రికార్డులకు ఎక్కని రికార్డ్.. ఎవరికి తెలియని రికార్డ్

By Newsmeter.Network  Published on  20 Feb 2020 1:55 PM GMT
రికార్డులకు ఎక్కని రికార్డ్.. ఎవరికి తెలియని రికార్డ్

సాధారణంగా ఒక ఓవర్‌లో ఎన్ని పరుగులు చేయొచ్చు.. అంటే ఎవరైనా చెప్పే సమాధానం 36 పరుగులు. బౌలర్‌ నోబాల్, వైడ్లు వేసినా.. ఇంకా ఆరు లేదా ఏడు పరుగులు కలుపుకుని ఓ 42 పరుగులు రావచ్చు అని క్రికెట్‌ పై కాస్త పరిజ్ఞానం ఉన్నవాళ్లు చెబుతారు. మరీ ఒక ఓవర్‌లో 77 పరుగులు వస్తే.. ఛా.. అలా జరగదు. అంటారా.. నిజం అండి బాబూ.. అయితే ఓ సారి ఇది చదవండి..

1990 ఫిబ్రవరి 20న న్యూజిలాండ్‌లోని ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. వెల్లింగ్టన్‌, కాంటర్‌బరీ జట్ల మధ్య ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతోంది. ఆ సీజన్‌లో వెల్లింగ్టన్‌కు అదే చివరి మ్యాచ్‌‌. టైటిల్‌ సాధించాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి. చివరి రోజు కావడంతో రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు.. కాంటర్‌బరీకి 59 ఓవర్లలో 291 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 108 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలబడింది కాంటర్‌బరీ జట్టు. ఎల్‌కే జర్మన్‌(160 నాటౌట్‌), రోజర్‌ ఫోర్డ్‌(14 నాటౌట్‌) పట్టు వదలని విక్రమార్కుల్లా పోరాడారు. దీంతో 196/8 చేరుకుంది ఆ జట్టు స్కోరు. ఇక మిగిలింది కేవలం 2 ఓవర్లు మాత్రమే.. విజయానికి 95 అవసరం.

ఈ దశలో వాళ్లన్ని ఆలౌట్‌ చేయడానికి వెల్లింగ్టన్‌ కెప్టెన్‌ మెక్‌ స్వీనే ఓ పథకం పన్నాడు. బంతిని బెర్ట్‌వాన్స్‌ అనే బ్యాట్స్‌మన్‌ చేతికిచ్చాడు. ఈ ఓవర్‌లో ఎక్కువ పరుగులిచ్చి ప్రత్యర్థి జట్టును విజయానికి చేరువ చేస్తే అప్పుడు బ్యాట్స్‌మెన్‌ తొందరపడి వికెట్లు కోల్పోతారనేది అతడి ఆలోచన.

అయితే జర్మన్‌.. ఆ ఓవర్‌కు ముందు 75 పరుగులతో ఆడుతుండగా.. బెర్ట్‌వాన్స్‌ బంతిని తీసుకొని 17 నోబాల్స్‌ వేయగా.. ఆ ఓవర్‌ మొత్తంలో 22 బంతులేశాడు. అంపైర్‌ ఒక బంతిని లెక్కించడంలో పొరపాటు పడటం గమనార్హం. జర్మన్‌ శతకంతో చెలరేగి ఎనిమిది సిక్సులు, ఐదు ఫోర్లు బాదాడు. దీంతో ఈ ఓవర్‌లో మొత్తం 77 పరుగులొచ్చాయి. చివరి ఓవర్‌లో కాంటర్‌బరీకి 18 పరుగులు అవసరమయ్యాయి. ఇవాన్‌ గ్రే వేసిన ఆ ఓవర్‌లో జర్మన్‌ 5 బంతుల్లో 17 పరుగులు చేశాడు. చివరి బంతికి సింగిల్‌ తీస్తే ఆ జట్టు విజయం సాధిస్తుంది. అయితే, రోజర్‌ ఫోర్డ్‌ ఆడిన ఆ బంతిని అడ్డుకోవడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

One Over 77 Runs

వెల్లింగ్టన్‌ కెప్టెన్‌ వ్యూహం ఫలించకపోయినా ఆ జట్టే విజేతగా నిలవడం విశేషం. ఈ టోర్నీలో మిగతా జట్లు వెల్లింగ్టన్‌ కంటే తక్కువ పాయింట్లు తెచ్చుకోవడంతో అది టైటిల్‌ సాధించింది. కొన్ని కారణాల వల్ల బెర్ట్‌వాన్స్‌ వేసిన ఈ ఓవర్‌ రికార్డులకు ఎక్కకపోవడం గమనార్హం. నేటికి ఈ ఓవర్‌ వేసి 30 సంవత్సరాలు అయ్యింది.

Next Story