నాయి. శ్రవణ నక్షత్రం వాళ్లకి సాధన తారైంది కొద్దిపాటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ధనిష్ఠ ఒకటి రెండు పాదాల వారికి ప్రత్యక్ తారైంది కాబట్టి కొంచెం దుష్ట ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి.

పరిహారం :- శనికి తైలాభిషేకాలు గానీ నువ్వుల దానం గాని చేయించండి అవకాశం ఉంటే నువ్వులు బెల్లం తింటే కూడా చాలా మంచిది.

కుంభ రాశి: ఈ రాశి వారికి సంతోషంతో ఈ వారం ప్రారంభం ఔతుంది. ఆకస్మిక ధనలాభం ఉంది . వ్యయ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా వీరికి శుభ ఫలితాలు కనిపిస్తుందన్న చిన్న సమస్యల్ని వీరు పరిష్కరించుకుని లాభసాటి ఉద్యోగ వ్యవహార వ్యాపారాల్లో ముందుకు పోగలుగుతారు. ఊహించనంత ధనలాభం ఉంది. అలాగే అంత ధన నష్టం కూడా ఉంది. కష్టపడిన దానికి ఫలితం రాలేదని బాధపడతారు గానీ వేరొక రకంగా మంచి సమయంలో ఈ ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. వాహనము సౌఖ్యం భోజనము కుటుంబ సౌఖ్యము ఇవన్నీ కూడా వీరికి ఈ వారంలో కానవస్తూ ఉన్నాయి. ధనిష్ఠ మూడు నాలుగు పాదాల వారికి క్షేమ తారైంది చక్కని ఫలితాలు ఉన్నాయి. శతభిషం వారికి విపత్తార అయింది సమస్యల్ని ఎదుర్కోక తప్పదు. పూర్వాభాద్ర ఒకట్రెండు మూడు పాదాల వారికి క్షేమ తారైంది కాబట్టి ఫలితాలు మంచిగా ఉన్నాయి.

పరిహారం : ఈ రాశి వారు బెల్లము నువ్వులు తోటకూర ఆవుకు తినిపించండి ఇంకా శివునికి అభిషేకం చేయించండి నువ్వులు దానం చేయండి.

మీన రాశి :- ఈ రాశివారికి అలంకార ప్రాప్తి ఈవారంలో ఉంది. కుటుంబ సౌఖ్యం పిల్లలతోనూ భార్య తరపు బంధువులతో హాయిగా ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. విశేష ధన లాభాన్ని అనుకోకుండా పొందగలుగుతారు. చాలా సంతోషకరమైన వార్తలు విని వీరు తృప్తి చెందుతారు. ఒకానొక సమయంలో వీరికి అధికారులనుండి గానీ కుటుంబ పెద్దల నుండి గానీ హెచ్చరికలు పొందుతారు. కుటుంబం కోసం ధనవ్యయము చేస్తారు. శ్రమ ఎక్కువ పడతారు. దానికి తగిన లాభం ఉంటుంది. గానీ ఒకానొక సమయంలో తానున్న స్థాయిని మించి పనిచేసి లబ్ధిని పొందగలుగుతూ అదే సమయంలో చతుర్థంలో ఉన్నటువంటి రాహు ప్రభావంచేత చిన్న గౌరవ భంగం పొందవచ్చు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం అనిపిస్తుంది. పూర్వాభద్ర నాలుగవ పాదం వారికి క్షేమ తారైంది చాలా బావుంది. ఉత్తరాభాద్ర వారికి జన్మ తారైంది ఆరోగ్య విషయంలోనూ కుటుంబ విషయంలో జాగ్రత్త తీసుకోండి. రేవతి వారికి పరమ మిత్ర తారైంది కాబట్టి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.

పరిహారం :- మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించితే బావుంటుంది సరస్వతీ సూక్తం చాలా మేలు చేస్తుంది.

Next Story