సెమీస్‌కు వర్షం ముప్పు.. ఆందోళనలో ఆస్ట్రేలియా.. టీమిండియా పుల్ హ్యాపీ
By Newsmeter.Network
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతన్న మహిళల టీ20 ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. గురువారం జరగనున్న మొదటి సెమీఫైనల్‌లో భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుండగా.. రెండో సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియా జట్టును ఢీకొననుంది. సిడ్ని వేదికగా ఈ రెండు మ్యాచులు జరగనున్నాయి. అయితే.. ప్రస్తుతం సిడ్నీలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే అక్కడ జరగాల్సిన రెండు లీగ్ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఒక వేళ వర్షం కారణంగా మ్యాచ్‌లు రద్దయితే.. అప్పుడు పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన భారత్, దక్షిణాఫ్రికా జట్లు నేరుగా ఫైనల్‌కి వెళతాయి.
వర్షం ముప్పు నేపథ్యంలో.. సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకి రిజర్వ్ డే ఇవ్వాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అభ్యర్థించింది. కానీ.. ఐసీసీ మాత్రం ఆ అభ్యర్థనని తిరస్కరిస్తూ.. షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయబోమని ప్రకటించింది. దీంతో.. సొంతగడ్డపై సెమీస్ మ్యాచ్‌కి ముందే ఆస్ట్రేలియాలో కంగారు మొదలైంది. మరోవైపు లీగ్ దశ పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన భారత్.. మ్యాచ్ రద్దయితే ఫైనల్ చేరనుండటంతో హ్యాపీగా ఉంది. కాగా పైనల్ మ్యాచ్ మార్చి 8వ తేదీన జరగనుంది.
కాగా ఇప్పటి వరకు వరల్డ్‌కప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. గ్రూప్ దశలో నాలుగు మ్యాచ్‌లాడిన భారత్.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లపై విజయం సాధించింది. అదే ఊపులో సెమీస్, ఫైనల్‌లో విజయం సాధించి టైటిల్‌ను గెలవాలని భావిస్తోంది.
ఆ ఓటమి తర్వాతనే ఆలోచించాం..
కాగా భారత మహిళల జట్టు ప్రదర్శన పట్ల కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా భారత ఓపెనర్ షెఫాలీ వర్మపై ప్రశంసల జల్లు కురిపించింది. ఇతరుల ఒత్తిడిని షెపాలీ తొలగిస్తుందని, ఎల్లప్పుడూ జట్టు కోసం ఆడడానికి ప్రయత్నిస్తుందని తెలిపింది. అలాంటి ప్లేయర్ ఉండాలని ప్రతి జట్టు కోరుకుంటుంది. దేశం కోసం ఆడాలనుకునేవారు ఉత్తమ ప్రదర్శన చేయడానికే ఎల్లప్పుడూ ప్రయత్నిస్తారు. జట్టు కోసం పోరాడటాన్ని షెఫాలీ ఎంతో ఆస్వాదిస్తుందని వెల్లడించింది.
మేం ఎంతో కాలం నుంచి కలిసి ఆడుతున్నాం. ఇతరుల దగ్గర నుంచి కూడా క్రికెట్ నేర్చుకుంటున్నాం. అందుకే జట్టుగా రాణిస్తున్నాం. అయితే వ్యక్తిగత ఉత్తర ప్రదర్శనలు చేయడానికి ప్రయత్నించాలి. గత సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి చవిచూశాక సమిష్టిగా సత్తాచాటాలని నిర్ణయించుకున్నాం. అందుకే ఇప్పుడు జట్టు విజయాలు సాధిస్తున్నాం. మేం కేవలం ఒకరు లేదా ఇద్దరు ఆటగాళ్లపై ఆధారపడట్లేదు. గతం గురించి కాకుండా ప్రస్తుతం గురించే ఆలోచిస్తున్నాం. జట్టుగా మరిన్ని విజయాలు సాధిస్తామని ఆశిస్తున్నానని తెలిపింది. 2018లో ఇంగ్లాండ్‌తోనే సెమీస్ జరగగా టీమిండియా ఓటమి చవిచూసింది.