నిర్భయ శరీరంలోకి ఇనుపరాడ్ చొప్పించి..

By రాణి  Published on  30 Jan 2020 11:09 AM GMT
నిర్భయ శరీరంలోకి ఇనుపరాడ్ చొప్పించి..

ముఖ్యాంశాలు

  • నిర్భయ పట్ల నిర్దయగా ప్రవర్తించిన కామాంధులు
  • కదులుతున్న బస్సులో అత్యాచారం
  • ఇనుప రాడ్ ను ఆమె శరీరంలోకి చొప్పించి పైశాచికానందం
  • నెత్తురోడుతున్నా కనికరించని మృగాళ్లు

నిర్భయ. 2012 డిసెంబర్ 17వ తేదీ తెల్లవారేసరికల్లా దేశ రాజధానితో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేరు అది. అంతా గ్రహించే లోపే ఆమెకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అచేతన స్థితిలో రోడ్డుపై పడి ఉన్న ఆమెను గస్తీ పోలీసులు హుటాహుటిన ఢిల్లిలోని సఫ్దార్ జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స కోసం చేరిన నిర్భయను చూసిన డాక్టర్లకు వెన్నులో వణుకు పుట్టింది. అంత ఘోరంగా ఉన్నాయి ఆమె శరీరంపైన, లోపల ఉన్న గాయాలు. 13 రోజులు మృత్యువుతో పోరాడి ఓడింది నిర్భయ. శరీరంలో మల్టీ ఆర్గాన్ ఫెల్యూర్ వల్ల డిసెంబర్ 29న నిర్భయ తనువు చాలించింది.

కష్టపడినా మెడిసిన్ సీట్ రాలేదు

1989లో ఉత్తర్ ప్రదేశ్ లోని బలియా జిల్లాలో బద్రీనాథ్, ఆశాదేవీలకు జన్మించింది నిర్భయ. తండ్రికి పాలంలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగం రావడంతో వారు కుటుంబంతో సహా ఢిల్లీకి మారారు. 12వ తరగతి వరకూ ఒక ప్రైవేట్ పాఠశాలలో చదివింది. ఆ తర్వాత మెడిసిన్ సీట్ కోసం చాలా కష్టపడింది. కానీ కొన్ని కారణాల చేత నిర్భయకు సీటు రాలేదు. ఎలాగైనా లక్ష్యాన్ని చేరాలనుకున్న నిర్భయ డెహ్రాడూన్ లోని ఫిజియోథెరపి ఇనిస్టిట్యూట్ లో చేరి కోర్సును పూర్తి చేసింది. తిరిగి 2012లో ఆమె ఢిల్లీకి తిరిగి వచ్చి గుర్గావ్ లోని ఒక హాస్పిటల్ లో ఇంటెర్న్ షిప్ కింద ఫిజియోథెరపిస్ట్ గా చేరింది. నిర్భయకు ఒక స్నేహితుడు ఉండేవాడు. అతని పేరు అవింద్ర ప్రతాప్ పాండే (సాఫ్ట్ వేర్ ఇంజినీర్). అంతా సాఫీగా సాగుతుందనుకుంటున్న సమయంలో...ఒక సంఘటన నిర్భయ జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది.

నిర్భయ జీవితాన్ని కబళించిన బస్సు

2012, డిసెంబర్ 16వ తేదీ సాయంత్రం స్నేహితుడు అవింద్ర ప్రతాప్ తో కలిసి ఢిల్లీలోని సాకేత్ థియేటర్ లో “Life of Pi” సినిమా చూసి ఇద్దరూ కలిసి తమ ఇళ్లకు తిరుగుపయనమయ్యారు. వారిద్దరూ ఇంటికి వెళ్లేందుకు ఆటో, రిక్షా కోసం ఎదురు చూస్తున్నారు. రాత్రి 9.30 సమయంలో ఒక ప్రైవేట్ బస్సు రావడంతో ఇద్దరూ కలిసి ఆ బస్సు ఎక్కారు. వారు ఎక్కిన బస్సే ఆమె జీవితాన్ని కబళిస్తుందని అప్పుడామెకి తెలియలేదు. ఆ బస్సులో నిర్భయ, అవింద్ర ప్రతాప్ తో పాటు మరో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. చూడటానికి వారంతా ఢిల్లి స్లమ్ ఏరియాకి చెందిన వారిలా, తాగి ఉన్నట్లుగా అనిపించారు. ఇంతలో బస్సు డ్రైవర్ దారి మళ్లించాడు. దాంతో పాటు బస్సుకు ఉన్న డోర్లకు గట్టిగా గడియపెట్టేశారు. దీంతో అనుమానం వచ్చిన అవింద్ర ఎందుకిలా చేస్తున్నారని బస్సు డ్రైవర్ ను ప్రశ్నించాడు. డ్రైవర్ సహా అందులో ఉన్న ఐదుగురు వ్యక్తులు ఇంత రాత్రి పూట మీకు బయట ఏం పని. ఒంటరిగా తిరుగుతూ ఏం చేస్తున్నారని ఎదురు ప్రశ్నించడం మొదలుపెట్టారు. నిర్భయ పట్ల దురుసుగా ప్రవర్తించారు. అడ్డుకోబోయిన అవింద్ర తలపై ఇనుప రాడ్ తో గట్టిగా కొట్టడంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.

ఇనుపరాడ్ తో చిత్ర హింసలు చేసి..

ఏం చేయాలో తెలియక బిక్కు బిక్కుమంటూ ఉన్న నిర్భయన బస్సు చివరకు ఈడ్చుకెళ్లి అత్యాచారం చేశారు ఆ మానవ మృగాలు. ఎలాగైనా వారినుంచి తప్పించుకోవాలని భావించిన నిర్భయ వారిని కొరికింది. దీంత మరింత రెచ్చిపోయిన కామాంధులు...ఇనుప రాడ్ తో కొట్టి హింసించారు. కర్కశంగా, అత్యంత పాశవికంగా, అమానుషంగా ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశారు. ఆమె ఉదరం, తల నుంచి నెత్తురోడుతున్నా కనీసం కనికరించని మృగాళ్లు ఇనుప రాడ్ ను ఆమె మర్మాంగంలోకి చొచ్చి ఒకరితర్వాత ఒకరు అత్యాచారం చేస్తూనే ఉన్నారు. ఇదంతా ఆ బస్సు కదులుతుండగానే జరిగింది. బస్సును ఒకరి తర్వాత ఒకరు నడుపుతూ...బస్సు డ్రైవర్ తో సహా ఆరుగురు నిర్భయపై అత్యాచారం చేశారు. సుమారు గంటపాటు ఈ హింసాకాండ జరుగుతూనే ఉంది. ఆఖరికి నిర్భయను వివస్ర్తగానే రోడ్డుపైకి విసిరేశారు. అటుగా వెళ్తున్న కొంతమంది రాత్రి 11 గంటల సమయంలో ఆమె ను చూసి గస్తీ నిర్వహించే పోలీసులకు సమాచారమిచ్చారు.

సింగపూర్ ఆస్పత్రికి తరలించాలనుకున్నా...

వివస్త్రగా, అచేతనంగా పడిఉన్న నిర్భయను పోలీసులు హుటాహుటిన స్థానికంగా ఉన్న సఫ్దార్ జంగ్ ఆస్పత్రికి తరలించారు. నిర్భయకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమెకు ఇనుపరాడ్ చొచ్చడంతో ఉదరం, పేగులు, మర్మాగాల్లో తీవ్రంగా గాయాలయ్యాయని పేర్కొన్నారు. అత్యవసర చికిత్స చేసి...వెంటిలేటర్ పై చికిత్స అందించారు. పేగులకు తీవ్రగాయాలు కావడంతో గాంగ్రెనె అనే వ్యాధి సోకకుండా వాటిని తొలగించారు. కేవలం నరాల ద్వారానే నిర్భయకు పోషక, ఔషధాలను ఇచ్చారు. డిసెంబర్ 26న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేక కేబినెట్ మీటింగ్ లో ఆమెను సింగపూర్ లోని మౌంట్ ఎలిజిబెత్ ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించాలని నిర్ణయించారు. మౌంట్ ఎలిజిబెత్ అవయవాలను మార్చేందుకు ఒక ప్రత్యేకత కలిగిన కేంద్రం. కానీ..అప్పటికే నిర్భయ ఆరోగ్యం మరింత విషమించింది. 13 రోజులు మరణంతో పోరాడిన నిర్భయ ఆమె జీవితంతో విధి ఆడిన వింత నాటకంలో ఓడిపోయింది. డిసెంబర్ 29, 2012 ఉదయం 4.45 గంటలకు నిర్భయ మరణించింది.

అత్యాచారం జరిగిన మర్నాడు...

అత్యాచారం జరిగిన మర్నాడు దేశ వ్యాప్తంగా అన్ని న్యూస్ ఛానల్స్ లో నిర్భయ ఉదంతం బ్రేకింగ్ న్యూస్ అయింది. బాధితురాలి పేరును బయటపెట్టకూడదు కాబట్టి ఆమెకు నిర్భయ అని పేరుపెట్టారు. నిందితుల్లో ఒకడు పోలీసులకు దొరకకుండా ఉండేందుకు బస్సును శుభ్రంగా కడిగి ఉంచారు. ముందుగా పోలీసులు నిర్భయ స్నేహితుడిని అనుమానించారు. కానీ..ఆ స్నేహితుడు చెప్పిన ఆధారాలే అసలు నిందితుల్ని పట్టించాయి. ఢిల్లీ వీధుల్లో ఉన్న సీసీ కెమెరాలు అసలు నిందితులను పట్టించాయి. బస్సు డ్రైవర్ రామ్ సింగ్, అతని తమ్ముడు ముఖేష్ సింగ్ లను పోలీసులు రాజస్థాన్ లో అదుపులోకి తీసుకున్నారు. జిమ్ ఇన్స్ర్టక్టర్ వినయ్ శర్మ, పండ్ల వ్యాపారి పవన్ గుప్తాను ఢిల్లీలో, బీహార్ నుంచి ఢిల్లీకి పనికోసం వచ్చిన అక్షయ్ ఠాకూర్ ను బీహార్ లోని ఔరంగాబాద్ లో, మైనర్ బాలుడు రాజును ఉత్తర్ ప్రదేశ్ లో అదుపులోకి తీసుకున్నారు. రామ్ సింగ్ మనోవేదనకు గురై జైలులోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మైనర్ బాలుడైన రాజును జువైనల్ హోం కు తరలించి, ఆ తర్వాత రిలీజ్ చేశారు.Nirbhaya Life Story 2

ప్రస్తుతం తీహార్ జైలులో కాలం వెళ్లదీస్తున్న నలుగురు నిందితులను ఫిబ్రవరి 1వ తేదీన ఉరి తీయనున్నారు. ఆమెను అంత హింసించి అత్యాచారం చేసిన మృగాళ్లను ఇంత సింపుల్ గా నొప్పి తెలీయకుండా ఉరి తీస్తే...నిర్భయకు న్యాయం జరిగినట్లేనా ? ఆమె పై మృగాళ్లు పడి వేధిస్తోంటే...పెట్టిన ఆర్తనాదాలకు సరైన సమాధానం దొరికినట్లేనా ? 7 ఏళ్ల తర్వాత నిర్భయ కేసులో సరైన తీర్పు వచ్చిందని ఆనందపడాలో లేదో కూడా తెలియని పరిస్థితి. కానీ చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకోకూడదన్న నిబంధన ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే నిర్భయ చావుకు కారణమైన ఆ మృగాళ్లను ప్రజలే కొట్టి కొట్టి చంపేశేవారేమో..!

గతేడాది 'Delhi Crime' పేరుతో నిర్భయ ఉదంతంపై తీసిన సినిమా Netflixలో సిరీస్ గా వచ్చింది. ఇదే సినిమా 2019 సన్డాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రసారమై...విమర్శకులచే ప్రసంశలందుకుంది.

Next Story