మేష రాశి :

ఈ రాశివారికి యోగ కారకులైన రవి మంచి స్థానాన్ని పొందాడు. ఆరోగ్యము, భాగ్యాన్ని కూడా ఇవ్వనున్నాడు.  పితృ కారకుడు కూడా అవడం, విశేషించి కేంద్రస్థానంలో ఉండటం చేత పిల్లలు ఆరోగ్యము సంపద కలిగించనున్నాడు. ఈ రాశివారికి కుజుడు యోగించనున్నాడు. శని ప్రభావం మాత్రమే వీరిపై పనిచేస్తున్నది. చంద్రుడు మూడు రోజుల పాటు నీచని పొందుతున్నాడు గనుక మనో ధైర్యము తక్కువ అవుతుంది. కానీ కుజ, చంద్రుల  కలయిక వల్ల స్థిరత్వం కుదురుతుంది ముందుకి సాగిపోతారు. గురుడు కూడా వీరికి యోగిస్తారు గాబట్టి మంచి ఫలితాలనే పొందుతారని చెప్పొచ్చు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మంచి విలువలు ఏర్పడతాయి. ఆర్థికంగా కూడా ఉత్తమ ఫలితాన్ని పొందగలుగుతారు. అశ్వని నక్షత్ర జాతకులకు నైధన తార అయ్యింది గావున ఫలితములు తక్కువగా ఉన్నాయి. భరణి వారికి సాధన తారతో వారం ప్రారంభం కాబట్టి శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. కృత్తిక  ఒకటో పాదం వారికి మాత్రం శుభఫలితాలు తక్కువగా ఉన్నాయి.

పరిహారం: ఈ రాశివారు  సోమవారం నాడు ఏకాదశి గావున విష్టు సహస్రనామ  పారాయణం, మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని పూజించిన సత్ఫలితాలు పొందగలుగుతారు.

వృషభ రాశి :

ఈ రాశివారికి శని బుధ శుక్రులు యోగ కారకులు కావడం వల్ల ఈ వారంలో చాలా మంచి ఫలితాలు పొందనున్నారు. ఇరవై నాలుగో తేదీ నుండి శని మకరంలో కి ప్రవేశిస్తాడు కాబట్టి శుభ సూచనలు కనపడుతున్నవి. శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉండటం కూడా ఉపయుక్తంగా మారనున్నది. అలాగే బుధుడు కూడా యోగించనున్నాడు. రవి మాత్రం మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమంటూ హెచ్చరిస్తున్నాడు. అలాగే సప్తమ స్థానాధిపతి కుజుడు వ్యయాధిపతి కూడా కావడంతో వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాడు. అతి కొద్ది రోజుల్లో మీ అష్టమశని దోషం పోయి మీకు శుభ ఫలితాలు రానున్నాయి.చాలా పనులు ఈ వారంలో అనుకూలంగా మారనున్నాయి. కృతిక రెండు, మూడు పాదాలు వారికి శుభ ఫలితాలు తక్కువగా. రోహిణి వారికి క్షేమ తార కాబట్టి శుభ ఫలితాలు ఎక్కువ. మృగశిర ఒకట్రెండు పాదాలు వారికి కూడా విపత్తార యింది కాబట్టి జాగ్రత్తగా ఉండటం అవసరం.

పరిహారం: ఈ రాశి వారికి రవి ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి సూర్య నమస్కారాలు చేయండి. అలాగే కుజునికి జపము లేదా ఖడ్గమాల పారాయణ చేస్యడం మంచిది చంద్ర స్థితి కూడా బాగులేదు వీలైతే పెరుగు, వెండి  దానం చేయండి.

మిథున రాశి :

ఈ రాశివారికి యోగ్యమైన కాలం ఇంతవరకు  నడిచింది. అయితే అష్టమ శని ప్రారంభం కానున్నది కాబట్టి వీరికి ప్రతికూలతలు ప్రారంభం కానున్నాయి. కనిపించని,  ఊహించని సమస్యలు ఎదురుకానున్నాయి. తల్లితండ్రి  ఆరోగ్యాలు,  కుటుంబ వ్యవహారాలు ఒకదానికొకటి ముడిపడి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మీ ఆలోచనలు కూడా సరిగా ఉండకపోవటం దీనికొక పెద్ద కారణమవుతుంది. అలా జరగడానికి బుధుని వ్యతిరేకతే కారణం. వారమంతా ప్రతికూలతలు ఉన్నాయి. కుజుడు ప్రతికూలత కారణంగా మీకు శరీరంలో ఎడమ భాగం ఇబ్బంది పడే అవకాశముంది. మానసికమైనటువంటి దౌర్బల్యం కూడా కలగనున్నది.  మృగశిర నక్షత్రం వారికి విపత్తార తో వారం ప్రారంభం గనుక ప్రతికూలత లెక్కువ. ఆరుద్ర వారికి సంపత్తార తో ప్రారంభం గనుక ఆర్థిక లాభాన్ని పొందుతారు. పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు వారికి జన్మతార కావున ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.

పరిహారం: రాశివారికి బుధవారం నియమాలు,  విష్ణుసహస్రనామ పారాయణ,  గురు చరిత్ర పారాయణ సత్ ఫలితాలు ఇస్తాయి.

కర్కాటక రాశి:

ఈ రాశివారికి ఐదుగురు శుభులు మేలు చేసే స్థానాల్లో ఉన్నారు. అయితే తాత్కాలికంగా చిన్నచిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నా  ఇరవై నాలుగో తేదీ లోగా  ఒక మంచి మార్గాన్ని వెతుక్కోగలుగుతారు. వ్యవహార లావాదేవీలు బావుంటాయి. వాక్కు స్థిరపడుతుంది. కానీ అష్టమ శుక్రుడు వల్ల మాట తడబాటు వచ్చి వ్యవహారాల్లో చిన్న ఆటంకం ఏర్పడొచ్చు. అందువల్ల  కొంచెం ఆచి తూచి మాట్లాడటం చాలా అవసరం. మిత్ర స్థానాధిపతి కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు గనుక వారి ద్వారా పనులను నెరవేర్చుకునే ప్రయత్నం చేయండి. మీకంటూ ఒక ప్రత్యేక అభిరుచులు అభిప్రాయాలున్నాయి వాటిని వీరు ఈ వారంలో పరిపూర్ణంగా పొందగలుగుతారు. ఈ రాశివారికి చంద్రుడు నీచలో నుండి ఉచ్చ  వైపు ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి మానసికమైనటువంటి ధైర్య స్థైర్యాలను ఇస్తాడు. పునర్వసు ఒకటో పాదం వారికి జన్మ తారతో వారప్రారంభం గనుక సామాన్య ఫలితాల్ని, పుష్యమి వారికి పరమమిత్రతార అయ్యింది కావున ఫలితాలు బాగుంటాయి. ఆశ్రేష వారు విశేష ఫలితాన్ని ఈవారంలో పొందగలుగుతారు.

పరిహారం: వీలైనంత వరకు గురువారం నియమాన్ని పాటించండి. ఆరోజు వీలైతే తెల్ల ఆవాలు, బెల్లం కలిపి ఆవుకు తినిపిస్తే గురు అనుగ్రహం పొందగలుగుతారు.

సింహరాశి:

ఈ రాశివారికి శుభప్రదమైన వారంగా చెప్పొచ్చు. రవి షష్ఠ  స్థానంలో ఉండి మేలును చేకూరుస్తాడు. కుజుడు కూడా యోగించి మీ పనులను మధ్యవర్తుల ద్వారా చక్కబెడతాడు. అనుకోకుండా అనేకమంది సహకరించి మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకు వెళతారు. కానీ మానసిక ఆందోళన మాత్రము తప్పదు. కుటుంబ వ్యవహారాల్లో మీరు పూర్తి వ్యతిరేకతని పొందుతారు. శని మారకుడుగా  ఉన్నాడు గనుక ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. దూరప్రయాణాలు తగ్గించండి. లేనిపోని ఆందోళనలో చొరబడకుండా జాగ్రత్త వహించండి. మఖ నక్షత్రం వారికి నైధన తారతో వార ప్రారంభం గనుక పూర్తి వ్యతిరేక ఫలితాలున్నాయి. పుబ్బ నక్షత్ర జాతకులకు సాధన తారతో వారం ప్రారంభం సత్ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తర ఒకటో పాదం వారికి ఫలితం తక్కువనే చెప్పాలి.

పరిహారం: సూర్యనమస్కారాలు చేయడం,  ఆదిత్య హృదయం చదవడం చాలా అవసరం. మానసిక ప్రశాంతత  పొందడానికి యోగ సాధన,  ధ్యానం బాగా పనికొస్తుంది.

కన్యా రాశి:

ఈ రాశివారికి శుభ ఫలితాలు ఇరవై నాలుగో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వీరికి నాలుగు గ్రహాలు అనుకూల స్థానాల్లో ఉన్నాయి. వారి ద్వారా సాధనం కార్య సాధనం అన్నట్లుగా ప్రతి పనీ సత్ఫలితాన్ని ఇస్తూ ముందుకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. వాక్కు స్థానాధిపతి బాగుండటం వల్ల మీ మాటకు మంచి విలువ లభిస్తుంది. అయితే  వాక్ స్థాన అధిపతి కుజుడు తృతీయ మందు ఉండడం వల్ల మాట పట్టింపులు వ్యతిరేక భావాలు ఇవన్నీ కూడా కలుగనున్నాయి.  అన్నదమ్ములతో సఖ్యత పెరుగుతుంది. వారికి ఏదైనా మేలు చేయాలనే ఆలోచన మీ కలుగుతుంది అర్ధాష్టమ శని ప్రభావం తగ్గుముఖం పడుతోంది.  ఆధిపత్య పాపి  అయిన గురుడు చతుర్థంలో ఉండడం వల్ల మీకు కొన్ని ప్రతికూల శక్తులు ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి.  వీటివల్ల మీలో మనోధైర్యం తగ్గుతుంది.  ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారికి ప్రత్యక్ తార గనుక శుభ ఫలితాలు తక్కువ.  హస్తానికి క్షేమ తారయింది గనుక ఈవారం బావుంటుందని చెప్పొచ్చు.  చిత్త ఒకట్రెండు పాదాల వారికి వ్యతిరేక ఫలితాలు కొంచె ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం: ఖడ్గమాల పారాయణ చేయండి శుభ ఫలితాలను పొందగలుగుతారు.

తులా రాశి:

ఈ రాశివారికి యోగ కారకుడైనటువంటి శని అర్ధాష్టమం  లోకి ప్రవేశిస్తున్నాడు గనుక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అయినా బుధ గురులు యోగించి వీరిని ఉన్నత స్థితికి తీసుకొస్తారు. శని ప్రభావం ఆరు మాసాల వరకు మీపై పెద్దగా ఉండకపోవచ్చు. అయినా జాగ్రత్త వహించడం మీ కర్తవ్యం. ద్వితీయ సప్తమ అధిపతి అయిన కుజుడు ద్వితీయ మందే ఉండటం వల్ల కచ్చితంగా మీ శరీరంలో ఎడమ భాగంలో,  నేత్ర స్థానానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. చిత్త చాంచల్యము, మనోవ్యాకులత ఈ వారంలో చవిచూడనున్నారు. శుక్రుడు యోగ కారకుడు గాన శుభఫలితాలు కలుగనున్నాయి. అయితే కోర్టు వ్యవహారాల్లో గానీ, ఉద్యోగ విషయాల్లో గానీ జాగ్రత్త వహించాలి. చిత్త మూడు నాలుగు పాదాల వారు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. స్వాతి వారికి సంపత్తార తో వారం ప్రారంభమైంది కావున శుభ ఫలితాలు చాలా ఎక్కువ. విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వారికి జన్మతార తో వారం ప్రారంభం కాబట్టి శరీరమునందు వేడి వ్యాకులత తప్పవు.

పరిహారం: రాశ్యాధిపతి శుక్రుడికి జపం చేయడం గానీ, బొబ్బర్లు దానం చేయడం గానీ శుభ ఫలితాల్ని ఇస్తాయి. సూర్య నమస్కారాలు చేయండి మానసిక ప్రశాంతత లభిస్తుంది.

వృశ్చిక రాశి:

ఈ రాశికి ఇంతవరకూ ఉన్న ఏల్నాటి శని ప్రభావం ఇరవై నాలుగో తేదీతో పరిహారం కాబోతోంది. ఎక్కువ శుభ ఫలితాలని కూడా పొందనున్నారు. ద్వితీయ ముందున్నప్పటికీ గురుడు మేలే చేయనున్నాడు. లగ్నంలో వున్న కుజుడు చంద్రుడు కూడా మీకు మానసిక ప్రశాంతత నివ్వడమే కాదు అనేక సమస్యలకు పరిష్కారాన్ని కూడా ఇవ్వనున్నారు. శుక్రుడు పాపి అయి  ఉన్నాడు కాబట్టి వ్యవస్థలో చిన్న చిన్న మాట పట్టింపులు ఉంటాయి వాటి అధిగమించడానికి మిమ్మల్ని మీరు నిగ్రహించుకోండి. యోగ ప్రియుడైన రవికి జపం చేయడం గానీ సూర్యనమస్కారాలు చేయడం గానీ ఆరోగ్యాన్ని వ్వడమే కాదు మంచి ధైర్య స్థైర్యాన్ని కూడా ఇస్తుంది. విశాఖ నాల్గవ పాదం వారికి జన్మతార గాన సామాన్య ఫలితాలుంటాయి. అనూరాధ వారికి పరమమిత్రతార అయింది కాబట్టి మాధ్యమ ఫలితాలుంటాయి. జ్యేష్ఠ వారికి శుభ ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం: మీకు గురుడు యోగించాలి అంటే గురు చరిత్ర పారాయణ లేదా దక్షిణామూర్తి స్తోత్రము లేదా  సుందరకాండ పారాయణ మంచి ఫలితాలను ఇస్తాయి.

ధనుస్సు రాశి :

ఈ రాశివారికి గురుడు యోగించవలసిందే కానీ ద్వితీయ మందు ఉండటం వల్ల మాట నిలకడ కొద్దిగా త తగ్గుతుంది. అంతేకాదు ఏలినాటి శని తన స్థానాన్ని విడిచి ధన స్థానంలో వెళ్లింది కనుక అన్ని రకాలుగా వ్యయం ఉంటుంది. శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా కొంచెం వ్యతిరిక్తత  ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్యం, బుద్ధికుశలత తగ్గుతాయి. వ్యవహార జ్ఞానం కూడా తగ్గుతుంది. యోగించిన కుజుడు వ్యయమందు ఉండడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగానే ఉంది. వీరికి చంద్రుడు మాత్రమే లాభాన్ని చేకూర్చ గలడు. మానసిక ధైర్యాన్ని గనుక కలిగి ఉంటే ముందుకు సాగిపోగలరు. మూలా నక్షత్ర జాతకులకు ప్రతికూలతలు ఎక్కువ. పూర్వాషాఢ వారికి సాధన తారతో వారం ప్రారంభం గనుక శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరాషాడ ఒకటో పాదం వారికి ప్రత్యుత్తరం వారం ప్రారంభం కనుక ఫలితాలు సామాన్యంగా ఉంటాయి.

పరిహారం: ఈ రాశ్యాధిపతి గురుడు గనుక దక్షిణామూర్తి స్తోత్రం జరపండి లేదా శివకేశవులకు స్తోత్రాన్ని పట్టిం పఠించండి శుభ ఫలితాల్ని పొందుతారు. శనికి జపం చేయడం మరిచిపోవద్దు.

మకర రాశి:

ఈ రాశివారికి శని ఆధిపత్య శుభుడైయున్నాడు కొద్ది రోజుల్లో స్వక్షేత్రంలో రాబోతున్నాడు గనుక వారమంతా పట్టిందల్లా బంగారం లాగా అనిపిస్తుంది. అలాగే కుటుంబ వ్యవహారం బావుంటుంది. మాటకి విలువ లభిస్తుంది. ఇంట్లో కల్యాణ పరమైనటువంటి పనులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.. కానీ తను స్థానంలో శని గనక శారీరిక అనారోగ్యం కుంగదీస్తుంది.. శరీరంలో ఏదో ఒక భాగానికి ఇబ్బంది కలిగే అవకాశం కూడా లేకపోలేదు. మానసిక ఆందోళనలు యధాతథంగానే ఉంటాయి. ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారికి ఫలితాలు చాలా తక్కువ. శ్రవణ నక్షత్రం వారికి క్షేమ తారతో వారం ప్రారంభం గనుక శుభ ఫలితాలని చాలా ఎక్కువగా పొందగలుగుతారు. ధనిష్ఠ ఒకటి రెండు పాదాల వారికి విపత్తారతో వారం ప్రారంభం కాబట్టి శుభ ఫలితాలు చాలా తక్కువ.

పరిహారం: శని ప్రభావం పోవడానికి శనికి జపం  చేయించండి లేదా తరువులు దానం చేయండి.  నివారం నియమాన్ని పాటించండి విష్ణు స్తోత్రము శివస్తోత్రం ప్రశాంతత చేకూరుస్తాయి.

కుంభ రాశి:

ఈ రాశివారికి శని శుక్ర బుధులు సాధారణ శుభులే.  విశేషంగా యోగించేవారు ఈ రాశికి ఎవరూ లేరు ప్రస్తుతా కి ఏలినాటి శని అనగా వ్యయ స్థానమందు శని ప్రారంభం గనుక వీరికి ఆర్థికంగా సామాజికంగా ఇబ్బందులు రానున్నాయి. ధైర్య స్థైర్యాలను కోల్పోతారు. శుక్రుడు కుంభరాశిలో ఉన్నందువల్ల మాత్రమే శుభ ఫలితాలు ఎక్కువగా చూడనున్నారు. నాలుగు గ్రహాలు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ఆందోళనలు ఎక్కువ అవుతాయి. సమయానికి విషయం గుర్తు రాకపోవడం లేదా ఏదైనా  విలువైన వస్తువుని పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. ఎవరిని నమ్మినా వారి వల్ల మీకు ప్రయోజనం శూన్యమనే చెప్పాలి. ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు వారికి శుభఫలితాలు చాలా తక్కువ. శతభిషా నక్షత్రం వారికి సంపత్తార తో వారం ప్రారంభం కావున మంచి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు వారికి అను జన్మతార కాబట్టి వీరికి ఫలితాలు తక్కువ.

పరిహారం:ఈ రాశివారు లలితా సహస్రనామ పారాయణ చేసినా, ఖడ్గమాల పారాయణ చేసిన ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. శనికి నువ్వులు  దానం చేయడం మంచిది.

మీన రాశి :

ఈ రాశివారికి శుభులైన కుజ చంద్రుడు బాగున్నారు. కుజుడు స్వస్థలాన్ని పొందడం వల్ల చాలాకాలంగా ఆగిపోయిన పనులు నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యయమందు ఉన్న శుక్రుని వల్ల కించిత్ దోషం ఉన్నప్పటికీ రవి తాలూక ప్రభావం చేత మీరు ఆధిపత్యాన్ని పొందగలుగుతారు. మంచి మంచి స్థానాన్ని పొందగలుగుతారు. ఉద్యోగ లాభం, ధనలాభం కూడా ఉన్నాయి. మీరు ప్రయత్నిస్తే చాలు ఈ వారంలో మీ పనులు చాలావరకు సమకూరి పోతాయి. ఈ రాశివారికి అష్టమధిపతి కుజుడు అవడం వల్ల కుటుంబ వ్యవహారాలు దెబ్బతినే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు కూడా ముందుకు సాగకపోవచ్చు. ఒకటి రెండు వ్యవహారాల్లో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. ఈ వారం వీరికి సమ ఫలితాన్ని ఇవ్వబోతోంది. ప్రయత్నిస్తే మాత్రం మంచి ఫలితాలు పొందగలుగుతారు. పూర్వాభాద్ర నాలుగో పాదం వారికి అను జన్మ తారైంది కాబట్టి దేహ తాపం తప్పదు. ఉత్తరాభాద్ర వారికి పరమమిత్రతార యింది గనక మధ్యమ ఫలితా లుంటాయి రేవతి నక్షత్రం వారికి మిత్ర తారైంది కాబట్టి శుభ ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం : మీరు శుక్రునికి జపము, బొబ్బర్లు దానం చేయించండి. శనికి కూడా జపం చేయించండి. పురుష సూక్త పారాయణ లేదా విష్ణు సహస్ర నామ పారాయణ శుభ ఫలితాలని ఇస్తాయి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.