నిర్భయను అత్యాచారం చేసినపుడు ఆ హక్కులు గుర్తులేవా ?

By రాణి  Published on  12 Dec 2019 5:21 AM GMT
నిర్భయను అత్యాచారం చేసినపుడు ఆ హక్కులు గుర్తులేవా ?

న్యూ ఢిల్లి : కదిలే బస్సులో నా కూతురిపై మృగాల్లా పడినపుడు మానవ హక్కులు గుర్తులేవా ? అని నిర్భయ తల్లి ప్రశ్నించారు. 2012 సంవత్సరం డిసెంబర్ నెలలో ఢిల్లీలో కదులుతున్న బస్సులో జరిగిన నిర్భయ అత్యాచార ఉదంతం అప్పట్లో సంచలనం రేపింది. నిర్భయ అత్యాచార నిందితుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ తనకు క్షమాభిక్ష పెట్టి ఉరిశిక్షను ఆపాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ లో వేదాలు, పురాణాలు, ఉపనిషత్తుల్లో ఉన్న అంశాల గురించి అక్షయ్ ప్రస్తావించడంపై నిర్భయ తల్లి నిప్పులు చెరిగారు. నా కూతురిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమె మరణానికి కారణమైన వారికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది కానీ మాకైతే మానవ హక్కులంటూ కారణాలు చెప్తారంటూ మండిపడ్డారు. తప్పు చేసినవాడికి శిక్ష సరిగా అమలు చేయకుండా బాధితులకు మాత్రం అన్ని నిబంధనలు ఎందుకు చూపిస్తారంటూ కన్నీటిపర్యంతమయ్యారు. డిసెంబర్ 16వ తేదీన ఆ మృగాలకు ఉరి శిక్ష అమలు చేసి తీరాలని ఆమె డిమాండ్ చేశారు.

తెలంగాణలో దిశ నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత నిర్భయ అత్యాచార నిందితులకు ఢిల్లి కోర్టు ఉరిశిక్ష విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 16 వ తేదీ ఉదయం 5 గంటలకు అంటే మరో నాలుగు రోజుల్లో నిందితులను ఉరితీయాల్సి ఉంది. నిందితుల్లో ఒకరిని ఇప్పటికే తీహార్ జైలుకు పంపారు. అయితే తనకు ఉరిశిక్ష వద్దని, క్షమాభిక్ష పెట్టాల్సిందిగా అక్షయ్ కుమార్ సింగ్ మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. దీనిపై నిర్భయ తల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story
Share it